బుధవారం 21 అక్టోబర్ 2020
Zindagi - Aug 02, 2020 , 23:32:54

రాఖీతో.. ప్రేమను పంచండి!

రాఖీతో.. ప్రేమను పంచండి!

రక్షాబంధన్‌.. అంటేనే ప్రేమ వేడుక, రక్షణ పండుగ. మనతో పాటు తోటివాళ్లూ క్షేమంగా ఉండాలని కోరుకొనే సందర్భం.రాఖీ ఒక భావోద్వేగం. ఒక భరోసా. ఒక మద్దతు. రక్షా బంధనాన్నీ, బంధాన్నీ తోబుట్టువులతో పాటు అనాథలకూ విస్తరించమని పిలుపునిస్తున్నారు ‘గుడ్‌ విన్‌' ఎన్జీవో ప్రతినిధి షెర్లీ.

‘రాఖీ పండుగ సందర్భంగా ప్రేమను పంచండి’ అంటున్నారు ‘గుడ్‌ విన్‌' ఎన్జీవో వ్యవస్థాపకురాలు షెర్లీ దేవరపల్లి. రక్షాబంధన్‌ను పురస్కరించుకొని ‘షేర్‌ లవ్‌ విత్‌ రాఖీ’ అనే క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టారు ఈ యువతి. కరోనా వల్ల అనాథాశ్రమాలకు విరాళాలు ఆగిపోయాయనీ.. దీంతో పిల్లలు ఆకలితో అలమటించే పరిస్థితులు ఏర్పడ్డాయని గ్రహించారు. దేశవ్యాప్తంగా తొమ్మిది వేల సంస్థల దుస్థితిని తెలుసుకున్నారామె. ఈ సమస్య పరిష్కారంలో ప్రజల సహకారం కావాలంటూ ‘షేర్‌ లవ్‌ విత్‌ రాఖీ’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఈ రక్షాబంధన్‌ సందర్భంగా కనీసం 20 ఆశ్రమాల పిల్లల ఆకలిని తీర్చాలనేది ఆమె ఆలోచన. మనలో చాలామంది రాఖీ కో సం వందల రూపాయలు ఖర్చు పెడతారు కదా? దాంతోపాటే, ఓ చిన్న రాఖీ కొంటున్నాం.. అనుకొని రూ.11 విరాళంగా ఇవ్వాలని కోరుతున్నారు. ఆ మొత్తాన్ని పోగుచేసి ఒక్కో ఆశ్రమానికి రూ.5వేలు విరాళంగా ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. కొవిడ్‌ సంక్షోభం వల్ల ఇప్పటికే కష్టాల్లో ఉన్న అనాథ పిల్లలకు పౌష్టికాహారాన్ని, మెరుగైన ఆరోగ్యాన్నీ అందించే బాధ్యతను పౌరులుగా మనం తీసుకోవాలని కోరుతున్నారు. అనాథ పిల్లల కోసం ఒక పెద్దన్నలా.. ఒక పెద్దక్కలా విరాళాలు ఇవ్వాలని పిలుపునిస్తున్నారు.  

ఆత్మరక్షణ పాఠాలు..

షెర్లీ ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులలోని మారుమూల ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు కరాటేలో శిక్షణ ఇస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. అనాథాశ్రమాల్లో ‘టాలెంట్‌ హంట్‌' నిర్వహిస్తున్నారు. ఒకసారి షెర్లీ ఏదో స్కూల్‌లో ‘వర్క్‌షాప్‌' నిర్వహించి తిరిగి వెళ్తుండగా.. ఒక అమ్మాయి పరుగెత్తుకుంటూ వచ్చిందట. ‘అక్కా.. ప్లీజ్‌ కరాటే నాక్కూడా నేర్పించవా? ఇది నేర్చుకుంటే నిజంగా ఆత్మరక్షణ సాధ్యమేనా? మా అమ్మ రోజూ గృహహింసతో నరకం అనుభవిస్తున్నది. నేను కరాటే నేర్చుకొని తనని కాపాడగలనా చెప్పండి?’ అంటూ ఆ చిన్నారి వేడుకోవడం చూసి చలించిపోయారు షెర్లీ. సమాజంలో ఇలాంటి పరిస్థితి ఉన్నందుకు నవ్వాలో.. ఏడవాలో అర్థంకాలేదట. ప్రతి విద్యార్థీ విధిగా కరాటేలో శిక్షణ తీసుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు. 


logo