ఆదివారం 25 అక్టోబర్ 2020
Zindagi - Aug 11, 2020 , 23:26:54

కూల్‌గా సాయం

కూల్‌గా సాయం

కాలం మారిపోయింది. ఆడవాళ్లు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు... కెరీర్‌, పెండ్లి లాంటి నిర్ణయాలు సొంతగా తీసుకునే స్వేచ్ఛను అందుకున్నారు. వినడానికి బాగానే ఉంది. కానీ చట్టసభలు, ఉద్యోగాలు... ఇలా ఏ రంగంలో చూసినా మహిళల సంఖ్య మూడో వంతును కూడా చేరుకోవడం లేదు. ఆకాశంలో సగం అంటూ ఆడవాళ్లను పొగడటమే కానీ... అవకాశాలు మాత్రం అందించడం లేదు. ఎవరో వచ్చి ఈ పరిస్థితిని మారుస్తారని ఎందుకు ఎదురు చూడటం? ఆడవాళ్లే కలిసికట్టుగా తమ తలరాతను మార్చుకోవచ్చు కదా! అనుకున్నది ఓ మహిళ. ఆ ఆలోచన ఇప్పుడు వేల మంది ఆశలకు ఆలంబనగా మారింది. ఆమె పేరు వన్షిక గోయెంకా. తన ఆలోచనే ’కూల్‌ కన్య’...

వెల్‌స్పన్‌ ఇండియా... చాలా పెద్ద వస్ర్తాల కంపెనీ. దాని యజమాని బి.కె.గోయెంకా. ఓసారి గోయెంకా ఇంటికి చుట్టాలు వచ్చారు. ఆ మాటా ఈమాటా అయ్యాక... ‘మీకు పాపం ఇద్దరూ ఆడపిల్లలే కదా. మీ తర్వాత వ్యాపారాన్ని ఎవరు చూస్తారు’ అంటూ తెగ జాలిపడిపోయారు. ఇది అక్కడే ఆడుకుంటున్న గోయెంకా చిన్నమ్మాయి, ఐదేళ్ల వన్షిక చెవిలో పడింది. ‘అదేంటి ఆడపిల్లలు మనుషులు కాదా...’ అనిపించింది. వయసుకు మించిన బాధేదో ఆమెను ముంచెత్తింది. ఇంకొన్నేళ్లు గడిచాయి. వన్షిక ఒక శానిటరీ న్యాప్‌కిన్ల కంపెనీలో చేరింది. ఒక రోజు తలెత్తి చూస్తే... తన చుట్టూ అంతా మగవాళ్లే కనిపించారు. ఆడవాళ్ల ఉత్పత్తులు తయారుచేసే సంస్థలో కూడా అంతా మగవాళ్లే ఉండటం చాలా వైరుధ్యంగా తోచింది. పని చేసే చోట... స్త్రీల సంఖ్య చాలా తక్కువగా ఉందని స్ఫురించింది. వెంటనే కూల్‌ కన్య అనే ఓ వెబ్‌సైట్‌కు శ్రీకారం చుట్టింది.

సైట్‌లోనే సమస్తం

  • కూల్‌ కన్య పేరుకే ఓ వెబ్‌సైట్‌. అందులో రిజిస్టర్‌ చేసుకుని లోపలికి అడుగుపెట్టాక కానీ తెలియదు... అదో అవకాశాల లోకమని.
  • కెరీర్‌కు సంబంధించిన సలహాలు, ఆర్థిక ప్రణాళికలకు సూచనలు, నైపుణ్యాలను పెంచుకునే ఉపాయాలు... అదీ ఇదీ అని ఏముంది! సమస్త సమచారమూ దొరుకుతుంది.
  • పని చేసే చోట వేధింపులు, కెరీర్‌లో ఎదురవుతున్న సవాళ్ల వంటి విషయాల మీద నిర్మొహమాటంగా కౌన్సెలింగ్‌ పొందవచ్చు.
  • సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాలనుకునేవాళ్లు చట్టపరంగా పాటించాల్సిన నిబంధనలు, ఏ సంస్థకీ లోబడకుండా  ఫ్రీలాన్స్‌గా పని చేయాలనుకునేవాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... అన్నీ అక్కడ వినిపిస్తాయి.
  • సైకాలజీ, పారిశ్రామిక చట్టం, డిజిటల్‌ మార్కెటింగ్‌, ప్రచురణ రంగం, ఆర్థిక శాస్త్రం, సినిమా... ఇలా వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులు తగిన సలహాలు ఇచ్చేందుకు సదా సిద్ధంగా ఉంటారు.
  • ఒకవేళ మనమే సలహా ఇచ్చేంతలా అనుభవాన్ని అందుకున్నాం అనుకుంటే... నిపుణుల బృందంతో కలిసిపోవచ్చు.
  • ఉపాధి, ఆరోగ్యం, వ్యాపార రంగాలలో ఎప్పటికప్పుడు వస్తు న్న మార్పులను సూచించేందుకు, విశ్లేషణాత్మక వ్యాసాలు అందించేందుకు ఒక కంటెంట్‌ విభాగం అందుబాటులో ఉంది.
  • కూల్‌ కన్య ద్వారా నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఎప్పుడూ ఏవో వర్క్‌షాపులను నిర్వహిస్తూనే ఉంటారు. 
  • మొత్తానికి స్త్రీలంతా ఒక చోట చేరి, ఎలాంటి సమస్యకైనా పరిష్కారం సాధించే ఓ మాయాలోకంలా అనిపిస్తుంది కూల్‌ కన్య. అయితే ఇప్పటి వరకు సలహాలు, దిశానిర్దేశాలు మాత్రమే ఇచ్చే కూల్‌ కన్య మరో అడుగు ముందుకు వేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యాల ఆధారంగా, ఉద్యోగాలు పొందగలిగే ఆన్‌లైన్‌ మార్కెట్‌గా కూడా కూల్‌కన్యను తీర్చిదిద్దుతున్నారు.

కొవిడ్‌లోనూ అదే జోరు

కరోనా పుణ్యమా అని లాక్‌డౌన్‌... దీని కారణంగా ఉద్యోగ భద్రతపై ఎందరిలోనో అనుమానాలు! కొలువులు కోల్పోయిన వారి బాధలు వర్ణనాతీతం!! ఈ విపత్కర పరిస్థితుల్లో కూల్‌ కన్య తన అభ్యర్థులకు అండగా నిలిచింది. వారు ఈ ఖాళీ సమయంలో మరిన్ని నైపుణ్యాలు సాధించేలా వెబ్‌నార్లను నిర్వహించింది. లాక్‌డౌన్‌లోనూ ఉపాధి కల్పించేలా ‘గెట్‌ వర్క్‌- 2020’ అనే కార్యక్రమం చేపట్టింది. ఇందులో పాలుపంచుకున్న13 కంపెనీలు కూల్‌ కన్య ద్వారా ఎందరికో ఉపాధి కల్పించాయి.

ప్రస్తుతం కూల్‌కన్యలో 21 వేలమంది సభ్యులు ఉన్నారు. కానీ తమ సేవలు ఇంకా చాలా మందికి అందాల్సి ఉందంటోంది వన్షిక. మన దేశంలో లక్షలాది మంది మహిళలు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని గుర్తు చేస్తోందామె. వీళ్లంతా సొంత కాళ్ల మీద నిలబడాలనే తపన ఉండి కూడా, దారి తెలియక స్తబ్ధుగా ఉండిపోతున్నారు. వీరందరికీ సాయపడేందుకు కూల్‌ కన్య సిద్ధంగా ఉందంటోంది వన్షిక.


మూడు మార్పులు రావాలి

మహిళలు మరిన్ని ఉద్యోగాలు పొందాలంటే మూడు మార్పులు తప్పనిసరి అంటోంది వన్షిక

1. అవకాశం

ఉద్యోగాలలో 30 శాతం మహిళలకు చెందాలనే చట్టాలు ఉన్నాయి. ఈ నిబంధన ప్రతి సంస్థకూ వర్తింపచేయాలి. వ్యాపార వర్గాలు కూడా చొరవ చూపాలి.

2. అభివృద్ధి

వృత్తి నైపుణ్యాలు సాధించేందుకు, పిల్లలను కన్నాక ఉద్యోగం మీద శ్రద్ధ చూపించేందుకు... తగిన కౌన్సెలింగ్‌ అందించాలి. మహిళా ఉద్యోగుల ప్రతిభను గుర్తించి, పదోన్నతులు కల్పిస్తే... మిగతా మహిళల్లో కూడా స్ఫూర్తి నింపిన వాళ్లవుతారు.

3. స్థిరత్వం 

పెళ్లి, పిల్లలు లాంటి కారణాల వల్ల చాలామంది మహిళలు ఉద్యోగాలు మానేస్తూ ఉంటారు. మహిళల జీవితాలలో వచ్చే మార్పులకు అనుగుణంగా, పని సంస్కృతిలో కూడా మార్పు రావాలి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, మెటర్నిటీ లీవ్‌ లాంటి సౌలభ్యాల వల్ల మహిళలు... కుటుంబం కోసం ఉద్యోగాన్ని త్యాగం చేయాల్సిన పరిస్థితి రాదు.


logo