బుధవారం 30 సెప్టెంబర్ 2020
Zindagi - Aug 10, 2020 , 00:09:29

ఆమె..అడవిని వరించింది!

ఆమె..అడవిని వరించింది!

చెన్నై మహానగరం. వెన్నెలని కూడా మసకబరిచే విద్యుద్దీప కాంతి. ఒకటే,  వాహనాల రొద. ఆ హడావుడి నుంచి జానకి లెనిన్‌ కారు... దూరంగా జారుకుంటున్నది. ఇంకా... మరింకా... సిటీకి దూరంగా పరుగులు తీస్తున్నది. ఒక్కో కిలోమీటరు దాటేకొద్దీ, అమ్మ ఒడికి దగ్గరవుతున్న అనుభూతి. అలా ఓ గంటసేపు దక్షిణంగా ప్రయాణించిన తర్వాత, గమ్యం రానేవచ్చింది. అది ఆమె అడవి! తనతో పాటు కొన్ని వందల జీవాలు హాయిగా బతికేస్తున్న పచ్చని స్వర్గం!

జానకి లెనిన్‌. పేరు మాత్రమే కాదు, వ్యక్తిత్వమూ విలక్షణమే. ఆమెకు.. పచ్చని మొక్కను చూస్తే పలుకరించ బుద్ధవుతుంది. పారే సెలయేరును తడిమి కుశలం అడగాలనిపిస్తుంది. తాచుపాము పడగను చూస్తే, గౌరవంగా పక్కకి తప్పుకోవాలనిపిస్తుంది. ప్రకృతి పట్ల ఆ అంతులేని ప్రేమే ఆమెను రోమ్‌ విటేకర్‌కు దగ్గర చేసింది. తనకంటే 27 ఏళ్లు పెద్దవాడైనా ఏరికోరి పెండ్లి చేసుకుంది. చెన్నైలో విటేకర్‌కు సినిమా స్టార్లతో సమానమైన క్రేజ్‌ ఉంది. పాముల మీద అధ్యయనాన్నే కెరీర్‌గా ఎంచుకున్న వ్యక్తి తను. చెన్నై స్నేక్‌ పార్క్‌, మద్రాస్‌ క్రొకొడైల్‌ బ్యాంక్‌ విటేకర్‌ స్థాపించినవే. మొదట్లో వాళ్లిద్దరూ కలిసి, వన్యప్రాణుల మీద డాక్యుమెంటరీలు రూపొందించేవారు. క్రొకొడైల్‌ బ్యాంకే వాళ్ల నివాసంగా ఉండేది. వందలాది మొసళ్లు, పాముల మధ్య... కించిత్‌ కూడా భయంగా అనిపించేది కాదు. అవే తమ ప్రాణం అనుకున్నప్పుడు, ప్రాణభయం ఎలా ఉంటుంది? ఇక తమకంటూ ఓ సొంత ఇల్లు కావాలని అనుకున్నప్పుడు... ఇదిగో ఈ చోటికి చేరుకున్నారు.

ఆకుపచ్చ జ్ఞాపకం: 20 ఏండ్ల నాటి సంగతి. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం జానకి, విటేకర్‌ ఓ పన్నెండు ఎకరాల బంజరు భూమిని చూస్తూ నిలబడ్డారు. ‘ఇదే మనం ఉండబోయే చోటు’ అన్నాడు విటేకర్‌. ‘ఇక్కడెలా ఉంటాం? పిచ్చి మొక్కలు కూడా పెరిగేట్టు లేవు’ అంటూ చిరాకు పడింది జానకి. ఆ నేల నుంచి వస్తున్న వేడి ఆవిర్లకి వాళ్ల కండ్లు బైర్లు కమ్ముతున్నాయి. ‘ఏడేండ్లు ఓపిక పట్టు... ఇదో తోటలా మారిపోతుంది’ అని భరోసా ఇచ్చాడు విటేకర్‌. అతని నమ్మకం ఆమెలో ఆశను రగిలించింది. ఆ తర్వాత మరో ప్రశ్న రానే లేదు. ఇద్దరూ కలిసి రకరకాల మొక్కలు నాటారు. నాటినంత వేగంగానే, అవి ఎండుపుల్లల్లా మారిపోయాయి.


ఈసారి జాగ్రత్తగా ఆలోచించి ‘ఇయర్‌లీఫ్‌ అకాషియా’ జాతి మొండి చెట్లను తెచ్చారు. ఇవి ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకోవడంతో పాటు భూమిలో నత్రజని శాతాన్ని పెంచుతాయి. వాటి నీడ కింద, చిన్నచిన్న చెట్లు పెరిగే అవకాశం కూడా ఇస్తాయి. వాటితో అక్కడి నేల తీరు మారింది. ఉపరితలం కొంత చల్లబడింది. ఇనుమడించిన ఉత్సాహంతో  జానకి రకరకాల మొక్కలను నాటారు. ఈసారి ప్రయత్నం వృథాగా పోలేదు. ఆ తర్వాత పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకపోయింది. ప్రకృతే అక్కడి నేలను సంరక్షించే బాధ్యత తీసుకుంది. రకరకాల చెట్లు ఎదిగాయి. కాళ్లజెర్రిలు మాత్రమే తిరిగిన నెర్రెల నేలపైన... కోతులు, ముంగిసలు, ముండ్ల పందులు, అడవి పిల్లులు, నెమళ్లు.. సందడి చేశాయి. 

ఓ రోజు ఆ దంపతులు ఇష్టంగా పెంచుకుంటున్న జర్మన్‌ షెపర్డ్‌ కనిపించకుండా పోయింది. కారణం ఏమిటని ఆరాతీస్తే, ఇదంతా ఆ అడవిలోకి కొత్తగా ప్రవేశించిన చిరుతపులి పనే అని తేలింది. పెంపుడు జంతువును కోల్పోయిన బాధ ఉన్నా, తమ అడవి చిరుతలనూ ఆకర్షించగలిగినందుకు సంతోషించారు జానకి.

తోడుగా అక్షరం:  ఇంటి చుట్టూ అందమైన అడవిని సృష్టిస్తూనే.. తనకు ఇష్టమైన రచనా రంగంలోకి కూడా అడుగుపెట్టింది జానకి. వన్యప్రాణులను దగ్గర నుంచీ పరిశీలించిన అనుభవాలు, ఎప్పటికప్పుడు గమనించిన విషయాలూ ఓచోట గుదిగుచ్చి.. అనేక వ్యాసాలు రాసింది. వాటి సంకలనంగా వచ్చిన 

‘మై హజ్బెండ్‌ అండ్‌ అదర్‌ యానిమల్స్‌' పుస్తకం ఓ సంచలనం. బంగారంలాంటి భర్తను, జంతువులను ఒక గాటన కట్టేస్తావా? అంటూ కొంతమంది చిరాకుపడ్డారు. అయినా, ఆమె పట్టించుకోలేదు. ‘మనుషులకు ప్రత్యేకమైన సంస్కృతి, భాష, ఉద్వేగాలు ఉన్న కారణంగా జంతువుల కంటే మనం అధికులమని అనుకుంటాం. కానీ ఈ సృష్టిలో ప్రతి ప్రాణీ సమానమే’ అంటారు. ఆ పుస్తకం హిట్‌ కావడంతో రెండో భాగాన్నీ తీసుకువచ్చారు. ఈమధ్యే ‘ఎవ్రీ క్రీచర్‌ హాజ్‌ ఏ స్టోరీ’ అనే మరో పుస్తకమూ విడుదల అయ్యింది. భారతీయ సాహిత్యంలో, జంతులోకాన్ని అక్షరబద్ధం చేసిన పుస్తకాలు చాలా తక్కువ. ‘మానవ సమాజంలోని అనేక సమస్యలకు జంతువుల వద్ద సమాధానం ఉంది‘  అన్నదే ఆ పుస్తక సారం.

ప్రతీక్షణం అద్భుతమే..

ఇంతకీ,  నిర్మానుష్యమైన  అడవిలో, ఆ పాములు పట్టే పెద్దాయనతో  జీవితం బోర్‌ కొట్టదా అంటే నవ్వేస్తుంది జానకి. ‘సిటీలో ఆ కార్లు, అపార్టుమెంట్లు, షాపింగ్‌ మాల్స్‌,  ట్రాఫిక్‌ మధ్య ఊపిరిఆడనట్టు ఉంటుంది. అక్కడ, మహా అయితే  జనాలను గమనించగలను. అంతే! కానీ ఇక్కడ అలా కాదు. నా చుట్టూ ఉండే ప్రకృతిని... చూసి, పరవశించి, ఆశ్చర్యపోయేందుకు ఎన్నో సందర్భాలు! అడవిలో గడిచే ప్రతి క్షణమూ అద్భుతమే! ఈ ప్రశాంత వాతావరణంలో నా ఇంద్రియాలు కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంటాయి’ అంటున్నారామె.

తాజావార్తలు


logo