బుధవారం 28 అక్టోబర్ 2020
Zindagi - Aug 15, 2020 , 23:56:24

వినాయక పత్రం- ఆరోగ్యదాయకం

వినాయక పత్రం- ఆరోగ్యదాయకంవినాయక చవితి నాడు గణనాథుణ్ణి పూజించడానికి 21 పత్రాలను ఉపయోగిస్తారు. ఇవి పూజలో భాగం మాత్రమే కాదు.. మన ఆరోగ్యంలో కూడా కీలకమైనవే. అనేక ఔషధ గుణాలున్న ఈ పత్రాలు ప్రాణవాయువును విడుదల చేసి, ఆయురారోగ్యాలను పెంచుతాయి. వినాయకుడితో పాటు నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వీటిలోని ఆల్కలాయిడ్స్‌ నీటిలోకి చేరి, అక్కడి రోగ కారక క్రిములను నాశనం చేస్తాయి.   ఒక్కొక్క ఆకులో కొన్ని ప్రత్యేక ఔషధ గుణాలున్నాయి. మొదటి నాలుగు ప్రతాల గురించి ఇవాళ తెలుసుకుందాం. 

అర్క పత్రం (జిల్లేడు)

జిల్లేడు ఔషధాల గని. వాత, కఫాలను ఇది సమతుల్యం చేస్తుంది. దురదను తగ్గిస్తుంది. ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల కలిగే నొప్పులను తగ్గిస్తుంది. చర్మవ్యాధులు, దగ్గు, ఆయాసం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పంచకర్మ చికిత్సకు ముందు పూర్వకర్మగా చేసే స్వేదన క్రియ కోసం జిల్లేడు ఆకులను ఉపయోగిస్తారు. అర్జున పత్రం (మద్ది)

మద్ది బెరడు చూర్ణం, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నివారించి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అర్జున వృక్ష భాగాలు హృదయ సంబంధ వ్యాధుల నివారణలో ఉపయోగపడుతాయి. చెవి నొప్పిని తగ్గించడంలో కూడా దీన్ని ఉపయోగిస్తారు.అపామార్గ పత్రం (ఉత్తరేణి)

ఇది వాత, కఫ దోషాలను సమానావస్థలో ఉంచుతుంది. శరీరంలోని విష పదార్థాలను తొలగించి, ఆకలి పుట్టిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మూత్రాశయంలో రాళ్లను కరిగిస్తుంది. నశ్యకర్మలో ప్రధానమైన ఔషధం. చర్మవ్యాధులు, దురద, అలర్జీలను తగ్గిస్తుంది. అశ్వత్థ పత్రం (రావి ఆకు)

ఈ పత్రం గణేశుడి ముఖాన్ని పోలి ఉండటం వల్ల గజానన అనీ, వీటిని ఏనుగులు తింటాయి కాబట్టి గజాశన అనీ అంటారు. ఇది కఫ, పిత్తాలను తగ్గిస్తుంది. చర్మవ్యాధులకు మంచి మందు. రక్తస్రావాన్ని అరికడుతుంది. మధుమేహాన్ని అదుపు చేస్తుంది. దీని బెరడు కషాయాన్ని పుకిలిస్తే నోటిలోని పుండ్లు, చిగుళ్ల వాపు తగ్గుతాయి. స్త్రీల వ్యాధులకు మంచి మందు.ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎం. రాజ్యలక్ష్మి

ఆయుర్వేద వైద్య నిపుణులు

ఆయుర్‌కల్ప, కొండాపూర్‌

హైదరాబాద్‌


logo