బుధవారం 30 సెప్టెంబర్ 2020
Zindagi - Aug 07, 2020 , 00:34:41

‘వారియర్స్‌' వెన్ను తడుతూ..

‘వారియర్స్‌' వెన్ను తడుతూ..

కొవిడ్‌ బారిన పడిన వారికి మనోబలమే సగం మందు. కాబట్టే, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఏ పోలీసు ఉద్యోగికి కరోనా వచ్చినా, ‘కాన్ఫిడెంట్‌గా ఉండండి. మీకేం కాదు. అందుకు మేమేఉదాహరణ..’ అంటూ ధైర్యం చెబుతున్నారు సీపీ మహేష్‌ భగవత్‌. సిబ్బందికి ఆయన.. క్వారంటైన్‌లో ఉన్నప్పుడు ధైర్యవచనాలు అందిస్తారు, తిరిగి విధి నిర్వహణకు వచ్చిన రోజు పుష్పగుచ్ఛం ఇస్తారు. ఆ కార్యక్రమాల గురించి ఆయన మాటల్లోనే..   

మా సిబ్బందిలో హోంగార్డు నుంచి ఆఫీసర్స్‌ వరకు ఎవరు కరోనా బారిన పడినా వెంటనే అప్రమత్తం అవుతున్నాం. ప్రధానంగా, కరోనా మహమ్మారి విషయంలో ఎవరికీ పెద్దగా అవగాహన లేదు. కొవిడ్‌-19 కట్టడి కోసం లాక్‌డౌన్‌ ప్రకటించిన తొలిరోజుల్లో కొందరికి పాజిటివ్‌ వచ్చింది. వారిలో ఇన్‌స్పెక్టర్‌ స్థాయి వాళ్లూ ఉన్నారు. ఒక ఆఫీసర్‌ను ‘ఎలా ఉన్నారు..?’ అని పలుకరించాను. అంతే, కన్నీళ్లు పెట్టుకున్నారు. డ్యూటీ పరంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే పోలీసులు, కరోనా విషయానికి వచ్చేసరికి ధైర్యం కోల్పోవడం కొంత బాధ కలిగించింది. వారిలో మనోబలాన్ని పెంచాలని అప్పుడే నిర్ణయించుకున్నా. అందుకే ‘RK Covid Positive Group’ పేరుతో వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేయించాను. దానిలో, మా రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన సిబ్బందిని యాడ్‌ చేస్తాం. ఇలా, అందరి ఆరోగ్య పరిస్థితినీ నేను పర్యవేక్షించే వెసులుబాటు కలిగింది.

రోజూ పలుకరింపులు 

పాజిటివ్‌ వచ్చిన సిబ్బంది మొత్తం హోం క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. క్వారంటైన్‌లో ఉన్న ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.5 వేలు వేస్తున్నాం. డ్రైఫ్రూట్స్‌, మాస్క్‌లు, శానిటైజర్లతో ఓ కిట్‌ ఇంటికి పంపుతున్నాం. గ్రూప్‌లో నాతోపాటు మా అధికారులు, సన్‌రైజ్‌ ఆసుపత్రికి చెందిన డాక్టర్‌ అవినాష్‌, పోలీస్‌ డాక్టర్‌ సరిత, ఇంకొందరు మానసిక వైద్యులను కూడా చేర్చాం. రోజూ ఆహారం, వ్యాయామం, యోగా, మెడిటేషన్‌, రోగనిరోధక శక్తి.. తదితర విషయాల మీద డాక్టర్లు సూచనలు ఇస్తుంటారు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా చిన్న మెసేజ్‌ పెడితే చాలు. అర్ధరాత్రి అయినా సరే స్పందిస్తాం. తగిన సాయం చేస్తాం. 

మనోధైర్యమే సగం మందు  కొవిడ్‌ పాజిటివ్‌ రోగులకు మానసికొవిడ్‌ పాజిటివ్‌ రోగులకు మానసి క బలం చాలా అవసరం. అందుకే, ప్రతి మూడు రోజులకు ఒకసారి జూమ్‌ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌ పెడుతున్నాం. ఆ మూడు రోజుల్లో కొవిడ్‌ కొత్తగా సోకి.. హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న వారితో నేను, మా డాక్టర్ల బృందం నేరుగా మాట్లాడతాం. దీనివల్ల, ‘పోలీస్‌ అధికారులూ సిబ్బందీ మాతోనే ఉన్నారు, మా బాగోగులు పట్టించుకుంటున్నారు’ అన్న ధైర్యం వస్తుంది. ఆ కుటుంబంలో ఇంకెవరికైనా పాజిటివ్‌ వచ్చి ఉంటే, వాళ్లతోనూ మాట్లాడి ధైర్యం చెబుతాం. వారికి కూడా మందులు పంపుతాం. పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చిన వారిని సత్కరించడం సంప్రదాయంగా పెట్టుకున్నాం. వారియర్స్‌కు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలుకుతున్నాం. దీనివల్ల వారు మరింత ఉత్సాహంగా విధుల్లోకి వెళ్తారన్నది నా ఉద్దేశం. 

- నాగోజు సత్యనారాయణ

ధైర్యం ఇచ్చేవా ముఖ్యం 

కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందంటే చిన్నచూపు చూసేవాళ్లే ఎక్కువ. అలాంటి సంఘటనలు మానసికంగా ఇబ్బందికి గురిచేస్తాయి. ఆ సమయంలో మనకు మనోధైర్యం చెప్పేవారు ఎంతో ముఖ్యం. నాకు ఎలాంటి లక్షణాలూ లేవు కానీ, పాజిటివ్‌ వచ్చింది. విషయం సీపీ సార్‌కు చెప్పినప్పుడు ‘ఏమీ కాదు. కాన్ఫిడెంట్‌గా ఉండండి’ అన్నారు. మా అధికారులు, సిబ్బంది, నా భర్త.. ఇలా అందరి సహకారంతో కరోనా నుంచి బయటపడ్డాను. 

-శ్రీదేవి, సీఐ, కమ్యూనికేషన్స్‌


logo