గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Aug 04, 2020 , 00:31:06

‘లాక్‌డౌన్‌' నేస్తాలు!

‘లాక్‌డౌన్‌' నేస్తాలు!

కొవిడ్‌తో ప్రపంచమే తలకిందులైంది. ఇక, ఉపాధి సంగతి చెప్పేదేముంది? లాక్‌డౌన్‌ వల్ల ప్రాణాలు దక్కినా, ఉద్యోగాలు మాత్రం కరిగిపోయాయి. అందులోనూ, మహిళల ఆదాయానికి గణనీయంగా గండి పడింది. వ్యాపారంలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న వారికి ఇది శరాఘాతమే! అదృష్టవశాత్తు... ఇలాంటి సందర్భాలలో కొన్ని సంస్థలు వారికి అండగా నిలబడుతున్నాయి.

బేసిస్‌

మీరు గమనించారో లేదో... ఆర్థిక సేవలన్నీ మగవారి కోసమే రూపొందించినట్టు కనిపిస్తాయి. నిజానికి మగవారితో పోలిస్తే ఆడవాళ్లు ఎక్కువ కాలం జీవిస్తారు, కెరీర్‌పరంగా మరిన్ని సవాళ్లను ఎదుర్కొంటారు, ఆరోగ్యపరమైన సమస్యలూ ఎక్కువే... అన్నీ ఎక్కువే! కానీ మగవారితో పోలిస్తే జీతం మాత్రం చాలా తక్కువ. కాబట్టి ఆర్థిక సేవలు వారికే మరింత అవసరం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని... హేనా మెహతా ‘బేసిస్‌' అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. పెట్టుబడులు, పన్నులు, ఆదాయ మార్గాలు, పరపతిని పెంచుకునే ఉపాయాలు... అన్నీ బేసిస్‌ యాప్‌ ద్వారా అందుతాయి. బంగారం కొనాలా వద్దా?  తొలినాళ్లలో జీతాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? లాంటి సవాలక్ష సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి.

లాక్‌డౌన్‌ సమయంలో బేసిస్‌ తన దూకుడును మరింత పెంచింది. నిపుణులతో ఆన్‌లైన్‌ సమావేశాలను నిర్వహించడంతో పాటు ‘ఇన్నర్‌ సర్కిల్‌ లీడర్స్‌' అనే వినూత్నపథకాన్ని మొదలుపెట్టింది. ఇందులో అనుభవజ్ఞులైన మహిళలు... తన గ్రూప్‌లో చేరినవారికి ఉపాధి, ఆర్థిక రంగాలలో మార్గదర్శకత్వం వహిస్తారు. అందుకే లాక్‌డౌన్‌ సమయంలో బేసిస్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నవారి సంఖ్య మూడు రెట్లు పెరిగిపోయింది. ప్రస్తుతం పదిహేను వేల మందికి పైగా మహిళలు, బేసిస్‌ సాయంతో స్థిరమైన అడుగు వేస్తున్నారు. మరిన్ని వివరాలకు.. getbasis.co.


షి- కేపిటల్‌

డబ్బును వృథాగా బ్యాంకులో దాచుకోవాలని ఎవరు మాత్రం అనుకుంటారు. ఓ లాభసాటి వ్యాపారం ఉంటే, అందులో పెట్టుబడి పెట్టాలని ఎవరికైనా అనిపిస్తుంది. మరికొందరికేమో, అద్భుతమైన వ్యాపార ప్రణాళికలు సిద్ధంగా ఉన్నా... అమలు చేసేందుకు తగిన డబ్బు ఉండదు. మగవారు కొంతవరకు నయం. కానీ ఆడవాళ్లకి దక్కే ప్రోత్సాహం నామమాత్రం. అందుకే, కేవలం మహిళలకే పెట్టుబడిని అందించేందుకు ముందుకు వచ్చింది ‘షి-కేపిటల్‌' సంస్థ. మహిళా పారిశ్రామికవేత్త  అనిషాసింగ్‌ దీన్ని స్థాపించారు. లాక్‌డౌన్‌ సమయంలో   వెనక్కి తగ్గలేదు సరికదా... మరింత మందికి పెట్టుబడులను అందించేందుకు సిద్ధపడుతున్నారు. తాము అందించలేని పక్షంలో, ఇతర మార్గాలలో రుణాలు పొందేందుకు తనవంతు సహకారం అందిస్తుంది. పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపమన్నారు కదా! మరింత సమాచారం కోసం.. shecapital.vc వెబ్‌సైట్‌ చూడవచ్చు.

..ఇవే కాదు jobs for her, sheroes లాంటి ఎన్నో సంస్థలు లాక్‌డౌన్‌ సమయంలో తమ వంతు సేవలను అందిస్తున్నాయి. ప్రతి మగవాడి విజయం వెనుకా ఓ ఆడది ఉన్నట్టుగానే, ప్రతి స్త్రీ విజయం వెనుక మరో స్త్రీ ఉంటుందని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. 


logo