బుధవారం 28 అక్టోబర్ 2020
Zindagi - Aug 07, 2020 , 01:12:57

పనికిరాని ఐశ్వర్యం

పనికిరాని ఐశ్వర్యం

ఓ గ్రామంలో కనకయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. కానీ పరమ లోభి. తను తినేవాడు కాదూ,  ఒకరికి పెట్టేవాడూ కాదు. కనకయ్య పీనాసితనం అందరికీ తెలుసు. అయినా, సహాయం చేయకపోతాడా? అని గ్రామంలోని వారు తరచుగా అతని వద్దకు వచ్చేవారు. కానీ కనకయ్య సాకులు చెప్పి వెనక్కి పంపించే వాడు.  సహాయం కోసం ఊరివాళ్ల పోరు  రోజురోజుకూ అధికం కావడం వల్ల - కనకయ్యకు చికాకు ఎక్కువైపోయింది. దీని నుంచి బయట పడాలని అనుకున్నాడు.  పొలాలు, నగలు మొదలైనవన్నీ అమ్మేసి, బంగారం కొన్నాడు. తన పెరట్లో గుంత తవ్వి, ఆ బంగారాన్ని భద్రంగా దాచి పెట్టాడు! రోజూ ఉదయమే లేచి తన బంగారాన్ని చూసుకోవడానికి పెరట్లోకి  వెళ్ళి వస్తూండేవాడు. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. 

కనకయ్య రోజూ పొద్దునే పెరడులోకి వెళ్ళి వస్తూ ఉండటం ఓ దొంగ కనిపెట్టాడు. రహస్యంగా కనకయ్యను అనుసరించాడు.  ఒకరోజు ఆ దొంగ వెళ్లి బంగారాన్ని తవ్వుకొని పోయాడు.  మరునాడు ఉదయం  కనకయ్య వెళ్లి చూసుకొంటే,   తాను పాతిపెట్టిన చోట బంగారం లేదు. గుండె బద్దలయినంత పని అయింది. దుఃఖం పొంగి పొర్లింది. నెత్తీ నోరూ బాదుకొంటూ ఇంటి దగ్గర  ఓ చెట్టు కింద  కూర్చున్నాడు.  దారినే వెళుతున్న ఆ ఊరి ఆసామి కనకయ్యను చాశాడు. ‘ఎందుకు ఏడుస్తున్నావు’ అని అడిగాడు.  కారణం తెలుసుకున్నాడు.  ‘ఆ బంగారం నీదగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏమైనా అనుభవించావా? నువ్వు ఏనాడూ అనుభవించి ఎరుగని ఆ ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు ఏడవడం ఎందుకు? ఆ బంగారం నీ దగ్గరవున్నా, లేకపోయినా ఒకటే! అనుభవించలేని ఐశ్వర్యం ఎందుకు? పైగా ఆ ఐశ్వర్యాన్ని కాపాడుకొనడానికి అనేక అవస్థలు పడ్డావు.  ఇప్పుడు అదీ పోయింది కాబట్టి, నీ బాధ విరుగుడయింది. ఇక హాయిగా నిద్రపో...’ అని హితవు పలికాడు.  పాపం! కనకయ్యకు ఇప్పుడు తత్వం బోధపడింది.


logo