శనివారం 24 అక్టోబర్ 2020
Zindagi - Aug 05, 2020 , 23:39:27

సోమరిపోతు

సోమరిపోతు

ఒక  గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు. అతడు చాలా ధర్మాత్ముడు. పేదవాళ్లకు  ఏ సాయమైనా చేసేవాడు.  ఒక రోజు అతని వద్దకు  సోముడు అనే ఒక యాచకుడు వచ్చాడు. జమీందారు అతనికి పుష్కలంగా పాలిచ్చే ఆవును ఇచ్చాడు. పాల వ్యాపారం చేసుకొని జీవించమన్నాడు.   సోముడు జమీందారుతో ‘అయ్యా, తమరేమో ఆవునిచ్చారు. కానీ దానిని ఉంచడానికి మా   ఇంట్లో స్థలం లేదు.’ అన్నాడు. జమీందారు  కొంత ధనమిచ్చి, ఒక గుడిసె వేసుకోమన్నాడు. ‘అయ్యా! ఆవునిచ్చారు.  గుడిసె వేసుకోవడానికి ధనమిచ్చారు. ఆవు ఇచ్చే పాలను అమ్మితే వచ్చే డబ్బు మాకే సరిపోతుంది. దానికి గడ్డీ దాణా ఎలా కొనను?’ అన్నాడు సోముడు.  అందుకు జమీందారు..  ఆవుకు కావలసిన గడ్డీ, దాణా కూడా ఉచితంగా తానే రోజూ  పంపిస్తానన్నాడు. రెండు రోజులు గడిచాయి.  సోముడు జమీందారు దగ్గరకు వచ్చి ‘అయ్యా నాకో ఇబ్బంది వచ్చింది. పాలు బజారుకు తీసుకెళ్లి అమ్మాలంటే కష్టంగా ఉంది. ఈ పని చేసే అలవాటు లేదు’ అన్నాడు. జమీందారు  ఆ పాలను తానే కొంటానన్నాడు. మరో రెండు రోజులు గడిచాయి. ఈసారి  సోముడు జమీందారు వద్దకు వచ్చి, ‘అయ్యా! ఇంత వరకు మేం భిక్షాటనతో కాలం గడిపిన వాళ్లం. ఈ ఆవుకు చాకిరీ చెయ్యడం, ఇంట్లో అన్నం వండుకోవడం.. మొదలైన పనులు చేయడం నా భార్యకు చాలా కష్టంగా ఉంది’ అని చెప్పాడు.  జమీందారు  ఆలోచించి, ‘సరే మీకు శ్రమ లేకుండా ఒక పని మనిషినీ, వంట మనిషినీ పంపిస్తాను’ అని హామీ ఇచ్చాడు.  సోముని ఇంటికి పనిమనిషీ,  వంట మనిషీ వచ్చారు. సోముని  భార్యకు చాలా సంతోషంగా అనిపించింది.  ఓ రోజు సరిగ్గా భోజనం వేళకు  సోముని  ఇంటికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వారు ఎందుకొచ్చారో సోమునికి అర్థం కాలేదు.  సోమునితో ‘ మమ్మల్ని  జమీందారు పంపించారు. మీకు భోజనం చేయడం కూడా బద్ధకం అవుతుందేమో, ఆ పని మమ్మల్ని చేయమని పంపించారు’ అని వివరించారు. ఆ మాటలు విని,  సోముడికి,  అతడి భార్యకు సిగ్గువేసింది. ఆ రోజు నుంచీ సోమరితనానికి స్వస్తిచెప్పి కష్టపడటం అలవాటు చేసుకొన్నారు.


logo