సోమవారం 19 అక్టోబర్ 2020
Zindagi - Aug 07, 2020 , 00:34:43

ఆ మేకప్‌ చూసి..భయమేసేది!

ఆ మేకప్‌ చూసి..భయమేసేది!

అభినయంలో.. ‘సౌందర్య’ను తలపించింది. హావభావాలతో ‘బుల్లితెర అనుష్క’ అన్న పేరు తెచ్చుకుంది. కానీ, అకస్మాత్తుగా సీరియళ్లకు దూరమైంది. మళ్లీ ‘స్టార్‌ మా’ ‘చెల్లెలి కాపురం’ ద్వారా సెకెండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టింది. అమాయకుడైన భర్తకు భార్యగా వందకు వంద 

మార్కులూ కొట్టేసింది. సిరిసిల్లకు చెందిన శిరీష చిన్నతెర ప్రయాణం ఆమె మాటల్లోనే..

మాది సిరిసిల్ల. ముగ్గురు అక్కాచెల్లెళ్లం. నేనే చిన్నదాన్ని. అక్కలిద్దరూ బాగా ముద్దుచేసేవారు. నాన్న చిన్నప్పటి నుంచీ ఇంటిని పట్టించుకునేవాడు కాదు. ఆ సమయంలో అమ్మే అన్నీ అయి ఇంటిని నడిపించింది. తనే లేకుంటే మేం ఎక్కడ ఉండేవాళ్లమో. తొమ్మిదో తరగతి వరకు గవర్నమెంట్‌ స్కూల్‌లో చదివాను. చిన్నప్పటి నుంచీ మా చిన్నక్క నాకు డ్యాన్స్‌లో శిక్షణ ఇచ్చేది. స్కూల్‌ ప్రోగ్రాముల్లో పర్‌ఫార్మ్‌ చేసేదాన్ని. అప్పుడే, అక్క రజితకు పెండ్లి కావడంతో హైదరాబాద్‌కు వచ్చేసింది. కొంతకాలానికి, మేం కూడా సిటీకి షిఫ్ట్‌ అయిపోయాం. అవకాశాలు రావడంతో అక్క ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయినా, నేనెప్పుడూ సీరియళ్లలో నటించాలని అనుకోలేదు. బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని కలలు కనేదాన్ని.  

ఆర్థిక ఇబ్బందులతో.. 

పదో తరగతి, ఇంటర్‌ వరకూ బాగానే చదివాను. డిగ్రీ సెకెండియర్‌కి వచ్చేసరికి ఇద్దరక్కల పెండ్లిండ్లూ అయ్యాయి. వాళ్లిద్దరూ  సీరియల్స్‌లో బిజీ అయ్యారు. వాళ్లను చూసి ‘కిలోలకు కిలోల మేకప్‌ ఎలా వేసుకుంటారో’ అనుకునేదాన్ని. భయమేసేది. అంతలోనే నేనూ మేకప్‌ వేసుకోవాల్సిన రోజు వచ్చింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. ఉద్యోగం దొరకడం కష్టమైపోయింది.అందుకే, అక్క డీడీ చానెల్‌లో చిన్న రోల్‌ ఉందని చెబితే వెళ్లాను. సీన్‌ పేపర్‌ చూసి సరిగా డైలాగ్‌ చెప్పలేకపోయాను. దాంతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పేపర్‌ కిందపడేసి ‘ఈమెకు రాదు.. నేనింక చెప్పలేను’ అంటూ వెళ్లిపోయాడు. కానీ ఎలాగోలా.. ‘చందమామ రావే’ అనే సీరియల్‌లో వదిన క్యారెక్టర్‌ చేశాను. అది నా వయసుకు మించిన రోల్‌. తర్వాత ఇంకో అవకాశం.  మెయిన్‌ లీడ్‌గా చేశా. ఆ తర్వాత ‘మొగలిరేకులు’, ‘కలవారి కోడలు’.. ఇలా వరుసగా చాన్స్‌లు వచ్చాయి. 

ఆ ఇద్దరి సాయంతోనే..

నాకు మొదటి నుంచీ మేకప్‌, కెమెరా యాంగిల్స్‌ లాంటివి తెలియవు. కానీ, కసిగా నేర్చుకున్నా. ఈ విషయంలో మా ఇద్దరు అక్కల సాయం మరచిపోలేను. వాళ్లిద్దరూ లేకపోతే ఇండస్ట్రీలో ఇన్ని రోజులు ఉండకపోయేదాన్ని. ‘కృష్ణావతారాలు’ నాకు మంచి గుర్తింపు ఇచ్చింది. నేను చేసిన ‘అడగక ఇచ్చిన మనసు’ స్టార్‌ మాలో వచ్చింది. దాని ద్వారా అవకాశాలు పెరిగాయి. ‘మల్లిగాడు మ్యారేజ్‌ బ్యూరో’ అనే సినిమాలోనూ చేశా. ఆ సినిమా ప్రొడ్యూసర్‌ భార్య నా ఫ్యాన్‌. అలా చాన్స్‌ వచ్చింది. నేను ఆఫీసులో అడుగు పెట్టకుండా వచ్చిన అవకాశం కాబట్టి, కాదనకుండా చేశాను. ఆ తర్వాత సినిమా చాన్స్‌లు నా దాకా రాలేదనే చెప్పాలి. సీరియళ్లలో బిజీగా ఉండటం వల్ల మళ్లీ సినిమాలపై పెద్దగా దృష్టి కూడా పెట్టలేదు. ఇప్పటి వరకూ పదిహేను సీరియల్స్‌ దాకా చేశాను. మంచి క్యారెక్టర్‌ వస్తే మాత్రం, సినిమాల్లో చేయాలని ఉంది. 

సీరియల్‌ కష్టాలు 

సినిమా వాళ్లకి టీవీ ఆర్టిస్టుల గురించి చాలా తక్కువగా తెలుసు. సినిమాల్లో కంటే సీరియల్లో నటించడమే కష్టం. ప్రతీ యాంగిల్‌లో మన నటన కనిపించాలి. అన్ని ఎమోషన్స్‌ చూపించాలి. ‘రాములమ్మా’, ‘ఎవరే నువ్వు’, ‘మోహిని’ సీరియళ్లలో మంచి పాత్రలు వచ్చాయి. ఒక డ్యాన్స్‌ షోలో రన్నరప్‌గా నిలిచా. ఓ తమిళ సీరియల్‌లోనూ నటించా. భాషతో ఇబ్బంది అనిపించినా, సెట్‌లో తెలుగువాళ్లే ఉండటంతో కష్టం తగ్గిపోయింది. అక్కడ ఆఫర్లు వచ్చినా, తెలుగులో బిజీగా ఉండటంతో అంగీకరించలేదు. నేను ఇంటర్‌ చదివిన కాలేజ్‌కి ఒకసారి గెస్ట్‌గా వెళ్లాను. మా లెక్చరర్లు నన్ను గొప్పగా చూడటం గర్వంగా అనిపించింది. నేను ఈ ఫీల్డ్‌కి వచ్చినందుకు సంతోషపడ్డాను. ఆరాధన, టీవీ నైన్‌.. ఇలా పలు చానెల్స్‌ నుంచి అవార్డులు అందుకున్నా. ఇదీ ఇప్పటి వరకూ నా కథ.

‘స్టార్‌ మా’ నుంచే.. 

నాకు మంచి పేరు తెచ్చిన సీరియల్స్‌ అన్నీ స్టార్‌ మా చలువే. నా కెరీర్‌ ఏమైపోతుందో అనుకునే సమయంలో ‘స్టార్‌ మా’ నుంచి పిలుపు వచ్చింది. ‘చెల్లెలి కాపురం’ సీరియల్‌లో లీడ్‌ రోల్‌ అని చెప్పారు. మళ్లీ పాత శిరీషనే ప్రేక్షకులకు చూపించదలుచుకోలేదు నేను. వేరియేషన్స్‌కు అవకాశం ఉండటంతో ఒప్పుకొన్నాను. ముందుగా, నాకు చాన్స్‌ వచ్చిందంటే నమ్మలేదు. స్క్రీన్‌ టెస్ట్‌ అంతా అయ్యాకే నమ్మకం కుదిరింది. ఏమీ తెలియని వ్యక్తిని పెండ్లి చేసుకొని ఓ అమ్మాయి ఎన్ని ఇబ్బందులు పడిందనేది ఇతివృత్తం. లాక్‌డౌన్‌ వల్లే సీరియల్‌ కాస్త ఆలస్యం అయింది. అయితేనేం, ఇప్పటికీ మంచి ఆదరణ దక్కుతున్నది. 

నా అభిమానినే.. 

‘కాంచనగంగ’ ప్రొడ్యూసర్‌ వాళ్ల చుట్టాలబ్బాయే మా ఆయన. నా కోసం షూటింగ్‌ దగ్గరకు వచ్చేవాడట. మాట్లాడించమని అడిగేవాడట. ఆ విషయాలు నాకు ముందుగా తెలియవు. ఇవన్నీ కుదరవనుకొని అమ్మానాన్నలను మా ఇంటికి పంపాడు. అలా వాళ్లు మాట్లాడుకొని ఓకే అనుకున్నారు. అప్పుడు, నాకు ఒక ఏడాది సమయం కావాలని అడిగాను. ఆ సమయంలో మా ప్రేమ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత పెండ్లి అయింది. ఇప్పుడు మాకొక బాబు.  మా చిన్న కుటుంబం.. చింతలు లేని కుటుంబంగా మారింది. ఏడాదిపాటు నా సీరియల్స్‌కు బ్రేక్‌ పడింది. డెలివరీ అయ్యాక కెరీర్‌ని ప్రారంభిద్దామనుకున్నా. కానీ, ప్రెగ్నెన్సీ సమయంలో లావెక్కాను. తగ్గడానికి చాలా తంటాలు పడ్డాను. ఆఫర్ల కోసం కూడా కష్టపడ్డాను. 


logo