బుధవారం 30 సెప్టెంబర్ 2020
Zindagi - Aug 15, 2020 , 01:27:13

రెక్కలు తొడిగి.. నారీశక్తిని చాటి!

రెక్కలు తొడిగి.. నారీశక్తిని చాటి!

చిన్నప్పుడు ఎన్నెన్నో అనుకుంటాం.. ఏదీ సాధించకుండానే జీవితం గడిచిపోతుంది.ఆమె ఒకే లక్ష్యం ఎంచుకుంది.. 19 ఏండ్లకే  దాన్ని సాధించేసింది. ఈ ప్రస్థానంలో తన కోసం, తన దేశం కోసం.. ఎన్నో భరించింది. ఎయిర్‌ ఫోర్స్‌లో మహిళల స్థానాన్ని తొలిగా భర్తీ చేసింది. ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఆవిడే గుంజన్‌ సక్సేనా! ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో తొలి మహిళా పైలట్‌. కార్గిల్‌ యుద్ధంలో మెరుపువేగంతో హెలికాప్టర్‌ నడిపిన వీర వనిత. మన జాతి గౌరవమైన త్రివర్ణ పతాకానికి.. గర్వంగా తల ఎత్తి సెల్యూట్‌ చేసిన ధీర వనిత.

ఐదేళ్ల వయసులో గుంజన్‌ విమానాన్ని చూసింది. కాక్‌పిట్‌లోకి వెళ్లింది. ఆ క్షణంలోనే అనుకుంది తను పైలట్‌ కావాలని. ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఉండేది గుంజన్‌ కుటుంబం. తండ్రి అశోక్‌కుమార్‌ ఆర్మీ అధికారి. కూతుర్ని బాగా చదివించి.. గొప్ప ఇంటికి కోడలిగా పంపాలని తల్లి ఆశపడేది. కానీ, గుంజన్‌ మనసు విమానంపైకి మళ్లింది. ఆడవాళ్లు బైక్‌ నడిపితేనే గొప్ప అనుకునే 80లలో.. ఈ చిన్నారి విమానం నడిపేస్తా అనగానే.. విన్నవాళ్లంతా నవ్వారు. కొందరు అస్సలు పట్టించుకోలేదు. ‘నువ్వు ఆడపిల్లవు’ అని గేలి చేసినవారూ ఉన్నారు. ఆమె తండ్రి మాత్రం కూతురుకు వత్తాసు పలికాడు. ‘విమానాన్ని అబ్బాయి నడిపినా.. అమ్మాయి నడిపినా.. పైలట్‌ అనే అంటారు. నువ్వు బెంగ పెట్టుకోకు. పెద్దయ్యాక పైలట్‌ అవ్వుదువుగాని’ అని ఉత్సాహాన్నిచ్చాడు. చదువుల్లో ఫస్ట్‌గా మార్కులు సాధిస్తూ డిగ్రీ పూర్తి చేసింది గుంజన్‌. అప్పుడే 1994లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మహిళా పైలట్ల ఎంపిక చేపట్టింది. గుంజన్‌ రెక్కలు కట్టుకొని పరీక్షల కోసం ఎగిరిపోయింది. 25 మందిని సెలెక్ట్‌ చేశారు. అందులో గుంజన్‌ ఒకరు. తర్వాత శిక్షణ. ప్రతి రోజూ పరీక్ష. ప్రతి నిమిషం ఛాలెంజ్‌. ప్రతి విషయంలోనూ తానేంటో నిరూపించుకొని.. ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌గా రంగంలోకి దిగింది.

వివక్షను దాటుకొని: ఎంత కష్టపడినా.. వివక్షను మాత్రం తప్పించుకోలేకపోయిందామె. పోస్టింగ్‌ వచ్చిన తర్వాత కూడా సూటిపోటి మాటలు వినాల్సి వచ్చింది. అన్నింటినీ ఎదుర్కొని నిలబడింది. హెలికాప్టర్‌ నడపడంలో పూర్తి పట్టు సాధించింది. ఇంతలో 1999 కార్గిల్‌ యుద్ధం మొదలైంది. బాంబుల మోతలు, తూటాల వర్షం ఆమెను భయపెట్టలేకపోయాయి. వీర జవాన్లకు అండగా దేశసేవకు నడుం బిగించింది గుంజన్‌. ఎవరికే అవసరం వచ్చినా రెప్పపాటులో అక్కడ వాలిపోయేది. బేస్‌ క్యాంప్‌ నుంచి సైనిక స్థావరాలకు ఆహారం, ఔషధాలు హెలికాప్టర్‌లో తీసుకెళ్లేది. శత్రువుల స్థావరాలను కనిపెట్టి సమాచారం అందించేది. శత్రుమూకల దాడిలో గాయపడిన సైనికులను ఆగమేఘాల మీద బేస్‌క్యాంప్‌కు తరలించేది. ఈ ప్రస్థానంలో ఎన్నో భయానక పరిస్థితులు చవిచూసిందామె. యుద్ధంలో ఆమె చూపిన ధైర్యసాహసాలకు గానూ శౌర్యచక్ర పురస్కారాన్ని అందుకుంది. 

గుంజన్‌ సక్సెస్‌

ఈ వీరనారి జీవితం ‘గుంజన్‌ సక్సేనా- ద కార్గిల్‌ గాళ్‌' చిత్రంగా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 12న విడుదలైంది. సక్సెస్‌ఫుల్‌ సినిమాగా పేరు తెచ్చుకుంది. గుంజన్‌గా శ్రీదేవి తనయ జాన్వీకపూర్‌ అద్భుత నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా చూసినవారంతా.. గుంజన్‌కు సెల్యూట్‌ చేస్తున్నారు. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న మహిళలకు గుంజన్‌ వంటి ఆద్యులే స్ఫూర్తి అంటున్నారు.logo