బుధవారం 21 అక్టోబర్ 2020
Zindagi - Aug 07, 2020 , 01:12:55

ఎలా తెలుపను.. మదిలోని ప్రేమను!

ఎలా తెలుపను.. మదిలోని ప్రేమను!

ఆధ్యాత్మిక వేత్త ఆ కొద్దిసేపు అమర ప్రేమికుడిలా మాట్లాడారు. సుదర్శన క్రియ ఆవిష్కర్త యువత హృదయాల్ని దర్శించారు.  రెండక్షరాల ప్రేమ... రెండు జీవితాల ప్రేమ. ఆ ప్రేమను నిశితంగా గమనించిన ప్రేక్షకుడిగా శ్రీశ్రీ రవిశంకర్‌జీ చెబుతున్న ప్రేమ రహస్యాలూ, ప్రేమికుల ప్రశ్నలకు ఇస్తున్న జవాబులూ..

నేను ప్రేమలో ఉన్నానని ఎలా తెలుస్తుంది?

ఎదుటివ్యక్తి తప్పులు కూడా సరైనవిగానే అనిపిస్తుంటే నువ్వు ప్రేమలో ఉన్నట్టే. నిరంతరం తన గురించే ఆలోచిస్తూ, తన సంతోషం కోసం ఎంతకైనా తెగిస్తూ, చిన్నపాటి అసంతృప్తికే నొచ్చుకుంటూ ఉంటే నువ్వు తనతో ప్రేమలో ఉన్నట్టే.

నేను ఒకరిని ప్రేమిస్తున్నాను. నా మనసులోని మాట తనతో చెప్పేదెలా?

చెప్పాల్సిన అవసరం ఏముంది? నీలో అణువణువునా ఉన్న ప్రేమ తనకు కనిపిస్తూనే ఉంటుంది. దానిపట్ల అభ్యంతరం లేకపోతే.. తను కూడా నీకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. ప్రేమ ఇద్దరి మధ్యా చాలా సహజంగా వికసించాలి. తొందరపడి దాన్ని వ్యక్తం చేసి, ఉన్న బంధాన్ని పాడు చేసుకోకూడదు. సరేనా?

నా మనసులో ఉన్న ప్రియురాలు, నన్ను నూటికి నూరు శాతం ప్రేమిస్తుందని ఎలా తెలుస్తుంది?

ఇదే ప్రశ్న నిన్ను అడిగితే నువ్వు ఏం సమాధానం చెబుతావు. నువ్వు నీ ప్రియురాలిని నూటికి నూరు శాతం ప్రేమిస్తున్నావా? ఎప్పటికైనా అలా 100% ప్రేమిస్తూనే ఉంటానని గ్యారెంటీ ఇవ్వగలవా! నీ గురించే నువ్వే నమ్మకంగా చెప్పలేనప్పుడు, నీ నియంత్రణలో లేని వేరొకరి గురించి ఎలా చెప్పగలవు? ఆ వాస్తవాన్ని అంగీకరించగలిగే మనోబలం నీకు ఉండాలి. ప్రాపంచిక బంధాలకంటే, నీతో నీకుండే అనుబంధమే గొప్పదనే ఎరుకతో ఉండాలి. అదే నిజమైన ప్రేమికుడి లక్షణం.

స్వచ్ఛమైన ప్రేమబంధాన్ని నిర్మించుకోవడం ఎలా?

‘నిర్మించుకోవడం’ అనే ప్రయత్నమే కృత్రిమం. బంధం దానికదే సహజంగా ఎదగాలి. ఇద్దరి మధ్యా నిజాయితీ, స్వేచ్ఛ ఉన్నప్పుడు బంధం దానంతట అదే బలపడుతుంది. నీలా నువ్వు ఉన్నప్పుడు, క్షమతో మెలిగినప్పుడు, వాస్తవంలో జీవిస్తున్నప్పుడు... నీ బంధానికి విలువ పెరుగుతుంది.

ఒక వ్యక్తిపట్ల నాలో ఉన్నది ప్రేమో, మోహమో తెలిసేదెలా?

ప్రేమలో త్యాగం ఉంటుంది. మోహం బాధకే దారితీస్తుంది. కాబట్టి నీలో ఉన్నది ప్రేమో, మోహమో కాలమే సమాధానం చెబుతుంది. వేచి చూడు!

ఒకేసారి ఇద్దరితో సంబంధం నెరపడంలో తప్పేముంది?

నీ భాగస్వామి కూడా ఇలాగే ప్రశ్నిస్తే... నీ సమాధానం ఏమిటో చెప్పు. నాకు తెలిసి నీకు అలాంటి ఊహే ఇష్టం ఉండదు. ఎందుకంటే, ఒకేసారి ఇద్దరితో కొనసాగే బంధంలో విశ్వాసం ఉండదు. కాబట్టి, ఒకేసారి ఆ ఇద్దరినీ గాయపరిచినట్లు అవుతుంది.

ఓ మంచి జీవిత భాగస్వామిగా ఉండేదెలా?

తన నుంచి ఏమీ కోరుకోవద్దు. ఏదో ఒకటి ఆశించడం మొదలుపెట్ట్టిన దగ్గరనుంచీ మీ బంధం పలుచబడిపోతుంది. నీ ప్రేమతో తన మనసును గెలుచుకునే ప్రయత్నం చేయడం మంచిది.

  (ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ ప్రచురించే ‘రుషిముఖ్‌' పత్రిక నుంచి) 


logo