మంగళవారం 20 అక్టోబర్ 2020
Zindagi - Aug 03, 2020 , 23:47:41

నక్క ఆత్రం

నక్క ఆత్రం

ఓ అడవిలో రెండు నక్కలు ఎంతో స్నేహంగా తిరిగేవి. మోసానికి, జిత్తులకు, దురాశకు నక్కలు పెట్టింది పేరు. ఆ నక్కలు కలిసి మెలిసి తిరుగుతున్నాయి కానీ, మనసులో ఒకదాన్ని చూస్తే ఒకదానికి అసూయ. ఒక రోజు  రెండూ  ఆహారం కోసం  వేటకు బయలుదేరాయి.   చెట్లూ, పుట్టలూ, గుట్టలూ తిరిగి అలసిపోయాయి.  తినడానికి ఏ జంతువు మాంసమూ  దొరక్కపోవడంతో ఓ పెద్ద చెట్టు కిందికి చేరి, తీవ్రంగా విచారించాయి. కొద్దిసేపటికి నీరసంతో కునుకు తీశాయి. ఒక నక్కకు ఏదో శబ్దం వినిపించింది. ఏమిటో అనుకొని,  పక్కనే ఉన్న నక్క వైపు చూచింది. ఆ నక్క బాగా నిద్రపోతున్నదని గ్రహించి.. గబుక్కున లేచింది. 

ఎదురుగా ఓ మాంసపు ముక్క. అదృష్టం కొద్ద్దీ ఏదో పక్షి తింటున్న మాంసపు ముక్క జారిపడిందేమో అనుకుంది.  దాని దగ్గరికి పరిగెత్తింది. ఎముక చుట్టూ ఎర్రని మాంసం చూడగానే పోయేప్రాణం లేచి వచ్చినట్టయింది నక్కకు. ‘ఆహా ఎంత అదృష్టం! ఆకలితో నకనకలాడుతున్నప్పుడు ఈ ఎముక దొరికింది’ అని ఆత్రంగా నోటితో పట్టుకుంది. దూరంగా ఉన్న మరోనక్క లేచి,  పరుగుపరుగున తన దగ్గరకి రావడం చూసింది. అది వస్తే  ఈ ఎముకను ఆస్వాదించనివ్వదని భయపడి మింగింది. మింగేటప్పుడు  ఎముక నక్కనోటికి అడ్డంగా పడింది. దీంతో,  నేలమీద పడి గిజగిజా తన్నుకోవడం.. రెండో నక్క చూసింది. రెండో నక్కకు ఏంచేయాలో తోచలేదు. ఎముక మింగుడు పడక, ఊపిరి ఆడక నక్క ప్రాణం పోయింది. మాంసం ముక్కను మిత్రుడితో పంచుకోవాల్సి వస్తుందనే దురాశతో.. కంగారుగా మింగేయడం వల్లే నక్క ప్రాణాలు పోగొట్టుకుంది.  


logo