శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Aug 01, 2020 , 23:59:34

ఓట్‌ ఫర్‌..ఓటీటీ!

ఓట్‌ ఫర్‌..ఓటీటీ!

ప్రేక్షకుడు థియేటర్‌ వరకూ వెళ్లే పరిస్థితులు లేనప్పుడు థియేటరే ప్రేక్షకుడి దగ్గరికి వెళ్లాలి. ఇది మార్కెట్‌ మంత్రం. ఓవర్‌ ది టాప్‌ ప్లాట్‌ఫామ్స్‌ (ఓటీటీ) విజయ రహస్యం అదే. కాబట్టే, అగ్రహీరోల సినిమాలకే కాల్షీట్లు ఇచ్చే కథానాయికలు కూడా ఓటీటీకి ఓటేస్తున్నారు. ప్రయోగాత్మకమైన పాత్రలు అంగీకరిస్తున్నారు. వైవిధ్యమైన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్నారు. 

హీరోయిజం చుట్టూ తిరిగే చిత్రసీమలో కథానాయికలకు తమలోని నటనను ఆవిష్కరించుకొనే అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. ప్రయోగాత్మక పాత్రలతో, వైవిధ్యమైన కథలతో ప్రతిభను చాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్న హీరోయిన్స్‌కు  డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ మంచి వేదికలుగా మారాయి. అగ్ర కథానాయికలు సైతం డిజిటల్‌ మాధ్యమాల ద్వారా తమలోని సరికొత్త కోణాల్ని అభిమానులకు పరిచయం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వెండితెరపై నెరవేరని కలల్ని ఓటీటీ ద్వారా సాకారం చేసుకొంటున్నారు. 

తొలి అడుగులు: దక్షిణాది అగ్రకథానాయికల్లో ఒకరు సమంత. వైవిధ్యమైన పాత్రలతో వెండితెరపై అభిమానుల్ని మెప్పిస్తున్న అక్కినేనివారి ఇంటి కోడలు ‘ఫ్యామిలీ మాన్‌-2’తో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టబోతున్నది. రాజ్‌-డీకే ద్వయం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సిరీస్‌లో కెరీర్‌లోనే తొలిసారిగా యాక్షన్‌ ప్రధానమైన పాత్రలో నటిస్తున్నది. ఇందుకోసం డూప్‌ లేకుండానే యాక్షన్‌ సన్నివేశాల్లో నటించినట్టు సమంత చెబుతున్నది. ఈ సిరీస్‌లో నెగెటివ్‌ షేడ్స్‌తో ఆమె పాత్ర సాగనున్నట్టు ప్రచారం. అక్టోబర్‌లో ఇది ప్రసారం కానున్నది. ప్రస్తుతం చిరంజీవి, కమల్‌హాసన్‌ వంటి స్టార్స్‌తో సినిమాలు చేస్తూ  దక్షిణాది చిత్రసీమలో బిజీగా ఉన్న కాజల్‌ అగర్వాల్‌ కూడా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌పై దృష్టి సారించింది. వినూత్నమైన కథాంశంతో ఓటీటీలో తొలి అడుగు వేసేందుకు సమాయత్తం అవుతున్నది. ఇప్పటికే, రెండు వెబ్‌సిరీస్‌లకు  ఓకే చెప్పినట్టు సమాచారం. ప్రియాంక చోప్రాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టిన ‘క్వాంటికో’ సిరీస్‌ రీమేక్‌లో కాజల్‌ నటించబోతున్నట్టు వినికిడి. ఇందులో గ్లామర్‌ హంగులకు కొదవ లేకుండానే కాజల్‌ పాత్ర సాగనున్నట్టు తెలిసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో రూపొందనున్న ఓ వెబ్‌సిరీస్‌లోనూ కాజల్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నది.  సకల ఉద్వేగాల మేళవింపుతో ఈ సిరీస్‌ తెరకెక్కనున్నది.

అనుకోకుండా డిజిటల్‌ ఎంట్రీ

లాక్‌డౌన్‌ కారణంగా గత నాలుగు నెలలుగా థియేటర్లు మూత పడటంతో టాలీవుడ్‌, బాలీవుడ్‌లతోపాటు వివిధ భాషల్లో విడుదల కావాల్సిన పలు సినిమాలు వాయిదా పడ్డాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో నిర్మాతలు తమ సినిమాల్ని ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అలా కాకతాళీయంగా కొందరు కథానాయికలు ఓటీటీలో అరంగేట్రం చేశారు. సీనియర్‌ నాయిక జ్యోతిక తాను నటించిన ‘పొన్‌మగల్‌ వంధాన్‌' చిత్రాన్ని ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నట్టు ప్రకటించి కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. చిత్రబృందం నిర్ణయాన్ని పంపిణీదారులు ప్రశ్నించారు. థియేటర్‌ వర్గాలు వ్యతిరేకించాయి. అయినా వెనక్కి తగ్గకుండా ఓటీటీలో విడుదల చేశారు. ఆ స్ఫూర్తితో, పలువురు దర్శకనిర్మాతలు డిజిటల్‌ దారి పట్టారు.  ‘పెంగ్విన్‌' సినిమాతో కీర్తి సురేష్‌ తొలిసారి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకొన్నది. కార్తిక్‌ సుబ్బరాజ్‌ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో తప్పిపోయిన కుమారుడి కోసం అన్వేషించే తల్లిగా చక్కని నటనను ప్రదర్శించింది. ఓటీటీలో పరిమిత బడ్జెట్‌లోనే అగ్ర కథానాయికలతో సినిమాలు రూపొందించవచ్చని ‘పెంగ్విన్‌' ద్వారా కీర్తి సురేష్‌ నిరూపించింది. మహిళా ప్రధాన ఇతివృత్తాలతో తెలుగులో ఆమె నటిస్తున్న రెండు సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే శ్రద్ధా శ్రీనాథ్‌, సీరత్‌ కపూర్‌ ‘కృష్ణ్‌ అండ్‌ హిజ్‌ లీల’ సినిమాతో డిజిటల్‌లో అడుగుపెట్టి మెప్పించారు. తమన్నా నటించిన ‘దటీజ్‌ మహాలక్ష్మి’ ఓటీటీ ద్వారా విడుదల కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

‘నిత్య’నూతనం

నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో దక్షిణాది చిత్రసీమలో విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్న నిత్యామీనన్‌ కూడా ఇటీవల ఓటీటీ వేదికపై ఎంట్రీ ఇచ్చింది. ‘బ్రీత్‌ ఇన్‌ టు ది షాడోస్‌' హిందీ వెబ్‌సిరీస్‌తో తొలి ప్రయత్నంలోనే ప్రతిభను చాటుకున్నది. కిడ్నాప్‌కు గురైన కూతురి కోసం అన్వేషించే తల్లిగా అభినయంతో ప్రశంసలు అందుకున్నది. కమల్‌హాసన్‌ తనయ శృతిహాసన్‌ ‘ట్రెడ్‌స్టోన్‌' అనే అమెరికన్‌ టీవీ సీరిస్‌ ద్వారా ఓటీటీలో అడుగుపెట్టింది. తక్కువ నిడివి ఉన్న పాత్ర అయినా మంచి పేరును తెచ్చిపెట్టింది. 

తమన్నా తయార్‌

మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఓటీటీ బాట పడుతున్నది. ‘ది నవంబర్‌ స్టోరీ’ పేరుతో తొలి వెబ్‌సిరీస్‌ చేయనున్నది. మహిళా ప్రధాన ఇతివృత్తానికి క్రైమ్‌ థ్రిల్లర్‌ హంగుల్ని జోడించి తెరకెక్కుతున్న ఈ సిరీస్‌లో ఆమె పాత్ర ప్రయోగాత్మక పంథాలో సాగనున్నట్టు చెబుతున్నారు. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో దర్శకుడు రామ్‌ సుబ్రమణియన్‌ కథను సిద్ధం చేసినట్టు తెలిసింది. నేరస్తుడైన తండ్రిని కాపాడే తనయ పాత్ర తమన్నాది. ఇది, తనలోని ప్రతిభను భిన్న రీతిలో చాటి చెప్పే వెబ్‌సిరీస్‌ కాబోతున్నదని తమన్నా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నది. 

బాలీవుడ్‌ ట్రెండ్‌

బాలీవుడ్‌లో ఓటీటీ ట్రెండ్‌ కొత్తేమీకాదు. రాధికా ఆప్టే, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌తో పాటు పలువురు కథానాయికలు చాలా ఏండ్లుగా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా  తమ ప్రతిభను చాటుకుంటూనే ఉన్నారు. ‘ఘోస్ట్‌ స్టోరీస్‌'తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌. ఆంథాలజీ ఫిల్మ్‌గా రూపొందిన ఈ హారర్‌ చిత్రంలో జాన్వీ తన నటనతో ఆకట్టుకుంటుంది.  జాన్వీ కపూర్‌ తొలి బయోపిక్‌ ‘గుంజన్‌ సక్సేనా’తో పాటు హారర్‌ చిత్రం ‘రూహీ అఫ్జానా’  త్వరలో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. థియేటర్లలోనే విడుదల కావాల్సిన ఈ సినిమాలను లాక్‌డౌన్‌ కారణంగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. అలియా భట్‌ తొలిసారి ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘సడక్‌-2’ డిజిటల్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. తండ్రి మహేష్‌ భట్‌ దర్శకత్వంలో అలియా నటించిన తొలి చిత్రమిది. శృతిహాసన్‌ ‘యారా’ ఇటీవలే డిజిటల్‌ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇలియానా (బిగ్‌బుల్‌), కియారా అద్వానీ (లక్ష్మీబాంబ్‌), సోనాక్షీ సిన్హా, ప్రణీత సుభాష్‌ (భుజ్‌ ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా), కృతిసనన్‌ (మిమి) .. తొలిసారి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో తమ ప్రతిభను చాటేందుకు సిద్ధమవుతున్నారు. సీనియర్‌ నాయికలు కరీనా కపూర్‌ (మెంటల్‌ హుడ్‌), సుస్మితాసేన్‌(ఆర్య) వెబ్‌సిరీస్‌లతో సరికొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అనుష్కశర్మ నిర్మించిన ‘పాతాళ్‌లోక్‌' వెబ్‌సిరీస్‌ విమర్శకుల ప్రశంసల్ని అందుకొన్నది. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ మీద ఎంట్రీ ఇవ్వడానికి మరికొందరు కథానాయికలు సిద్ధంగా ఉన్నారు.


logo