బుధవారం 21 అక్టోబర్ 2020
Zindagi - Aug 11, 2020 , 00:06:09

రాధ ఓ విజయమార్గం

రాధ ఓ విజయమార్గం

రాధ... కన్నయ్యకు రేపల్లెలో సహచరి మాత్రమే కాదు. నల్లనయ్య వేణుగానానికి అన్నీ మరచిపోయి మురిసిపోయిన ప్రేయసి మాత్రమే కాదు. కృష్ణుడి మాయకు శక్తి రాధ. ఆరాధనకు ప్రతీక రాధ. అందుకే కృష్ణ తత్తాన్ని గ్రహించే ప్రయత్నంలో ఎందరో యోగులు, సిద్ధులు రాధామాయి అనుగ్రహం కోసం తపస్సు చేస్తుంటారు. రాధమ్మ అసమాన వ్యక్తిత్వం ఆధ్యాత్మిక సాధకులకే కాదు.. లౌకికులకు అరుదైన పాఠాలు చెబుతుంది.

ప్రేమకు ఉపాయం

కృష్ణుడు పరమాత్మ అయితే ఆయనని చేరుకునే మార్గం చూపిన భక్తురాలు రాధ. అందుకే జయదేవుడు మొదలుకొని చైతన్య మహాప్రభు వరకు అనుక్షణం రాధనే తలుచుకునేవారు. నిష్కల్మషమైన ప్రేమ, చెదరని నమ్మకం ద్వారానే ఒకరి మనసులో నేరుగా స్థానం సంపాదించుకోగలం అనే ఉపాయానికి సూచన రాధ.

పరిపక్వతకు సూచన

కృష్ణుడిని పదహారువేల మంది గోపికలు ఆరాధించారు. గోపాలుడు వారందరి ప్రేమనూ స్వీకరించినా.. రాధను మాత్రమే తన సహచరిగా భావించేవాడు. పదహారు వేల మంది గోపికలకు తమ లక్ష్యంపై నిబద్ధత వేర్వేరు స్థాయిలలో ఉంది. ఒక్క రాధ మనసు మాత్రమే పూర్తిగా సాధనలో మునిగిపోయేది. లక్ష్య సాధనలో నూరు శాతం నిబద్ధత ఉన్నప్పుడు.. అందరినీ దాటుకొని ముందుగా గమ్యాన్ని చేరుకుంటామని చెప్పకనే చెబుతుంది రాధ.

త్యాగమే ఎదుగుదల

కృష్ణుడు కంసుని సంహరించడానికి వెళ్లేముందు, తను తిరిగి వచ్చేదాకా కన్నీరు ఒలికించనని రాధ మాట ఇచ్చిందట. ఆ ధైర్యంతోనే కృష్ణుడు ముందడుగు వేశాడు. మన అనురాగం ఎదుటి వ్యక్తి ఎదుగుదలకు అడ్డుపడకూడదు. రెక్కలు వచ్చిన పక్షి.. కాళ్లు నేల మీదే ఉండిపోవాలనుకోవడం మూర్ఖత్వం. ప్రేమ బలం కావాలే కానీ ఎప్పటికీ బలహీనతగా మారకూడదు.

ఆశే శ్వాస

రాజారవివర్మ వేసిన చిత్రాలలో కృష్ణుడి కోసం రాధ ఎదురుచూస్తున్నట్లు రూపొందించిన బొమ్మ ఒకటి ఉంది. కృష్ణుడు ఎన్ని పనులు మధ్య ఉన్నా, ఎన్ని సాహసాలలో మునిగితేలుతున్నా తనకి ఇచ్చిన మాట కోసం వచ్చి తీరతాడనే ఆశ రాధది. ఆమె ఊహించినట్టుగానే, మాట ఇచ్చిన చోటుకే చేరుకునేవాడు కన్నయ్య. గోధూళివేళను తన మురళీనాదంతో మరింత ఎరుపెక్కించేవాడు. ప్రేమలో అయినా, ప్రయత్నంలో అయినా ఆశ లేకపోతే జీవితం ప్రయాసగానే తోస్తుంది. నిరంతరం ఆశతో సాగుతుంటేనే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఫలితం ముక్తిలో ఉండే ప్రశాంతతను తలపిస్తుంది.

ఎవరేమనుకున్నా

రాధ కృష్ణుడికంటే ఐదేళ్లు పెద్దదని చెబుతారు. ఆయన అష్టభార్యలలో ఆమెకు చోటు లేదు. కేవలం ప్రియురాలిగానే మిగిలిపోయింది. ఇద్దరూ ఒకే ప్రాణం కాబట్టి, దాన్ని పట్టి ఉంచే భౌతిక బంధం అనవసరం అని వారి అభిప్రాయం. జీవాత్మపరమాత్మలు కలిసే ఉంటాయి. వాటిని గ్రహించే ఎరుక ఉండాలంతే. అదలా ఉంచితే లౌకికపరంగా వారి నిర్ణయం ఓ సాహసమే! ఎవరేమనుకున్నా, మన నిర్ణయానికి కట్టుబడాలనే ధైర్యానికి సాక్ష్యమే!

అన్నిటికన్నా ముఖ్యంగా రాధ.. చలనానికి చిహ్నం. శక్తి, ధనం, ఆరోగ్యం జీవితంలో ఎన్ని ఉన్నా సరే కృషి (చలనం) లేకపోతే ఏమీ సాధించలేం. అందుకేనేమో రాధ అనే శబ్దానికి సంస్కృతంలో అనురాగం, విజయం, సంపద అనే అర్థాలు కూడా చెబుతారు. ప్రయత్నం లేనిదే వీటిని సాధించలేము అనే సూచన కావచ్చు.


logo