గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Aug 11, 2020 , 23:32:42

ఒంటె-సింహం

ఒంటె-సింహం

ఒక అడవిలో ఒక సింహం ఉంది.  జంతువులన్నింటికీ అది రాజు. దానికి  ‘పులి, నక్క, కాకి’ సలహాలిచ్చేవి.  లౌక్యం తెలియని  ఒంటె ఒకటి అడవికి వచ్చింది.  పులి, నక్క, కాకి  దాని వద్దకు వెళ్ళి ‘ఎవరు నీవు? ఈ అడవికి ఎందుకు వచ్చావు?’ అని అడిగాయి. అపుడు ఒంటె ‘అయ్యా! నా యజమాని పెట్టే బాధలు పడలేక నేనీ పక్క గ్రామం నుండి ఈ రోజేవచ్చాను. దిక్కు లేని దాన్ని. నన్ను కాపాడి పుణ్యం కట్టుకోండి’ అని అభ్యర్థించింది. ‘అలాగే, భయపడకు! నిన్ను మా జట్టులో చేర్చుకుంటాం. మా రాజు ఎంతో మంచివాడు. ఆయనకు చెప్పి నీకు మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తాం. మా వెంట రా!’ అని  సింహం వద్దకు తీసుకెళ్లాయి.   ‘ప్రభూ!  మంచి బలం కలవాడు, బుద్ధిమంతుడు, మిమ్మల్ని సేవించడానికి వచ్చాడు’  అని గొప్పగా పొగిడాయి. సింహం ఒంటెను కూడా తన మంత్రులలో ఒకనిగా నియమించింది.  క్రమక్రమంగా ఒంటె మంచితనం సింహానికి బాగా నచ్చింది. అది ఒంటెను ఆప్తమిత్రునిగా భావించి తన రాజ్యానికి ప్రధానమంత్రిని చేసింది. నిన్నగాక మొన్న వచ్చిన ఒంటె ప్రధాని అయిందని పులి, నక్క, కాకి దానిని ద్వేషించసాగాయి. ఒకసారి సింహానికి జబ్బు చేసి కదలలేని పరిస్థితి ఏర్పడింది. అపుడు పులి, నక్క జంతువులను వేటాడి తెచ్చి సింహానికి ఆహారంగా పెట్టేవి. ఒకరోజు అవి  ఎంత వేటాడినా ఒక్క జంతువు దొరకలేదు. విచారంగా సింహం దగ్గరకు వచ్చాయి.  తాము పన్నిన ఉపాయంతో కాకి ‘తమవంటి ప్రభువులకు ఉపయోగపడని ఈ శరీరమెందుకు? మీ ఆకలి బాధ చూడలేకున్నాను. నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి’ అన్నది. అపుడా సింహం ‘నీ వంటి అల్ప జీవులను చంపితే నా ఆకలి తీరుతుందా? నీ మాంసం నాకు ఒక పంటి కిందకు కుడా చాలదు’ అంటుండగా నక్క కలిగించుకొన్నది. ‘ప్రభూ! నన్ను  భక్షించి మీ ఆకలి బాధ చల్లార్చుకోండి’ అన్నది. అందుకు సింహం ‘ఎంత చేతకాకున్నా నీ వంటి క్షుద్ర జంతువులను చంపి తింటానా! కుక్కలు, నక్కలు జంతువులలో నీచమైనవి.  శవాలను పీక్కుతినే నక్క ఈ రాజుకు భోజనమా? నిన్ను చంపి తినడం కంటే ఆకలితో చావటం మేలు’ అని పలికింది.  అపుడు పులి ‘మహారాజా! నన్ను తినండి. ఇన్నాళ్ళుగా మీకు సేవ చేసిన నేను మీరు ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు వదలడం చూడలేను’ అన్నది. అపుడు సింహం పులితో ‘ఓరీ! నీవు గోవులు, మేకలు, కుందేళ్ళు వంటి సాధు జంతువులను తిన్న మహా పాపివి. నిన్ను ముట్టుకోవడమే  పాపం. నిన్ను నేను భక్షించను’ అని పలికింది. తర్వాత ఒంటె, రాజు వద్దకు పోయి ‘సింహరాజా! నా శరీరం ఎంతో పెద్దది. నన్ను భక్షిస్తే మీ ఆకలి  తీరుతుంది. కాబట్టి సందేహించక నన్ను తినండి’ అన్నది.  ఆ సంగతి గమనించిన కాకి ‘మహారాజా! మీరు మా ముగ్గురిని తినడానికి ఒప్పుకోలేదు. సరే ఇతని ప్రార్థననైనా మన్నించి తమ ఆకలి తీర్చుకోండి’ అన్నది. నక్క, పులి కూడా ఆ మాటలనే సమర్థ్ధించాయి. ఆకలితో ఉన్న సింహంవారి మాటలకు లొంగిపోయింది.   సింహం వెంటనే ఒంటెపై పడి చంపింది.  ఆ రోజు ఒంటె  మాంసం తిని ఆకలి బాధ తీర్చుకుంది. 


logo