శనివారం 24 అక్టోబర్ 2020
Zindagi - Aug 07, 2020 , 01:12:55

‘ఖైదీ పెయింటర్‌' కథ!

‘ఖైదీ పెయింటర్‌' కథ!

శంకర్‌ ఒక ఖైదీ. మంచి కళాకారుడు కూడా. జైల్లో ఖాళీగా ఉండకుండా కుంచెకు  పనిచెప్పాడు. తాను ఖైదీ అనే విషయాన్నే మరచిపోయాడు. తక్కువ సమయంలోనే పరివర్తన పొంది.. విడుదలయ్యాడు. మళ్లీ లొల్లి మొదలైంది. కట్‌ చేస్తే.. మరొక మర్డర్‌.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.  ఇప్పుడతను లేడు. కానీ జైల్లో అతను వేసిన పెయింటింగ్స్‌ ఒక జ్ఞాపకంగా మిగిలాయి. ప్రతి ఖైదీకీ ఓ ఫెయిల్యూర్‌ స్టోరీని బోధిస్తున్నాయి. 

‘నేను.. చేసిన నేరానికి శిక్ష అనుభవించాను. పశ్చాత్తాపం మన పాపాల్ని కడిగేస్తుందని అంటారు. నాలో పరివర్తనను చూసి జైలు అధికారులు మెచ్చుకున్నారు. విడుదలయ్యాక బుద్ధిగా ఉండాలనుకున్నాను. కానీ, సమాజం నాలో వచ్చిన మార్పును గ్రహించలేకపోయింది. నన్నొక మనిషిగా స్వీకరించలేదు. దీంతో, నాలోని పాత మనిషి నిద్రలేచాడు. మరొకసారి హంతకుడిగా మారాను’.. ఇదొక ఖైదీ సూసైడ్‌ నోట్‌ సారాంశం. 

ఆ ఖైదీ పేరు శంకర్‌. సంగారెడ్డిలోని నారాయణరెడ్డి కాలనీలో ఉండేవాడు. సొంతూరు పుల్కల్‌ మండలం బొమ్మారెడ్డిగూడెం. డెకొరేషన్‌ పనులు చేసేవాడు. పెయింటింగ్‌ కూడా తెలుసు. ఆ సంపాదనతో జీవితంలో స్థిరపడ్డాడు.  ఇల్లు కట్టుకున్నాడు. పెండ్లికూడా చేసుకొన్నాడు. ఏవో ఆర్థిక వ్యవహారాల్లో హద్దులు మీరిన ఆవేశంతో ఒకరిని హతమార్చాడు. నేరాన్ని అంగీకరించి జైలుకు వెళ్లాడు.  


కళకు పదును: చర్లపల్లి, సంగారెడ్డి జిల్లా జైళ్లలో ఖైదీ జీవితం అనుభవించాడు అశోక్‌. ఆ సమయంలో అతను గతాన్ని తలుచుకొని కుమిలిపోలేదు. తనలోని కళకు పదును పెట్టాడు. చర్లపల్లి జైలు, సంగారెడ్డి జిల్లా కోర్టులలో గోడలను అందమైన పెయింటింగ్స్‌తో అలంకరించాడు. గోడలపై ఎటు చూసినా శంకర్‌ కుంచె నుంచి జాలువారిన చిత్రాలే దర్శనమిస్తుంటాయి. జైలు అధికారులు అతడిని ఖైదీలా కాకుండా ఆర్టిస్ట్‌గా చూసేవారు. సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్‌ శివకుమార్‌గౌడ్‌ అయితే, శంకర్‌ పనితనాన్ని మెచ్చి మరిన్ని చిత్రాలు వేసేలా ప్రోత్సహించారు. పెయింటింగ్స్‌కు కావాల్సిన సామగ్రిని కూడా అందజేశారు. ఇదే సమయంలో అతడిలో పరివర్తన మొదలైంది. పూర్తిగా మారిపోయాడు. శంకర్‌ ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చాడు. క్షణికావేశంలో మరో హత్య చేశాడు. ఈసారి భార్యనే! ఆ తర్వాత తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. మరణానికి ముందు, మనసులోని భావాలతో ఒక ఉత్తరమూ రాశాడు. శంకర్‌కు జీవితం రెండు అవకాశాలు ఇచ్చింది. తొలి క్షణికావేశం తర్వాత.. పరివర్తనకు మార్గం చూపించింది. కానీ, ఆ పాఠాన్ని పూర్తిగా ఒంటబట్టించుకోలేక పోయాడు. తనలోని ఉద్వేగాన్ని పాజిటివ్‌గా మార్చుకుని ఉంటే, గొప్ప చిత్రకారుడు అయ్యేవాడు. జీవితం అసంపూర్ణ వర్ణచిత్రంగా మిగిలేది కాదు.

ఒక్క క్షణం ఆలోచించి ఉంటే..

 ‘మంచి మార్గం ఏర్పరచుకుంటేనే జీవితం బాగుంటుంది. జీవితాంతం బాగుంటాం. క్షణికావేశంలో చేసిన తప్పుకు చాలామంది పరివర్తన చెందుతున్నారు. కానీ సమాజం వారిని ఇంకా నేరస్తులుగానే చూడటం వల్ల కొన్నిసార్లు మార్పు సాధ్యం కావడం లేదు’ అంటారు సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి. ‘శంకర్‌ జైల్లో ఉన్నప్పుడు చాలా మారాడు. కళకు పదునుపెట్టాడు. సంగారెడ్డి జైల్లో ఏ గోడకు చూసినా శంకర్‌ వేసిన బొమ్మలే కనిపిస్తాయి. శంకర్‌లాంటి వారిలో ప్రతిభను ప్రోత్సహిస్తున్నాం. అంతిమంగా మనకు సత్ప్రవర్తనే రక్షగా నిలబడుతుంది’ అంటూ శంకర్‌ వేసిన చిత్రాల్ని చూపిస్తారు సంగారెడ్డి జిల్లా జైల్‌ సూపరింటెండెంట్‌ నవాబ్‌ శివకుమార్‌ గౌడ్‌.  

-మద్దికుంట శ్రీనివాస్‌


logo