ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Zindagi - Aug 11, 2020 , 07:57:45

కుందేలు తెలివి

కుందేలు తెలివి

అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది.  చాలా బలమైనది. రోజూ  జంతువులను వేటాడి తినేసేది. ఒకొక్కసారి ఆకలి లేకపోయినా వినోదం కోసం    జంతువులను వేటాడేది. అడవిలో జంతువులన్నీ ప్రాణ భయంతో ఉండేవి. ఈ సమస్యని ఎదుర్కోవడం ఎలా అని ఒకరోజు అన్ని జంతువులూ  అలోచించాయి. సింహాన్ని కలిసి సంధి చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. అనుకున్న ప్రకారం నక్క ద్వారా సింహానికి కబురు పెట్టాయి. మరుసటి రోజు  జంతువులన్నీ సింహాన్ని కలవడానికి వచ్చాయి.  ఒక ముసలి కోతి సింహంతో ఇలా అంది ‘మీరు మమ్మల్ని కలవడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు’. సింహం దర్జాగా తల ఊపింది. అప్పుడు కోతి ‘మీరు ఆకలి తీర్చుకోవడానికి రోజుకొక్క జంతువుని చంపడం సమంజసమే. మీకూ ఆహారం కావాలి. కానీ అవసరానికి మించి మీరు జంతువులను చంపడం న్యాయం కాదు. మీరు ఒప్పుకుంటే ఈ రోజు నుంచి మేమే మాలో  చీటీలు వేసుకొని ఒక్కళ్ళని ఎంచుకుంటాం. ఆ చీటీలో ఏ జంతువు పేరు ఉంటుందో, ఆ జంతువు నేరుగా మీ గుహకు వచ్చి మీకు ఆహారం అవుతుంది. దానికి మీరు సరేనంటే.. అడవిలో జంతువులు ప్రశాంతంగా ఉండొచ్చు’ అని వివరించింది.  సింహానికి ఈ సలహా నచ్చింది. అడవిలో జంతువులు వాటంతట అవే బలవుతుంటే రోజూ వేటకి వెళ్ళే పని ఉండదు, హాయిగా ఉండచ్చు అనుకుని సింహం ఒప్పుకుంది.  రోజుకొక జంతువు సింహానికి బలి  అవ్వడం మొదలెట్టాయి. కొన్ని రోజులకు  కుందేలు వంతు వచ్చింది. పాపం కుందేలు చాలా భయ పడిపోయింది. ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుంది. గుహకు వెళ్తుంటే.. దారిలో ఒక నుయ్యి కనిపించింది. దాంట్లో నీళ్ళు చూశాక దానికి ఉపాయం తట్టింది. అక్కడే పొద్దు పోయే దాకా కూర్చుని, సాయంత్రానికి ప్రశాంతంగా లేచి పరిగెత్తుకుంటూ సింహం దగ్గరికి వెళ్ళింది. పొద్దుటి నుంచి ఆహారం కోసం ఎదురు చూస్తున్న సింహం బాగా రుసరుసలాడుతూ, కోపంగా గుహ ముంగిట్లో పచార్లు చేస్తున్నది.  కుందేలుని చూడంగానే ‘ఏమిటి ఇంత ఆలస్యం?’ అని కోపంగా గర్జించింది.  ‘క్షమించండి మహారాజా! నేను పొద్దున్నే మీ వద్దకు రావటానికి బయలుదేరాను. కానీ దారిలో ఇంకొక సింహం కనిపించింది. అది నన్ను తినబోతుంటే, ఈ రోజు నేను మీకు ఆహారాన్ని అన్న విషయం చెప్పాను. కానీ ఈ అడవికి రాజును నేనే అని గర్జించింది.  దానిని తప్పించుకొని వచ్చే సరికి ఆలస్యం అయింది’ అని కుందేలు చెప్పింది.  అసలే కోపం మీద ఉన్న సింహం   భగ్గున మండింది.

‘ఎక్కడ ఆ సింహం! చూపించు నాకు!’ అన్నది. కుందేలు ఈ సింహాన్ని నూతి దగ్గరకు తీసుకుని వెళ్ళింది. మరో సింహం నూతిలో ఉందని చెప్పింది.  సింహం నూతిలోకి చూసింది. నీళ్ళల్లో తన ప్రతిబింబం చూసి మరో సింహం అని  అపోహపడి గర్జించింది. ఆ గర్జన నూతిలో ప్రతిధ్వనించింది. సింహం తన ప్రతిబింబంతోనే యుద్ధం చేయడానికి నూతిలోకి దూకేసింది. నీళ్లలో పడి మరణించింది. కుందేలు ప్రాణాలతో బయటపడింది. అడవిలో మిగిలిన జంతువులకు జరిగినదంతా చెప్పింది. జంతువులన్నీ కుందేలు తెలివికి మెచ్చుకున్నాయి. ఆ రోజునుంచి  అడవిలో ప్రశాంతంగా నివసించాయి. 


logo