సోమవారం 28 సెప్టెంబర్ 2020
Zindagi - Aug 05, 2020 , 03:36:09

సంప్రదాయ సిరి..మంగళగిరి!

సంప్రదాయ సిరి..మంగళగిరి!

మంగళప్రదమైన ప్రతి సందర్భంలోనూ మగువలకు మంగళగిరి చీరలే గుర్తుకొస్తాయి. ఆ చీరకట్టులో.. వరలక్ష్మీ వ్రతం అయితే, ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవే! గౌరీపూజ అయితే ఆమె పర్వతరాజ పుత్రికే! బతుకమ్మ పండుగ అయితే ఆ మహిళ సద్దుల బతుకమ్మే! బోనమెత్తిన వేళ భువనేశ్వరే! మంగళగిరి చీరలకు మరో ప్రత్యేకతా ఉంది. ధర తక్కువ, ధగధగ ఎక్కువ! భారతదేశం అంటేనే చేనేత అయితే, చేనేత అంటేనే మంగళగిరే అన్నంత పేరు.     

మంగళగిరి చేనేత మూలాలు తెలంగాణలోనే ఉన్నాయంటారు చరిత్రకారులు. కుతుబ్‌షాహీల కాలంలో పన్నుల భారాన్ని మోయలేక కొంతమంది నేత కళాకారులు గుంటూరు మండలంలోని మంగళగిరి ప్రాంతానికి తరలివెళ్లినట్టు ఓ కథనం. ఇదంతా వందల సంవత్సరాల నాటి మాట. ఆ తర్వాత కొంతకాలానికి, ఆదరణ కరువై.. మార్కెట్‌ అవకాశాలు మృగ్యమై మగ్గాన్ని నమ్ముకున్న బతుకులు బుగ్గిపాలు అవుతున్న సమయంలో.. మళ్లీ తెలంగాణ డిజైన్లే ఆదుకున్నాయి. ‘నిజాం’ శైలిని ప్రవేశపెట్టడంతో విక్రయాలు ఊపందుకున్నాయి. మంగళగిరి చీరలకు 1999లో భౌగోళిక గుర్తింపు లభించింది. 

ప్రత్యేక పద్ధతి:  మంగళగిరి.. సంప్రదాయ చీరలకు పెట్టింది పేరు. దేశవిదేశాల్లో వీటికి ఎంతో పేరుంది.  ఈ చీరలలో వంద రకాల డిజైన్లు ఉన్నాయి. ఒకే రంగుతో కూడిన చీరలకు కలంకారీ కళను, ఇక్కత్‌ శైలిని జోడిస్తున్నారు ఇక్కడి నేతకారులు. స్థానికంగా ఉన్న పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దేవుడికి ఈ వస్ర్తాన్నే సమర్పిస్తారు.

జాతీయ బ్రాండ్‌: ‘జాతీయ చేనేత దినోత్సవం’ సందర్భంగా నాణ్యత, ప్రమాణాలు ఉన్న చేనేత చీరలకు గుర్తింపు ఇవ్వాలని భావించింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా చేనేత సంఘాల నుంచి ఎంట్రీలను ఆహ్వానించింది. తెలుగు రాష్ర్టాలకు మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి, ఉప్పాడ, జమ్దానీ.. ప్రాతినిధ్యం వహించాయి. దేశవ్యాప్తంగా 76 రకాల చేనేత వస్ర్తాలు ‘భారత చేనేత బ్రాండ్‌' గుర్తింపు కోసం పోటీపడ్డాయి. అందులో, మంగళగిరికి చెందిన మాస్టర్స్‌ వీవర్స్‌ అసోసియేషన్‌ సభ్యుడు వీరాస్వామి నేసిన మంగళగిరి చీర ‘భారత చేనేత బ్రాండ్‌'గా ఎంపికైంది. అదో ఘనవిజయం! 


 కళా నైపుణ్యం: పాతికేండ్ల క్రితం, మంగళగిరి చేనేత వస్ర్తాలంటే వయోధికులకు మాత్రమే అన్న అభిప్రాయం ఉండేది. క్రమంగా ఆ అపోహ తొలగిపోయింది. స్థానిక నేతన్నలు సమకాలీన డిజైన్లను పరిచయం చేయడమే ఇందుకు ప్రధాన కారణం. అప్పటిదాకా ఉన్న సంప్రదాయ డిజైన్ల స్థానంలో నిజాం నిర్మాణాలను పోలిన  బార్డర్లను రూపొందించడం మంగళగిరి చీరల చరిత్రలో ఓ గెలుపు మలుపు. ఆ ప్రయోగం విజయవంతమైంది.  మార్కెట్‌ విస్తరించింది. యువత, పిల్లలు వీరాభిమానులుగా మారిపోయారు. చీరలే కాదు.. పంజాబీ డ్రెస్‌ మెటీరియల్‌, షర్ట్స్‌.. ఇలా ఉత్పత్తుల్లోనూ వైవిధ్యం పెరిగింది. 

రంగు, మన్నిక : చాలా చీరలు, కొన్నిసార్లు కట్టుకోగానే కలర్‌ షేడ్‌ అయిపోతాయి. కానీ మంగళగిరి బట్ట మాత్రం.. చిరిగేంత వరకూ రంగు వెలసిపోదు. మెరుపూ తగ్గదు. కారణం, రంగు అద్దకంలో ఇక్కడో ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. ధర కూడా సరసమే. అవసరమైన రంగును ముందుగా ఎంచుకొని, నాణ్యమైన దారాలను ఆ రంగు నీటిలో ముంచుతారు. దారాల రంగు చక్కగా ఇమడటానికి, రంగు నీటిలో ఒక క్రమపద్ధతిలో తిప్పుతారు. వాటిని బాయిలర్లలో ఉంచి.. రంగు పట్టేదాకా అలాగే వదిలిపెడతారు. ఆ తర్వాత బాగా ఉతికి, ఆరబెడుతారు. ఆ తర్వాత దారానికి స్టిఫ్‌నెస్‌ రావడానికి గంజినీళ్లలో పెడుతారు. ఇలా చేయడం వల్ల రంగు శాశ్వతంగా ఉండటమే కాదు, గట్టిపడుతుంది. ఫలితంగా, మన్నిక పెరుగుతుంది. అంతేకాదు..ఆ దారం పాలిష్‌ చేసినట్టుగా మెరుస్తుంది. అలా తుది మెరుగులద్దుకున్నాక.. మాస్టర్‌ వీవర్‌ సరుకును చేనేత కార్మికులకు అందిస్తాడు. నేతన్న ఆ దారాన్ని లూమింగ్‌ మెషీన్‌కి ఎక్కిస్తాడు. చీర అందాన్ని పెంచడానికి బార్డర్‌లను హెవీగా నేస్తారు. బుటీస్‌ కూడా చీరకు హుందాతనాన్ని ఇస్తాయి. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ మంగళగిరి చీరల వీరాభిమాని. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ కూడా చాలా ఇష్టంగా కట్టుకొనేవారు.  

ఇలా కూడా..

చీరలే కాదు, మంగళగిరి డ్రెస్‌ మెటీరియల్‌ కూడా అందుబాటులో ఉంది. కాలేజ్‌ అమ్మాయిలు ఇష్టంగా వాడుతున్నారు. ఈమధ్య దుపట్టాలు కూడా వస్తున్నాయి. లాంగ్‌ గౌన్లు, ఫ్లోరల్‌ గౌన్లపై ఇవి బాగుంటాయి. జీన్స్‌ మీద టాప్స్‌లాగా.. షార్ట్‌, లాంగ్‌ స్కర్ట్‌లాగా, ఇండోవెస్ట్రన్‌ ప్యాటర్న్‌లో, అనార్కలీ ప్యాటర్న్‌లో.. ఎన్నో రకాలుగా డిజైన్‌ చేసుకోవచ్చు. వయసుతో నిమిత్తం లేకుండా.. ఎవరికైనా బాగా నప్పుతాయి.

రితీషా సతీష్‌రెడ్డి 

ఈశా డిజైనర్‌ హౌస్‌

ఫోన్‌: 7013639335

8500028855, facebook.com/

eshadesignerworks


logo