ఆదివారం 25 అక్టోబర్ 2020
Zindagi - Aug 08, 2020 , 01:43:04

బాలికల పేర్లతో రహదారులు!

బాలికల పేర్లతో రహదారులు!

సాధారణంగా రహదారులకు యుద్ధవీరులు, చారిత్రక వ్యక్తుల పేర్లు పెట్టడం సహజం. కానీ అక్కడ మాత్రం చదువుల్లో, క్రీడల్లో రాణించిన బాలికల పేర్లను పెడుతున్నారు. అదే, రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లా. ఇలా ఓ సత్సంప్రదాయానికి నాంది పలికారు.. 

ఆ జిల్లా కలెక్టర్‌ జితేంద్ర కుమార్‌ సోని. రోడ్లకు బాలికల పేర్లు పెట్టడం వెనుక రెండు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు కలెక్టర్‌. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...  

‘ఈ మధ్యే బాధ్యతలు స్వీకరించాను. రహదారుల కబ్జాలు, భూ ఆక్రమణలపై అనేక ఫిర్యాదులు వచ్చినట్లు గమనించాను. నా వంతుగా, ఈ సమస్య పరిష్కారానికి ఏమైనా చేయాలనించింది. ‘రాస్తా ఖోలో అభియాన్‌' పేరుతో ఆక్రమణల్ని తొలగించాలని తీర్మానించాను. ఆ మార్గాలను క్లియర్‌ చేసినంత మాత్రాన సరిపోదు. ఇంకెవరూ వాటి జోలికి వెళ్లకుండా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకున్నాను. ఆ రహదారులకు విద్య, క్రీడలు తదితర రంగాల్లో రాణించిన బాలికల పేర్లు పెట్టాలని నిర్ణయించాను. ఆకాశంలో సగమైన మహిళల పట్ల 

కృతజ్ఞతను తెలిపేందుకు ఇదో ప్రయత్నం. ఇక్కడ పాతిన సరిహద్దు రాళ్లకు కూడా జీపీఎస్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఒక వేళ వాటిని ఎవరైనా కదిలిస్తే, పోలీసులకు సమాచారం వెళ్తుంది. ఇప్పటి వరకు 38 మార్గాలకు కబ్జా నుంచి విముక్తి కల్పించారు. అంటే, ముప్పై ఎనిమిది మంది బాలికల పేర్లు వీధి నామాలుగా రికార్డులకెక్కాయి.   

మొదటి పేరు ఆమెదే..

నాగౌర్‌లోని కుచెరాలో నివసిస్తున్న దివ్య శర్మ రాష్ట్ర స్థాయి హాకీ క్రీడాకారిణి. ఈ ఏడాది పదో తరగతి బోర్డు పరీక్షల్లో 97శాతం మార్కులతో స్థానిక కల్పనా చావ్లా ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో టాపర్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు ఆమె పేరు మీద ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ‘కొత్త రోడ్డు ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించారు. దీనివల్ల చాలామంది తల్లిదండ్రులు తమ కూతుళ్లను చదివించడానికి ముందుకొస్తారు’ అని చెబుతున్నది దివ్య.


logo