గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Aug 01, 2020 , 23:45:59

రాఖీలు చేద్దాం రండి

రాఖీలు  చేద్దాం రండి

హాయ్‌ పిల్లలూ! రాఖీ పండుగ వచ్చేసింది. అన్నయ్యలకూ,  తమ్ముళ్లకూ రాఖీలు కట్టే పనిలో ఉన్నారు కదా! కానీ గతేడాది రాఖీ పండుగకూ, 

ఈ రాఖీ పండుగకూ చాలా తేడా ఉంది.  కొవిడ్‌ కాలంలో రాఖీ పండుగ.. అంటే ఎంతో జాగ్రత్తగా జరుపుకోవాలి.  ఈ పరిస్థితుల్లో రాఖీలు కొనుక్కోవడానికి బయటకు వెళ్లడం ఎందుకు? ఇంట్లోనే  అందమైన రాఖీలను తయారు చేసుకొంటే మంచిది! రాఖీలను సులభంగా ఎలా  

తయారు చేయాలో చూద్దాం!

కావాల్సినవి: ఊలు దారం, కత్తెర, గమ్‌, స్టికర్స్‌.

ఇలా చేయాలి: ఊలు దారాన్ని తీసుకొని,  నాలుగు చేతివేళ్ల చుట్టూ  పది సార్లు చుట్టాలి. అది ఉండలా తయారవుతుంది. ఆ ఉండను చేతి నుంచి తీసి, మధ్యలో ముడి వేయాలి. ఆ ముడితో పాటు, మరో రెండు లేదా మూడు దారపు పోగులు విడదీయాలి. అవి చేతికి కట్టుకోవడానికి వీలుగా ఉంటాయి.  తర్వాత ఉండ అంచులను కత్తిరించాలి. దీని వల్ల దారం రెండు పొరలు అయి, లేయర్స్‌లా కనిపిస్తాయి.  ఇప్పుడు, ముడివేసిన చోట గమ్‌తో ఇష్టమైన స్టికర్స్‌ను అతికించాలి. 

మౌల్డ్‌ క్లేతో...

కావాల్సినవి :  మౌల్డింగ్‌ క్లే, ఊలు దారం,

(ఎరుపు, ఆకుపచ్చ, క్రీమ్‌ రంగుల్లో), గోల్డ్‌ బీడ్స్‌, కుందన్స్‌, ఫెవికాల్‌ గ్లూ, కత్తెర, గుండు పిన్ను, కట్టర్‌, స్కెచ్‌.

ఇలా చేయాలి : మొదట క్లే చాలా మిక్స్‌ చేయాలి. దాంట్లో నుంచి కొంచెం క్లే తీసుకొని గుండ్రంగా  వత్తుకోవాలి.  దానిపైన ఫ్లవర్‌ లాగా స్కెచ్‌ వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్‌ చేయాలి. ఇంకాస్త క్లే తీసుకొని పొడవుగా రోల్‌ చేసి ఇష్టమైన ఆకారంలా పేనుకోవాలి.  దానికి ఇష్టమైన రంగు వేసుకోవచ్చు. దీన్ని ఫ్లవర్‌ మధ్యలో పెట్టేయాలి.  చుట్టూ కుందన్స్‌   పెట్టుకోవాలి.  రెండు  రంగుల ఊలు దారం అల్లుకోవాలి.   ఇప్పటి వరకూ చేసిన దానికి ఊలు దారం అంటించి,  పైనుండి కాస్త క్లే పెట్టేయాలి. ఊలు దారానికి రెండు పక్కల గోల్డ్‌ బీడ్స్‌ పెట్టుకోవాలి. అంతే,  రాఖీ తయారైనట్టు. ఈ క్లే మొత్తం ఆరడానికి 15 నిమిషాల సమయం పడుతుంది.

ఇయర్‌ బడ్స్‌తో...

కావాల్సినవి : ఇయర్‌ బడ్స్‌, గమ్‌, గోల్డెన్‌ త్రెడ్‌ (దారం), చిన్న చార్ట్‌ ముక్క.

ఇలా చేయాలి : ఇయర్‌బడ్స్‌కి ఇరువైపులా ఉండే దూదిపై మీకు నచ్చిన రంగను వేయండి. ఆరు ఇయర్‌ బడ్స్‌కు ఒకరంగు, మూడింటికి మరొకటి, రెండిటికి ఇంకో రంగు.. ఇలా వేర్వేరుగా వేయండి. ఆ చివర్లను కత్తిరించండి. ఇప్పుడు చార్టును తీసుకొని, చిన్న సైజు వృత్తాకారంలో  రెండు ముక్కలను కత్తిరించండి. ఒక ముక్క చార్టుపై, ఇయర్‌ బడ్స్‌ రంగు ముక్కలను వృత్తాకారంలో అతికించండి. మొదట ఎక్కువగా ఉన్న రంగు ముక్కలను, వాటిపై మరికొన్ని ..ఇలా మూడు వరుసలు అతికించవచ్చు. ఇది రాఖీ పైన అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మరో చార్టు ముక్కకు గమ్‌పూసి గోల్డెన్‌ త్రెడ్‌ను అతికించండి. ఈ రెండిటినీ కలిపి ఇయర్‌ బడ్స్‌ ఉన్న చార్టుకు అతికించండి.  

-నల్ల యామిని, 

కరీంనగర్‌logo