శనివారం 31 అక్టోబర్ 2020
Zindagi - Aug 01, 2020 , 23:59:31

తెల్విగల్ల దొంగలు!

తెల్విగల్ల దొంగలు!

అందరికీ శనార్తులు..  వార్తలకు స్వాగతం.. నేను మీ పోశమ్మ! 

ముందుగాల ముందుగాల ముఖ్యాంశాలు. 

సూపర్‌ మార్కెట్ల దొంగలాట.. 

ఒకనికొకడు తన్నులాట

అవాక్కయిన ఓనరు.. 

తేరుకునేసరికి ఇద్దరు పరారు 

షేటు చేతికొచ్చిన తుపాకీ.. 

శెక్కరొచ్చి పడిపోయిన దొంగ 

పొట్టోని నెత్తి పొడుగోడు కొడ్తే.. పొడుగోని నెత్తి పోశవ్వ గొట్టిందంటే గిదే కావచ్చు. ఎక్కడ సుదురాయించక ఇద్దరు దొంగలు సూపర్‌మార్కెట్ల దూరిండ్రొకతాన. 

ఒకడేమో కౌంటర్‌ కాడ ‘అవ్‌ సేటూ.. గుర్తువట్టినవా? నేను మీతాననే తీస్కపోత. గా కింది సంచిల ఉంది సూడు అదెట్ల కిల?’ అని మత్పరించుడు మొదలువెట్టిండు. 

దొంగల గిరాకని తెల్వక ఆ సేటేమో.. ‘హా.. అవ్‌ అవ్‌ నువ్వు వొస్తుంటవ్‌ గదా. సూశిన’ అని ముచ్చట్ల వడ్డడు. 

ఇంకో దొంగ.. మెల్లగ సంచి తెర్శి ఉప్పులు, పప్పులు, బిస్కోట్లు ఒకటెన్క ఒకటి సప్పుడుగాకుంట సంచిల జమాయిస్తుండు. 

ఇంతలనే టపా టపా అని తుపాకీ సప్పుడు వచ్చింది. ‘హమ్మా.. మనమే దొంగలమంటే మనకంటే పెద్ద దొంగెవడో పిస్తోల్‌తో వొచ్చిండ్రా.. ఎట్ల తప్పించుకునేది?’ అనుకొని ఎదురుంగ ఒక రోలర్‌ ఇసిరేశిర్రు. ‘ఎవడ్రా’ అని ఆ దొంగ వచ్చేసరికి వెనకాల నుంచి అట్కాయించి పిస్తోల్‌ గుంజుకున్నరు. ఆయింత ర్యాక్స్‌ మీదికి నూకేసి సేటు చేతిల పిస్తోల్‌ పెట్టి బైటికి ఉర్కిండ్రు. పిస్తోల్‌ చేతిలవడ్డంక దైర్నమొచ్చిన సేటు ‘లే బిడ్డ.. లే’ అన్కుంట కూసుండు. 

సూశిర్రానుల్లా.. సేటు కండ్లుగప్పి దొంగతనం చేద్దామని ఆల్లొస్తే.. పిస్తోల్‌ సూపెట్టి బెద్రిద్దామని ఇంకోడొచ్చె. తెల్విగల్ల దొంగలు గావట్టె ఆల్లు తప్పించుకుండ్రు. పెద్ద దొంగను సేటుకు పట్టించి పోయిండ్రు. ఈ వీడియో ఇంటర్నెట్ల శెక్కర్లు కొడ్తుంది.