సోమవారం 19 అక్టోబర్ 2020
Zindagi - Aug 11, 2020 , 23:26:49

ఇదే స్ఫూర్తితో..

ఇదే స్ఫూర్తితో..

  • పర్యావరణాన్నీ కాపాడుకుందాం

గ్రెటా గుర్తుందా? పర్యావరణ పరిరక్షణ కోసం గొంతెత్తిన ఆ గళం ఇంకా మార్మోగుతూనే ఉంది. ఏడాది కిందట ఐక్యరాజ్యసమితి నిండు సభలో ‘మా జీవితాలతో ఆడుకుంటారా.. మీకెంత ధైర్యం’ అని నినదించిన ఆ యువతి.. ఇప్పుడు మరోసారి ధ్వజమెత్తుతోంది. కరోనాపై విజయానికి కనబరుస్తున్న చిత్తశుద్ధిని పర్యావరణ పరిరక్షణలోనూ చూపాలంటోంది.

గ్రెటా థన్‌బర్గ్‌ పదిహేడేళ్ల అమ్మాయి. జీవితం ఎంత అందంగా ఉంటుందో అన్వేషించే వయసు తనది. కానీ ఆమెకు మాత్రం, తన చుట్టూ ఉన్న లోకం కాలిపోతూ కనిపించింది. చాపకింద నీరులాగా, కాలుష్యం ప్రపంచపటాన్ని కమ్మేయడం గమనించింది. నాయకుల అసమర్థతే అందుకు కారణం అని గ్రెటా నమ్మకం. అందుకే వాళ్లని మేల్కొలిపేందుకు, రెండేళ్ల క్రితమే స్కూల్‌ స్ట్రైక్‌ ఫర్‌ ైక్లెమెట్‌ పేరుతో ఓ వినూత్న నిరసనను మొదలుపెట్టింది. పర్యావరణాన్ని కాపాడమని నినదిస్తూ స్విట్జర్లాండ్‌ పార్లమెంట్‌ ముందు నిలబడేది. ఆ నిరసన ఓ ఉద్యమంలా మారింది. 150 దేశాలకు విస్తరించింది. ఓ సందర్భంలో గ్రెటా పిలుపు అందుకొని ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మంది యువతీయువకులు రోడ్డెక్కారు. ఆమె పోరు అక్కడితో ఆగలేదు. దేశదేశాలూ తిరుగుతూ.. పర్యావరణం పక్షాన తన గళాన్ని వినిపిస్తూనే ఉంది.


ఐక్యరాజ్యసమితి సభలో గ్రెటా స్పందన ఆమెను ఓ యోధురాలిగా మార్చేసింది. ఫోర్బ్స్‌ నుంచి టైమ్స్‌ వరకూ ప్రతి పత్రికలో మెరిసి సంచలనం సృష్టించింది తను. లాక్‌డౌన్‌కు ముందు వరకు గ్రెటా బిజీబిజీగా ఉండేది. విమానయానం అధిక కాలుష్య కారకమని.. నౌకల్లోనే ఖండాలను దాటేది. పదునైన విమర్శలతో నేతలకు కంగారుపుట్టించేది. కానీ ఇప్పుడు ప్రపంచమంతా కరోనాకి భయపడుతూ తనలో తాను ముడుచుకుపోతోంది. పైగా 

లాక్‌డౌన్‌ ఆంక్షలు. అయినా గ్రెటా ఊరుకుండిపోలేదు. హ్యూమానిటీ హాజ్‌ నాట్‌ ఎట్‌ ఫెయిల్డ్‌ పేరుతో ఓ 70 నిమిషాల పాడ్‌కాస్ట్‌ను విడుదల చేసింది. పర్యావరణ రక్షణకు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తే సరిపోతుంది అనే పరిస్థితిని మనం ఎప్పుడో దాటిపోయాం. ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని సరిచేయాలంటే అసాధ్యమైన కృషి జరగాలి అని హెచ్చరిస్తోంది గ్రెటా.

పర్యావరణ రక్షణలో రెండేళ్లుగా తనకు ఎదురైన అనుభవాలన్నీ ఈ పాడ్‌కాస్ట్‌ ద్వారా పంచుకుంటోంది గ్రెటా. ప్రకృతి పరిరక్షణ గురించి ప్రచారం ఎంత జరుగుతున్నా.. మార్పు  కనిపించడం లేదంటోందామె. ఓ నాలుగు పవన విద్యుత్‌ మరలు, కాసిని సౌరశక్తి కేంద్రాలు తప్ప అనూహ్యమైన పరిణామాలేవీ జరగడం లేదని తన వాదన. ప్రపంచ సదస్సుల సందర్భంగా తను వేర్వేరు దేశాలలో తిరిగినప్పుడు అక్కడి పర్యావరణం ఎంత దయనీయంగా ఉందో కూడా గ్రెటా ఈ పాడ్‌కాస్ట్‌ ద్వారా వివరించింది. కెనడాలోని ఓ హిమసముద్రం, భూతాపం వల్ల సగానికి సగం మాయమైపోయిన దృశ్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. సదస్సులలో పాల్గొన్నప్పుడు, తనతోపాటు సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపిన పెద్దలు పర్యావరణం కోసం ఏమన్నా చేసేందుకు మాత్రం వెనుకడుగు వేస్తున్నారంటూ వారి వైఖరిని ఎండగట్టింది. చాలా సందర్భాలలో, సమస్యాత్మక ప్రదేశాలకి వెళ్లకుండా తనని బెదిరించేవాళ్లని వాపోయింది.

12 అధ్యాయాలుగా సాగిన ఈ సుదీర్ఘమైన పాడ్‌కాస్ట్‌లో గ్రెటా తను చెప్పాలనుకున్నదంతా చెప్పే ప్రయత్నం చేసింది. ‘కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు, ప్రభుత్వాలన్నీ యుద్ధ ప్రాతిపదికన పని చేస్తున్నాయి. పర్యావరణ సంక్షోభాన్ని కూడా అంతే తీవ్రంగా పరిగణించి, అంతే చిత్తశుద్ధితో పరిష్క రించాలి. కాలుష్యానికి సంబంధించి పరిస్థితులు నిరాశాజనకంగా కనిపించవచ్చు, కానీ ప్రజలు తలుచుకుంటే మన చేతలే కొత్త ఆశలను కల్పిస్తాయి’ అని సందేశం ఇస్తోంది గ్రెటా.


logo