శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Zindagi - Aug 09, 2020 , 01:50:16

ఇమ్యూనిటీ..నైవేద్యం సమర్పయామి!

ఇమ్యూనిటీ..నైవేద్యం సమర్పయామి!

శ్రావణం.. పండుగల మాసం, నోముల నెల! ఇక.. శుక్రవారాలూ, మంగళవారాలూ అమ్మవారికి నివేదనలు తప్పనిసరి. కరోనా సమయంలో.. పరమాత్మకు నివేదించే ఆ నైవేద్యమేదో పోషక విలువలు కలిగినదైతే, రోగ నిరోధకశక్తిని పెంపొందించేదైతే .. భక్తిగా పూజించిన తర్వాత, తృప్తిగా ఆరగించవచ్చు. మనలో జఠరాగ్ని రూపంలో కొలువైన  ఆ పరమేశ్వరుడి కటాక్షంతో కొవిడ్‌తో పోరాడవచ్చు.

దద్దోజనం

బియ్యం, పెరుగు, ఇంగువ, కొత్తిమీర, అల్లం, మిర్చి, శొంఠిపొడి మిశ్రమంతో తయారు చేసే ఈ ప్రసాదం మేధస్సును పెంచుతుంది. శరీరానికి శక్తిని ఇచ్చి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.

కొబ్బరిపాల పాయసం

కొబ్బరిపాలు, పచ్చకర్పూరం, యాలకుల పొడి, బాదం పప్పు, కుంకుమ పువ్వు, పంచదార, ఆవుపాలు, కలకండ పొడితో చేసే ఈ ప్రసాదం తక్షణ శక్తిని ఇస్తుంది. బలవర్ధకం. శ్లేష్మాన్ని హరిస్తుంది.

కట్టె పొంగలి

బియ్యం, పెసరపప్పు, జీలకర్ర, ఇంగువ, నెయ్యి, అల్లం, శొంఠి పొడి, ఉప్పు, కరివేపాకు, జీడిపప్పు మిశ్రమంతో తయారు చేస్తారు. కట్టె పొంగలిలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంది. జీర్ణశక్తిని అధికం చేసి, ఆకలిని కలిగిస్తుంది.

పులిహోర

బియ్యం, చింతపండు పులుసు, శనగపప్పు, మినుప పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు, ఇంగువ, పసుపు, బెల్లం, నూనె, వేరుశనగలు, జీడిపప్పు మిశ్రమంతో తయారు చేసే పులిహోరా జీర్ణశక్తిని పెంచుతుంది. జీర్ణకోశ వ్యాధులను నివారిస్తుంది.

చలిమిడి

బియ్యం పిండి, బెల్లం, యాలకులు, నెయ్యి, పచ్చకర్పూరం, జీడిపప్పు, ఎండుకొబ్బరితో తయారు చేసే చలిమిడి  బలవర్ధకం.

పూర్ణాలు

పచ్చిశనగ పప్పు, బెల్లం, కొబ్బరి తురుము, యాలకుల మిశ్రమంతో ఈ ప్రసాదం చేస్తారు. శ్లేష్మాన్ని హరిస్తుంది. బలవర్ధకం.

కదంబ

బియ్యం, చింతపండు, ఎండుమిర్చి పోపులు, ఇంగువ నూనె, ఉప్పు, కందిపప్పు, పసుపు, బెల్లం, నెయ్యి, బెండకాయ, వంకాయ, గుమ్మడికాయ, చిక్కుడు, బీన్స్‌, దోసకాయ, క్యారెట్‌, టమాటా మిశ్రమంతో తయారు చేసే కదంబ ప్రసాదం అత్యంత ఆరోగ్యకరం. అన్ని వయసుల వారికీ మంచిదే.


logo