శనివారం 31 అక్టోబర్ 2020
Zindagi - Aug 04, 2020 , 00:31:06

అమ్మ దూరమయ్యాకే..ప్రేమ పెరిగింది!

అమ్మ దూరమయ్యాకే..ప్రేమ పెరిగింది!

లెక్కల కచేరీల్లో పడిపోయి బాల్యాన్ని కోల్పోయిన బాధ, కన్నతండ్రి తనను అచ్చమైన అచ్చు యంత్రంలా వాడుకున్నాడన్న ఉక్రోషం, నోరెత్తలేని తల్లి పిరికితనం కారణంగానే తోబుట్టువును కోల్పోయానన్న కోపం, మరబొమ్మను చేసి ఆడించాలనుకునే మగపురుగుల పట్ల అసహనం, ఎదగాలన్న ఆరాటం, ఓడిపోతానేమో అన్న బతుకు భయం.. అన్నీ కలిస్తే ‘హ్యూమన్‌ కంప్యూటర్‌' శకుంతల.రెండు ఒకట్లు రెండే. రెండు రెండ్లు నాలుగే! కానీ, బతుకు లెక్క వేరు. అనుబంధాల ఎక్కాలు వేరు. తనలా కాకూడదనుకొన్న కూతురు..తనకంటే మొండిగా తయారైంది. తాను తల్లినెంత ద్వేషించిందో, అంతకు పదిరెట్లు తనను చిన్నబుచ్చింది. ఏ అంకెను ఏ అంకెతో భాగిస్తే ఎంత వస్తుందో.. చిటికెలో చెప్పగల మేధావి, కూతురి మనసులోని అసంతృప్తిని మాత్రం అంచనా వేయలేకపోయింది. అది కాస్తా హెచ్చింపులోని శేషమై, ఏడుపడగల శేషమై విద్వేషాన్ని రెచ్చగొట్టింది. వ్యవహారం కోర్టు వరకూ వెళ్లింది. మొత్తానికి, ఆ కూతురికి తల్లి మనసు తెలిసింది, తల్లి ప్రేమ అర్థమైంది. కథ సుఖాంతమైంది. ఈ అనుబంధ అధ్యాయాల మధ్యలో.. గణిత కచేరీలూ, ప్రశంసలూ, పురస్కారాలూ, నానాదేశ సందర్శనలూ, రికార్డులూ!  స్థూలంగా ఇదీ ‘శకుంతలాదేవి’ బయోపిక్‌ కథాంశం. కథానాయిక శకుంతలాదేవే అయినా, ఆమె కూతురి పాత్ర కూడా ప్రతి ఫ్రేమ్‌లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కనిపిస్తూనే ఉంటుంది.  అసలు, తల్లి శకుంతలాదేవి గురించి, కూతురు అనుపమ బెనర్జీ ఏం అనుకుంటున్నది? తల్లితో తన అనుబంధం గురించి ఏం చెబుతున్నది? చదవండి..

ఎదిగే కొద్దీ నా విషయంలో అమ్మ తపన అర్థమైంది. వయసు పెరుగుతున్నకొద్దీ అమ్మకు భ్రమణకాంక్ష తగ్గిపోయింది. కుదురుగా ఒకచోట ఉండాలనీ, అదీ నా సమక్షంలోనే గడపాలనీ కోరుకునేది. అంతలోనే నా ప్రేమ, పెండ్లి, లండన్‌లో కాపురం. ఇద్దరి మధ్యా మరింత దూరం పెరిగింది. బతికున్నంత కాలం అమ్మ విలువ తెలియలేదు. అమ్మ గొప్పదనం అర్థం కాలేదు. గణితమేధావి, హ్యూమన్‌ కంప్యూటర్‌.. ఆ గౌరవాలన్నీ పక్కన పెట్టండి. అమ్మ ఓ నిఖార్సయిన మనిషి. ఆమెలా బోళాగా ఉండాలని చాలాసార్లు అనుకుంటాను. కానీ, ఉండలేదు. అమ్మలా ప్రపంచాన్ని చుట్టి రావాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ, వెళ్లలేను. 


“నీకంటూ ఓ లక్ష్యాన్ని ఎంచుకో. అడుగు ముందుకెయ్‌. ఎన్ని అవరోధాలు వచ్చినా, వైఫల్యాలు ఎదురైనా వెనక్కి తిరిగి చూడవద్దు” - అమ్మ ఎప్పుడూ చెప్పే మాట ఇది. తాను ఆచరించిన సూత్రమూ ఇదే. మా అమ్మ జీవన ప్రయాణం బెంగళూరులో ప్రారంభమైంది. పేదరికంతో మొదలైంది. దరిద్రుడికి ఆకలి ఎక్కువ. కడుపునిండా తినడానికి ఉన్న రోజు కూడా, రేపటికి ఎలా అన్న భయం నిమ్మళంగా భోంచేయనివ్వదు. ఆ అభద్రతే ఆశకూ, దురాశకూ కారణం అవుతుంది. అలాంటి ఓ దురాశాపరుడే మా తాతయ్య! సర్కస్‌ కంపెనీలో పనిచేసేవాడట. జంతువులను ఆడించినట్టు మా అమ్మనూ, అమ్మమ్మనూ ఆడించేవాడు. అమ్మకేమో బలీయమైన ఆకాంక్ష .. ఎదగాలనీ, పేరు తెచ్చుకోవాలనీ, ప్రపంచాన్ని చుట్టి రావాలనీ. దానికితోడు లెక్కలతో వచ్చిన లెక్కలేనితనం! ఫలితంగా, బంధాలు బీటలు వారాయి. ఒంటరి ప్రయాణానికి సిద్ధపడింది అమ్మ. ఆ దార్లో చాలామంది పురుషులు తారసపడ్డారు. ఏరికోరి నాన్నను జీవిత భాగస్వామిగా స్వీకరించింది. ఆయన ఐఏఎస్‌ అధికారి. 

అసాధారణ స్త్రీ

మా అమ్మ అందరిలాంటి ఆడపిల్ల కాదు. కుటుంబాన్నీ, సమాజాన్నీ లెక్కచేయలేదు. చివరికి, కాలాన్ని కూడా పట్టించుకోలేదు. అప్పటికంటే, ఓ యాభై ఏండ్లు ముందు ఆలోచించింది. భార్య అంటే అణకువగా ఉండాలనీ, భర్త చాటున బతుకాలనీ ఎవరైనా సలహా ఇస్తే.. పగలబడి నవ్వేది. తనో స్వేచ్ఛా జీవి. పంజరాన్ని ద్వేషించే చిలుక. బంధాల్ని బంధనాల్లా భావించేతత్వం. ప్రేమ కంటే స్వేచ్ఛే గొప్పదని నమ్మే మనిషి. ఓ దశలో భర్తకూడా భారమనిపించాడు.  విడాకులు  ఇచ్చేసింది. కానీ, నా దగ్గరికి వచ్చేసరికి.. తన పంజరంలో నేనో పక్షిలా బతకాలని ఆశ పడింది. తను ఎక్కడికెళ్లినా నన్నూ తీసుకుని వెళ్లింది. అంతలోనే, నేను మానసికంగా దూరమైపోతానేమో అన్న భయంతో - లెక్కల రెక్కలు విరిచేసుకుని ఇంట్లోనే కూర్చుంది. అదీ తాత్కాలికమే. మళ్లీ తన దారి తనదే. 

సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలకు చదువులోనే పరిష్కారం ఉందని చెప్పేది. ‘చదువుతో ఆత్మవిశ్వాసం వస్తుంది. సంపాదించే శక్తి వస్తుంది. అప్పుడు సమాజం పప్పులు ఉడకవు’ - అనేది. నా కండ్ల ముందే, ఎంతోమంది ఆడపిల్లలకు ధైర్యాన్నిచ్చింది. ఆర్థికంగా ఆదుకుని ప్రోత్సహించింది. ‘నీ మనసు మాట తప్పించి, ఎవరి మాటా వినాల్సిన పన్లేదు. నీ జీవితం నీది. నీ కలలు నీవి. వాటిని నిజం చేసుకో. జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించు’ - అని చెప్పేది. 

భవిష్యవాణి

అమ్మకు ఓ దశలో జ్యోతిషం మీద గురి కుదిరింది. జ్యోతిషశాస్ర్తానికీ, గణితానికీ దగ్గరి సంబంధం ఉండటం వల్ల కావచ్చు. దానిమీదా పట్టు సాధించింది. తాను యథాలాపంగా చెప్పిన విషయాలూ నిజం అయ్యేవి. మా వారిని, మొదటిసారిగా ఏదో పార్టీలో చూసింది. ‘ఇతను ఎందుకో బాగా దగ్గరివాడిలా అనిపిస్తున్నాడు. ఏదో ఒకరోజు మన కుటుంబ సభ్యుడు అవుతాడేమో’ అని చెప్పింది. నిజానికి, అప్పటికి తనతో నాకు పరిచయం మాత్రమే ఉండేది. ఇంకా ప్రేమలో పడలేదు. నరేంద్ర మోదీ గురించి కూడా అంతే. ‘ఇతను దేశానికి ప్రధాని అవుతాడు’ టీవీలో మోదీ కనిపించిన ప్రతిసారీ అనేది. 2013 ఫిబ్రవరిలో నా కూతురిని చూడటానికి లండన్‌ వచ్చింది. ‘ఇక నేను లండన్‌కు రాకపోవచ్చు. ఇదే నా చివరి పర్యటన’ - అని శూన్యంలోకి చూస్తూ చెప్పింది ఎయిర్‌పోర్టులో. ‘అలా ఏం కాదు. మేం జూన్‌లో ఇండియా వచ్చేస్తాం. మాతోపాటు మళ్లీ వచ్చేద్దువు కానీ’ చెప్పాన్నేను.‘అప్పటి వరకూ నేను బతికుంటేగా?’  - ఓ విరాగిలా మాట్లాడింది. నేను తేలిగ్గా తీసుకున్నాను. కానీ, అమ్మ చెప్పినట్టే జరిగింది. మార్చిలోనే కన్ను మూసింది. జీవితం మా ఇద్దరితో దోబూచులాట ఆడించింది. తను, దగ్గర కావాలని ప్రయత్నించినప్పుడు నేను దూరమయ్యాను.నేను దగ్గర కావాలని ఆరాటపడినప్పుడు తను దూరమైంది.దేవుడి లెక్కలు వేరుగా ఉంటాయేమో!

నిత్యం పరుగే

అమ్మకు పరిచయాలు ఎక్కువ. స్నేహాలు ఎక్కువ. మనుషుల్ని ఆకట్టుకునే అయస్కాంతత్వ శక్తీ ఎక్కువే. తొలి పరిచయంలోనే ‘నేను రేపు మీ ఇంటికి బ్రేక్‌ ఫాస్ట్‌కు వచ్చేస్తాను. మంచి మసాలా దోసె కావాలి. సరేనా? ఊరించి ఊరించి ఉప్మా పెడితే మాత్రం ఊరుకోను’ అంటూ నవ్వుతూ హెచ్చరించేది. నాకు అదంతా విచిత్రంగా అనిపించేది. అపరిచితులతోనూ అంత చనువు ఎలా సాధ్యం? తనకు నచ్చినట్టుగా జీవించేదామె. పార్టీల్లో డ్యాన్స్‌ కూడా చేసేది. అమ్మ డైరీ ఎప్పుడూ బిజీగా ఉండేది. కార్యక్రమం తర్వాత కార్యక్రమం. ఉపన్యాసం తర్వాత ఉపన్యాసం. సమావేశం తర్వాత సమావేశం. చివరికి ఏ ప్రముఖుడి నివాసంలోనో రాత్రి విందు! ఆ పరుగు నాకు నచ్చేది కాదు. నా కలల్ని అమ్మ ఓ కాకిలా, గద్దలా ఎత్తుకెళ్తున్నట్టు అనిపించేది. కోపం వచ్చేది. కొట్లాడాలనిపించేది. ఆ అసంతృప్తితోనే, సరిగా మాట్లాడేదాన్ని కాదు. కడుపునిండా భోంచేసేదాన్ని కాదు. దీంతో నన్ను బోర్డింగ్‌ స్కూల్లో వేసింది. ఏడాదికోసారి సెలవులు. అమ్మ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లేదాన్ని. అదీ అయిష్టంగానే! ప్రపంచమంతా చుట్టేసినా అమ్మకు బెంగళూరు అంటే ప్రాణం. ముఖ్యంగా, ఇక్కడి ఉడుపి రెస్టరెంట్లలో చేసే మసాలా దోసెలంటే మహా ఇష్టం. 

తాజావార్తలు