గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Aug 05, 2020 , 23:15:02

విజయీభవ..విత్తన గణపతి!

విజయీభవ..విత్తన గణపతి!

విఘ్నాలను తొలగించి, ఆపదల నుంచి గట్టెక్కించమని గణపతిని పూజిస్తాం. ఏ విషయంలో అయినా, మానవ సంకల్పం ఉంటేనే దైవబలం తోడవుతుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో మనల్ని మనం రక్షించుకుంటూనే, ప్రకృతినీ కాపాడుకోవాలి. ఆ సదాశయంతోనే దైవకార్యానికి, మానవ ప్రయత్నాన్ని జోడిస్తూ ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌.  అదే, ‘హరితహారం’ స్ఫూర్తితో ప్రాణంపోసుకున్న .. సీడ్‌ గణేశ!  వచ్చే వినాయక చవితికి విత్తన గణపతి విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేయాలని ఆయన నిర్ణయించారు. దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి చేతుల మీదుగా  విత్తన గణపతిని ఆవిష్కరించారు.


స్వచ్ఛమైన మట్టి గణపతితో పాటు వేప విత్తనాలను ప్రజలకు పంపిణీ చేయటమే సీడ్‌ గణేశ్‌.. కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. నవరాత్రుల సందర్భంగా పూజలు అందుకునే గణేశునితో పాటు ఇచ్చే కొబ్బరిపీచు తొట్టిలోని ఆ విత్తనాలు.. ఐదు నుంచి ఏడు రోజుల్లో మొలకెత్తుతాయి. మరో వారంలో పూర్తిస్థాయి మొక్కలుగా మారుతాయి. నిమజ్జనం తర్వాత, ఈ వేప మొక్కలను నేరుగా మన ఆవరణలో నాటుకోవచ్చు. ఇప్పటికే తాను చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా, ‘గో రూరల్‌ ఇండియా’ సంస్థతో కలిసి విగ్రహాల పంపిణీ మొదలు పెడతామని ఎంపీ సంతోష్‌ చెబుతున్నారు. 

కరోనా సమయంలో గణపతి వేడుకల గురించి ఆందోళన చెందకుండా... ఎవరికి వారే తమ  ఇండ్లలో ఈ విత్తన గణపతిని ప్రతిష్ఠించుకుని, పూజల తర్వాత.. మొలకెత్తే వేప విత్తనాల్ని పెరట్లో నాటు కోవచ్చునని సూచిస్తున్నారు. తద్వారా, ప్రతీ ఇంటి ఆవరణలో ఔషధ గుణాలున్న ఒక వేప చెట్టు ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయం కూడా సిద్ధిస్తుందని తెలిపారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ద్వారా వీలైనన్ని విత్తన గణేశులను పంపిణీ చేస్తామనీ, ఆసక్తి ఉన్న స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన వచ్చనీ పిలుపునిచ్చారు. ఆకుపచ్చని తెలంగాణ సాధనలో ఈ ప్రయత్నం కూడా ఒక సాధనంగా ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.


వేవేల లాభాల వేప

ఈ కార్యక్రమానికి వేప విత్తనాలనే ఎంచుకోవడం వెనుకా ఓ గొప్ప ఆలోచన ఉంది. వేప అపారమైన ఆక్సీజన్‌ను ఇస్తూ, టన్నులకొద్దీ కార్బన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చుకుంటుంది. చీడపీడల్ని తట్టుకుని నిలబడుతుంది కూడా. ఇది.. కరోనా వేళ కాబట్టి, విత్తన గణపతితోపాటు మాస్కు, శానిటైజర్‌ కూడా అందిస్తారు. పర్యావరణం పట్ల ఎంపీ సంతోష్‌ చిత్తశుద్ధికి నిదర్శనం ఈ విత్తన గణపతి.


logo