శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Aug 01, 2020 , 23:59:54

కరోనాకు ముందు పాచి పనులు ఇప్పుడో కంపెనీకి ఓనర్‌

కరోనాకు ముందు పాచి పనులు ఇప్పుడో కంపెనీకి ఓనర్‌

నాలుగిండ్లలో పాచిపనులు చేసి కుటుంబాన్ని భారంగా వెళ్లదీస్తున్న జీవితం ఆమెది. ముగ్గురు పిల్లల జీవితాలను ఆమె ఒక్కరే భుజాలకెత్తుకొని మోస్తున్నారు. కరోనా మహమ్మారి ఆ మహిళ ఉపాధిని దెబ్బకొట్టింది. వైరస్‌ భయంతో ఇండ్లల్లో పనిచేయించుకోవటానికి ఎవరూ ముందుకు రావటంలేదు. ఇంతకాలం సంపాదించి పొదుపుచేసింది కూడా ఏమీలేదు. ఇప్పుడెలా? పిల్లల కడుపు నింపాలి. ఇంటి కిరాయి కట్టాలి.. చేతిలో చిల్లిగవ్వలేదు. అద్భుతమైన వంటలు చేయగల నైపుణ్యం తప్ప. కానీ కరోనా సంక్షోభం ఆమెకు కొత్త మార్గాలు చూపింది. ఇంతకాలం కూడు.. గుడ్డ మాత్రమే సంపాదించిపెట్టిన ఆమె నైపుణ్యం ఇప్పుడు ఓ ఫుడ్‌ డెలివరీ కంపెనీకి ఓనర్‌ను చేసింది. కరోనాను అవకాశంగా మార్చుకున్న ఆ మహిళ పేరు సరోజ్‌ దీదీ.  

బెంగళూరుకు చెందిన సరోజ్‌ దీదీ ఉపాధి కోల్పోయి దిక్కుతోచకుండా ఉన్న సమయంలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసే అంకిత్‌ వెంగులేర్కర్‌ అనే వ్యక్తి ఓ ఆలోచన చెప్పాడు. ఇంట్లోనే వంటలు చేసి చుట్టుపక్కల ఇండ్లల్లో  అవసరమైన వారికి అమ్మితే ఎలా ఉంటుందని ఆలోచించి వెంటనే అమల్లో పెట్టారు. పసందైన వంటలు చేయటం సరోజ్‌ దీదీ పని. ఆర్డర్లు తెవటం, వంటకు అవసరమైన సరుకులు సమకూర్చటం, వండిన తర్వాత ఆహారాన్ని ప్యాక్‌ చేసి డోర్‌ డెలివరీ చేయటం అంకిత్‌ పని. ప్రారంభంలో ఒకటిరెండు ఆర్డర్లతోనే ప్రారంభమైన వీరి వ్యాపారం కొద్దిరోజుల్లోనే ఊపందుకుంది. ప్రస్తుతం  వారాంతాల్లోనే  ఆర్డర్లు స్వీకరిస్తున్నారు. అయినా సరోద్‌ దీదీ వారానికి రూ.6,000 వరకు సంపాదిస్తున్నారు. కరోనాకు ముందు ఈ మొత్తం ఆమె నెల సంపాదన. పదో ఏటనుంచే వంటలు మొదలుపెట్టిన ఆమె దేశంలోని దాదాపు అన్ని రాష్ర్టాల వంటలూ అద్భుతంగా చేయగలరు. దాంతో ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడామెకు ఇండ్లల్లో పాచిపనులు వెతుక్కోవాల్సిన పనిలేదు. సరోజ్‌ దీదీ.. ఓ స్టార్టప్‌ కంపెనీ సహ యజమాని.


logo