శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Zindagi - Aug 05, 2020 , 23:15:00

సామాన్యుల సేవకే.. సివిల్స్‌

సామాన్యుల సేవకే.. సివిల్స్‌

‘ముందు పరీక్షల సంగతి చూడు, మార్కులు ముఖ్యం’, ‘క్లాస్‌లో నీ ర్యాంక్‌ ఎంత?’, ‘ ఆటపాటలు తర్వాత... చదువే ముఖ్యం’ తరహా అభిప్రాయాలు ఉన్నవారికి తను ఒక జవాబు. ఆటపాటలు, చదువుతో పాటు...జీవన నైపుణ్యాలు కూడా అవసరమే అనడానికి గొప్ప ఉదాహరణ. వ్యక్తిత్వం వికసించడానికి పాఠ్యపుస్తకాలు చదవడం, ర్యాంకులు సాధించడమే సాధనం కాదని చెప్పడానికి నిదర్శనం. ఆమె ఎవరో కాదు, ఈ ఏటి సివిల్స్‌లో 46వ ర్యాంక్‌ సాధించిన ధాత్రి రెడ్డి, మన తెలంగాణ బిడ్డ! ఒక్కసారి కాదు,  ఏకంగా రెండు సార్లు  సివిల్స్‌లో ర్యాంక్‌ సాధించి సత్తా చాటిన ధాత్రి ప్రస్థానం..

సమాజానికి ఏదైనా చేయాలంటే కచ్చితంగా పాలనా వ్యవస్థలో చోటు సంపాదించాలని గ్రహించారు ధాత్రి. అందుకు సివిల్స్‌ మాత్రమే దారి అని తెలుసుకున్నారు. ఐపీఎస్‌ కావాలని సంకల్పించారు. లక్ష్య సాధనకు ప్రణాళిక రచించుకున్నారు. ఆ ప్రకారంగానే అడుగులు ముందుకు వేసి విజయం సాధించారు. ఆమె గెలుపు చాలామందికి స్ఫూర్తి. నిరాడంబరంగా కనిపించే ధాత్రి ఆలోచనల్లోని పదును, స్వరంలోని స్థిరత్వం ఆమెతో మాట్లాడితేనే అర్థం అవుతాయి. పేదలకు సేవ చేద్దామని సంకల్పించినప్పుడు, ఎదురైన సవాళ్లు ఆమెను ఆలోచనలో పడేశాయి. జీవన గమనాన్ని మార్చాయి. ఆ మార్పు ఆమెను బ్యూరోక్రాట్‌ను చేసింది. 

ధాత్రి స్వస్థలం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గుండ్లబావి. పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. నాన్న  క్రిష్ణారెడ్డి వ్యాపారి, అమ్మ సుశీల గృహిణి. ధాత్రి సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌లో చదువుకున్నారు. పాఠశాల రోజుల్లో ఏనాడూ మార్కుల్లో ముందున్న జ్ఞాపకాలు లేవు. ముందు నుంచీ చదువులకంటే ఇతర కార్యక్రమాల మీదే ఆసక్తి ఎక్కువ. ‘ఆ రోజుల్లో నన్ను ఎరిగిన వాళ్లెవరైనా నేను ఐఐటీలో సీటు సాధించడమే గొప్ప అనుకుంటే, అది వాళ్ల తప్పు కాదు’ అంటారు ధాత్రి.

ఇంటర్‌ నుంచి సీరియస్‌

పదో తరగతి వరకూ ఆడుతూ పాడుతూ చదువుకున్న ధాత్రికి ఇంటర్మీడియట్‌లో చేరిన తర్వాత, ఐఐటీ ఎంట్రన్స్‌లో ర్యాంకు సాధించాలన్న పట్టుదల కలిగింది. అప్పటి నుంచి చదువును ఒక యజ్ఞంగా భావించారు. జేయీయీలో మంచి ర్యాంక్‌ తెచ్చుకొని ఖరగ్‌ పూర్‌ క్యాంపస్‌ నుంచి ఇంజినీరింగ్‌ చేశారు. అక్కడ చదివే రోజుల్లోనే, సమాజానికి ఏదైనా చేయాలన్న సంకల్పం బలపడింది.  కొంతమంది మిత్రులతో కలిసి ‘ఫీడ్‌ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థను  నెలకొల్పి.. ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారం అందించడానికి పూనుకున్నారు. అందుకోసం ఒక యాప్‌ను కూడా రూపొందించారు. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యాలయాల నుంచి అనుమతులు తీసుకోవడంలో ఎదురైన కష్టాలు ఆమెలో కొత్త ఆలోచనలను  రేకెత్తించాయి. ఆ సమయానికి ఆమె చదువు పూర్తిచేసి ఒక ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్‌ కంపెనీలో ఉద్యోగం సాధించారు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం తర్వాత.. ప్రైవేట్‌ ఉద్యోగంలో ఉంటూ సమాజానికి ఏదైనా చేయాలనుకోవడం అంత సులువు కాదని అర్థం అయ్యింది.  అప్పుడే,    సివిల్స్‌ సాధించాలనే సంకల్పానికి బలమైన బీజం పడింది.

ప్రణాళిక మారింది

సంకల్పం నెరవేరాలంటే చక్కటి ప్రణాళిక అవసరం. అందులో భాగంగా ఉద్యోగానికి రాజీనామా చేసి, ఢిల్లీలోని ఓ సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌లో చేరారు. నెల రోజులు తరగతులకు హాజరైన తర్వాత.. అక్కడ నేర్చుకునేది పెద్దగా ఏమీ లేదని అర్థమైపోయింది. వెంటనే ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. ‘క్లాసులలో నేర్చుకునేది ఏమీ ఉండదు. మనమే చదువుకోవాలి, నేర్చుకోవాలి, అవగాహన కలిగించుకోవాలి. అప్పుడే సబ్జెక్ట్‌ మీద పట్టు సాధించగలం’ అని తన నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని చెబుతారు ధాత్రి. ఇంట్లోనే  ఉంటూ ప్రామాణికమైన  పుస్తకాలు చదువుకోవడం, లైబ్రరీలో కూర్చుని నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవడం, ఆన్‌లైన్‌లో పరీక్షలు రాస్తూ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవడం... వీటిద్వారా మాత్రమే విజయం సాధించగలమంటూ తన సివిల్స్‌ సాధనా ప్రక్రియను వివరించారు. అంతేకాదు,  సివిల్స్‌కి ప్రిపేర్‌ అయ్యేవారికి ఉపయోగకరంగా ఉండేందుకు... తాను ఎలా సన్నద్ధమైందో తెలుపుతూ.. కష్టపడి తయారు చేసుకున్న నోట్స్‌ను కూడా తన బ్లాగులో ఉంచారు. 


ప్రజల కోసం..

దేవుడి దయవల్ల, ప్రభుత్వ కార్యాలయాల్లో పని పడకూడదనే కోరుకుంటారు చాలామంది. ఎందుకంటే అక్కడ ప్యూన్‌ నుంచి ఆఫీసర్‌ వరకు అందరినీ సంతృప్తి పరిస్తే కానీ పనులు జరగవు. ఆ పరిస్థితులు మారాలనేది ఆమె ఆలోచన. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాసేవకు సిద్ధంగా ఉండాలి. అది వారి విధి. తాము ప్రజాసేవకులమనే విషయం గుర్తుంచుకోవాలి. వ్యవస్థలో అటువంటి మార్పు రావాలనేది తన ఆకాంక్ష.  సివిల్‌ సర్వెంటుగా అదే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు ధాత్రి. అంతేకాదు, ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోయిన నేటి సమాజంలో వృద్ధుల స్థానం ప్రశ్నార్థకమైందని ఆవేదన చెందారు. పెద్దల సంక్షేమానికి మరింత కృషి జరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తను ఆ దిశగా కూడా అడుగులు వేయాలని సంకల్పించినట్టు చెప్పారు.  నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో సంవత్సరం శిక్షణ పూర్తిచేసుకొని.. వచ్చే నెలలో ఖమ్మం జిల్లాలో ఏసీపీ అండర్‌ ట్రైయినింగ్‌ గా రిపోర్ట్‌ చేయడానికి ధాత్రి సిద్ధంగా ఉన్నారు. ‘మరి ఇప్పుడు; మీరు ఐపీఎస్‌గా కొనసాగుతారాలేక ఐఏఎస్‌గా మారతారా?’ అన్న ప్రశ్నకు సమాధానంగా, ‘పోస్టింగ్‌ ఏమిటో తెలియలేదు కదా!  ఇంకా నిర్ణయించుకోలేదు’ అని నవ్వేశారు.

వ్యక్తిత్వ వికాసం ముఖ్యం

చిన్నప్పటి నుంచీ ధాత్రి కరాటేలో శిక్షణ తీసుకున్నారు. చదువుల కంటే ఆటపాటల మీదే ఆసక్తి. కరాటే పోటీల్లో పాల్గొనడం మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు. ఫలితంగా కరాటేలో బ్లాక్‌ బెల్ట్‌ సాధించారు. స్కూల్‌లో జరిగే వ్యాస రచన, ఉపన్యాస పోటీల్లో ముందుండేవారు. దీంతో, పరీక్షల కోసం చదువుకునేందుకు సమయమే దొరికేది కాదట. క్లాస్‌లో విన్నది రాస్తూ పరీక్షలు గట్టెక్కించేదాన్నని అంటారు. స్కూల్‌ హెడ్‌ గర్ల్‌గా, స్కూల్‌ క్యాబినేట్‌ ప్రైమ్‌ మినిస్టర్‌గా కూడా వ్యవహరించినట్టు పాత జ్ఞాపకాల్ని నెమరు వేసుకున్నారు. ‘నిజానికి ఈ విజయాల వెనుక మా అమ్మానాన్నల ప్రోత్సాహం ఎంతో ఉంది. ఎందుకంటే ఏనాడూ వాళ్లు నన్ను చదువుకోమని ఒత్తిడి చేయలేదు. ఏ రంగాన్ని ఎంచుకున్నా, విజయం సాధించాలని మాత్రమే చెప్పేవారు’ అంటారు ధాత్రి. ఆ  పెంపకపు ఫలితాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 

అనుకున్నది సాధించారు

సివిల్స్‌- 2018లో ధాత్రి 233వ ర్యాంక్‌ సాధించారు. ఐపీఎస్‌కి ఎంపికయ్యారు. అయితే ర్యాంక్‌ ప్రకటించిన తర్వాత ఏ సర్వీసు కేటాయిస్తారనే విషయం తెలియడానికి దాదాపు 4 నెలల సమయం ఉంటుంది. ఈలోగా మళ్లీ సివిల్స్‌ పరీక్షలు జరుగుతాయి. ర్యాంక్‌ ప్రకటించారు కానీ, పోస్ట్‌ ఏమిటో తెలియకపోవడం వల్ల మరోసారి సివిల్స్‌ రాశారు. ఆ తర్వాత ఐపీ ఎస్‌కి ఎంపిక అయినట్టు తెలిసింది. వెంటనే ట్రైనింగ్‌కి వెళ్లిపోయారు. ఈసారి మరింత మంచి ర్యాంక్‌ రావడం ఆనందంగా ఉందని అంటూనే.. ఇప్పుడు చేస్తున్న పని కూడా ఆసక్తికరంగానే ఉందని చిరునవ్వుతో చెబుతారు ధాత్రి. 

ధాత్రి బ్లాగ్‌ : dhatriReddy3.blogspot.com 


- భవాని


logo