ఆదివారం 25 అక్టోబర్ 2020
Zindagi - Aug 08, 2020 , 01:43:18

అజ్ఞాతవాసి..ఆదివాసి!

అజ్ఞాతవాసి..ఆదివాసి!

ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

భిన్నమైన సంస్కృతి. విభిన్నమైన సంప్రదాయాలు. వైవిధ్యమైన ఆహార్యం. తరాలనాటి జీవనశైలి. పాశ్చాత్య పోకడలు విస్తరిస్తున్న నేటి రోజుల్లో.. తమవైన ఆచారాలను పాటిస్తూ, తమదైన జీవనశైలిని కొనసాగిస్తూ కొండాకోనల్లో అజ్ఞాతవాసం చేస్తున్నారు ఆదివాసీలు. మనిషి మూలాల చరిత్రతో పెనవేసుకున్న జీవితాలు వారివి.

ఆదివాసీలు చరిత్ర నిర్మాతలు. సంస్కృతీ సంప్రదాయాల రక్షకులు. ఆధునిక పోకడలు, పాశ్చాత్య వైఖరులు, సాంకేతిక విస్తరణలతో కాలమూ, కాలంతోపాటు ప్రజలూ మారిపోయారు. జీవన విధానమూ మారిపోయింది. మనిషి మూలాలేమిటో ఇప్పుడు ఎవరికీ పెద్దగా తెలియవు. కానీ, కొన్ని ఆదిమ తెగలు మాత్రం మూలాలే పునాదులుగా బతుకుతున్నాయి. పాతకు జాతర చేస్తున్నాయి. తెలంగాణలోని ఆదివాసీలూ అందుకు మినహాయింపు కాదు.

ఓ కథనం ప్రకారం.. మహారాష్ట్రలో భూమికోసం, భుక్తికోసం మొఘల్‌ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న గిరిజనులు, ఛత్రపతి శివాజీ మహారాజ్‌తో జట్టుకట్టారు. హైదరాబాద్‌ రాజ్యంపై ఛత్రపతి దండెత్తినప్పుడు అతడి సైన్యంలో భాగమై హైదరాబాద్‌ రాజ్యానికి వచ్చారు. యుద్ధానంతరం, ఈ సైన్యాల్లోని లంబాడీలు తమతమ కుటుంబాలతో తండోపతండాలుగా ఇక్కడికి తరలివచ్చారు. గిరిజన ఆవాసాలకు తండాలు అన్న పేరు రావడానికి ఇదొక కారణమని అంటారు. గ్రామాలకు దూరంగా, బంజరు భూములలో నివాసాలను ఏర్పాటు చేసుకొని స్థిరపడటంతో బంజారాలన్న పేరూ వచ్చింది. ముఖ్యంగా, ఈ గిరిజనులంతా గోదావరి, కృష్ణా తీరప్రాంతాల్లో స్థిరపడ్డారు. కొండాకోనల్లో, అడవి తల్లి ఒడిలో నివాసాలను ఏర్పరచుకున్నారు. వీరికి సంప్రదాయాలు అంటే ప్రాణం, ఆచారాల పట్ల అపారమైన గురి. 

ఎంతమంది? 

పదేండ్ల నాటి జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్రంలో గిరిజనుల సంఖ్య 31 లక్షల పైచిలుకు. తెలంగాణలో పన్నెండు తెగలతో విస్తరించిన గిరిజనులలో 20 లక్షలకు పైగా లంబాడీలే. 1976 నుంచీ ప్రభుత్వం లంబాడీలతోపాటు ఆయా తెగలను మైదాన ప్రాంత గిరిజనులుగా గుర్తించి, ఆ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నది. రాష్ట్ర అవతరణ అనంతరం.. అడవిబిడ్డలు ఆత్మస్థయిర్యంతో బతికేలా, గిరిజన తెగలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ప్రత్యేకించి ప్రతి తండానూ గ్రామ పంచాయతీగా గుర్తించింది. అటవీ హక్కుల చట్టం అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. అటవీ ఉత్పత్తులపై ఆధారపడ్డ అడవి బిడ్డలకు స్వావలంబన ప్రసాదించే దిశగా అడుగులు వేస్తున్నది.  

మౌఖిక సాహిత్యం 


గిరిజన సంస్కృతిలో జానపద గేయాలకు, నృత్యాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయా తెగల మహిళలు సంప్రదాయ దుస్తుల్లో, మోచేతుల్ని కప్పే గాజులతో, ఒంటినిండా వెండి ఆభరణాలతో, కాళ్ళకు భారంగా వేలాడే కడియాలతో వేసే ఆ అడుగులు వింతైన సంగీతాన్ని వినిపిస్తుంటాయి. గుండ్రంగా తిరుగుతూ, చేతులు పైకెత్తి డప్పు వాద్యాలకు అనుగుణంగా, లయబద్ధంగా  కాళ్ళు కదుపుతూ చేసే నృత్యాలు ఆధునిక నాట్య రీతులకూ ప్రేరణగా నిలిచాయి. కోయ తెగలు చేసే కొమ్ము నృత్యం సింధూ నాగరికతను స్ఫురింపజేస్తుంది. ఖమ్మం అటవీప్రాంతంలోని గిరిజనుల ‘థింసా’, గోండుల ‘దెంసా’, లంబాడీల సంప్రదాయ నృత్యాలు.. విశేష ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. గిరిజన మహిళలు సంతోషాన్నే కాదు, దుఃఖాన్నీ జానపదాల ద్వారానే వ్యక్తపరుస్తుంటారు. తమకంటూ భాషలు ఉన్నా, వాటికంటూ ఓ లిపి లేకపోవడం ఆదివాసీలకు పెద్ద లోటు. ఫలితంగా, ఈ తెగలకు లిఖిత సాహిత్యం అంటూ లేకుండా పోయింది. దీంతో గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలు మౌఖిక సాహిత్యంగానే మిగిలిపోయాయి.  ఆదిలాబాద్‌ జిల్లాలో గోండు రాజులకు చెందిన గోండి భారతం, అంకంరాజు కథ, బోయ ధర్మయ్య ఆధ్యాత్మిక, నాటక సాహిత్యాలే కాకుండా చెంచు, బంజారా సాహిత్యాలను గిరిజన ఔత్సాహిక సాహితీవేత్తలు ఇటీవల తెలుగుభాషలో వెలుగులోకి తెస్తున్నారు. ఈ రూపంలో, సుసంపన్నమైన తమ సంస్కృతిని ప్రపంచానికి చాటుతున్నారు.  

చరిత్రకు ఆధారం

పూర్వ ఆదిలాబాద్‌ జిల్లా గోదావరి, దాని ఉపనది కడెం పరీవాహక ప్రాంతాల్లో ఐదు లక్షల సంవత్సరాల క్రితమే ప్రాచీన తెగలు నివసించాయనడానికి పురావస్తు ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పాతరాతి యుగపు జీవనాన్ని తెలిపే ఆనవాళ్ళు లభ్యమయ్యాయి. ఆదిలాబాద్‌ జిల్లా గోదావరి తీరప్రాంత అడవుల్లో, నిర్మల్‌- సత్మల్‌ కొండల్లో గిరిజనుల పూర్వీకులైన గోండులు, నాయకపు వాళ్ళు, తోటి, ప్రధాన్‌, కోలమ్‌ తెగలతోపాటు ఆంధ్రులకు మూలపురుషులైన అంథ్‌ల  మూలాలూ ఇక్కడినుంచే వచ్చాయని అంటారు. గిరిజనుల పూర్వీకులు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో స్థిరపడటంతో ఆయాచోట్ల  పుణ్యక్షేత్రాలు వెలిశాయి. గిరిజనులకు ఆరాధ్యులైన సంత్‌ సేవాలాల్‌ (ఆదిలాబాద్‌-కొత్తపల్లి), టేకులపల్లి సేవాలాల్‌ (ఖమ్మం), సమ్మక్క-సారక్క (వరంగల్‌-మేడారం) నడయాడిన ప్రాంతాలు పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. 

వృత్తి, ప్రవృత్తి కళలే 


గిరిజన తెగలు ఆవాసాలను పుట్టమన్నుతో అలుకుతారు.  రకరకాల చిత్రాలతో అలంకరిస్తారు. గుడులు, గోపురాలు వెలియక ముందు.. కొయ్య బొమ్మలను మూర్తులుగా కొలిచేవారు. ఆ ఆనవాళ్లు ఇప్పటికీ ఇక్కడ చెక్కుచెదరలేదు. నేటికీ కొయ్య విగ్రహాలను చేసుకొని వాటిని ప్రత్యేకమైన రంగులతో అలంకరిస్తుంటారు. నాయకపు తెగకు చెందిన గిరిజనులు దారుశిల్పాలను చేయడంలో సిద్ధహస్తులు. గొర్రెపోతు, గుర్రం, పోతరాజు, ఎర్రగొండ-నల్లగొండ రాక్షసుల చిత్రాలను చెక్కతో చేసి పండుగలు జరుపుకొంటారు. నాగరికత తెలియని రోజుల్లోనే  బంజారా మహిళలు సంప్రదాయబద్ధ్దంగా ధరించే 27 రకాల వెండి నగలను కళాత్మకంగా డిజైన్‌ చేసుకున్నారు. ఎన్నో ఆధునిక ఆభరణాలకు వీరి డిజైన్లే స్ఫూర్తి. ఎంబ్రాయిడరీలోనూ  వీరు దిట్టలు. బంజారా మహిళలు వందలాది అద్దాలను అమర్చి, ఘల్లు ఘుల్లుమనే గజ్జెలు జోడించిన రెండు జతల పెండ్లి దుస్తులను తమ కూతురికి పెండ్లి కానుకగా ఇవ్వడం ఆచారం. 

ప్రభుత్వ ప్రోత్సాహం 


గిరిజన సంస్కృతిని పరిరక్షించేందుకు తెలంగాణ ట్రైబల్‌ కల్చరల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విశేషమైన కృషి చేస్తున్నది. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లో గిరిజన సంక్షేమ కార్యాలయాల ప్రాంగణంలో 2013లో ఏర్పాటైన ట్రైబల్‌ మ్యూజియంను ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రూ.కోటి వ్యయంతో ఆధునికీకరిస్తున్నారు. ఈ మ్యూజియం తెలంగాణ గిరిజన  సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తున్నది. మ్యూజియం ప్రాంగణంలోనే గిరిజన సంస్కృతిని చాటి చెప్పేలా టీసీఆర్‌టీఐ భవన నిర్మాణాన్ని చేపడుతున్నది ప్రభుత్వం. logo