మంగళవారం 20 అక్టోబర్ 2020
Zindagi - Aug 17, 2020 , 01:58:58

ఇవి రోగ నిరోధక కోకలు

ఇవి రోగ నిరోధక కోకలు

కరోనా వేళ.. అందరి ఆరాటం రోగ నిరోధకశక్తి గురించే! నిమ్మకాయలు పిండేస్తున్నారు.. బత్తాయి రసాలు తాగేస్తున్నారు.. శొంఠి కాఫీ రుచి చూస్తున్నారు! ఆహారం విషయంలో రోగ నిరోధక మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఆహార్యంలోనూ రక్షణ కవచాలు ధరిస్తున్నారు. ముక్కుకు మాస్కు.. ముఖానికి మాస్కు.. చేతులకు తొడుగులు.. ఇలా ఎన్నో కట్టడి సాధనాలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి చీరలూ వచ్చి చేరాయి. ఆయుర్వేద వనమూలికలను అద్దుకున్న చీరలు మధ్యప్రదేశ్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఈ కోక ముచ్చట్లు చదివేయండి.

రోజురోజుకూ పెరిగిపోతున్న కొవిడ్‌ కల్లోలాన్ని తట్టుకునేందుకు రకరకాల అన్వేషణలు పురుడుపోసుకుంటున్నాయి. ఆ కోవకే చెందుతాయి ఈ ఆయుర్వేద గుణ సంపన్న చీరలు. మధ్యప్రదేశ్‌ చేనేత-హస్తకళల కార్పొరేషన్‌ ఈ ఔషధ చీరలను తయారు చేయించింది.  ప్రభుత్వ ఆదేశాలు అందుకున్న నేతన్నలు.. సాధారణ చీరలనే అసాధారణ రక్షణ కవచాలుగా తీర్చిదిద్దారు. చీర పోగుపోగులో వనమూలికలు, ఆయుర్వేద ఔషధాల సారాన్ని నిక్షిప్తం చేసి చీరలను సిద్ధం చేశారు. వీటికి ‘ఆయుర్‌ వస్త్ర’గా నామకరణం చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.

మూలికల కషాయంలో ముంచి..

ఇమ్యూనిటీని పెంచే లవంగాలు, యాలకులు, సోపు, జాపత్రి, దాల్చినచెక్క, జీలకర్ర, మిరియాలు తదితర సుగంధ ద్రవ్యాలు, పేరుమోసిన ఆయుర్వేద పత్రాలు అన్నింటినీ కలిపి నీటిలో మరిగించారు. ఈ కషాయంలో  చీర నేతకు ఉపయోగించే ముడిసరుకు 48 గంటల పాటు ఉంచుతున్నారు. తర్వాత చీర నేస్తున్నారు. ఫలితంగా ఈ చీరలు ఔషధ గుణాన్ని సంతరించుకుంటున్నాయి. తమ చీరలు కరోనాను తప్పక కట్టడి చేస్తాయంటున్నారు తయారీదారులు. ఇతర ఇన్‌ఫెక్షన్లను కూడా అరికడతాయని చెబుతున్నారు. అంతేకాదు, ఇలా తయారు చేసిన వస్ర్తాలతో మాస్కులు కూడా కుడుతున్నారు. ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకొని నేయించిన ఈ చీరలకు గిరాకీ కూడా భారీగానే ఉంటున్నది. ఇప్పటికైతే భోపాల్‌, ఇండోర్‌ నగరాల్లో చీరలను విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 36 షోరూమ్‌లలో విక్రయిస్తామని చెబుతున్నారు  అధికారులు. వీటి ధర  ఒక్కోటి రూ.3,000 నిర్ణయించారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి ధర విషయంలో మార్పులు ఉండొచ్చంటున్నారు.logo