బుధవారం 05 ఆగస్టు 2020
Zindagi - Jul 31, 2020 , 23:56:41

‘వాట్సాప్‌' వైద్యం vs ఆయుర్వేదం!

‘వాట్సాప్‌' వైద్యం vs ఆయుర్వేదం!

వాట్సాప్‌లో వందల కొద్దీ మెసేజ్‌లు వస్తుంటాయి. వీటిని గుడ్డిగా అనుసరిస్తే అసలుకే ఎసరు. అమృతమైనా సరే, అతిగా తీసుకుంటే అనర్థమే. కాబట్టి, మన శరీర స్వభావాన్ని, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మాత్రమే ఆ సూత్రాలను పాటించడం మంచిది. ఏదైనా సరే, నిపుణుల సూచనల మేరకు వాడితేనే సత్ఫలితాలు. వేడినీళ్లు తాగాలని ఒకరు.. అల్లం, మిరియాల కషాయం తీసుకోమని మరొకరు.. సోడా తాగండని ఇంకొకరు.. అలా కాదు, రోజూ అలోవెరా జ్యూస్‌ తాగితే కావాల్సినంత వ్యాధినిరోధక శక్తి వస్తుందని మరొకరు... ఇలా వాట్సాప్‌ యూనివర్సిటీలో 

కరోనాకు రకరకాల చికిత్సలు సూచిస్తున్నారు. అయితే, సోషల్‌ మీడియాలో వచ్చేదంతా గుడ్డిగా పాటించకూడదని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. వాటిలో కొంతవరకూ నిజం ఉన్నా, కొన్ని పరిమితులూ ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అసలు వ్యాధి నిరోధక శక్తి గురించి ఆయుర్వేదం ఏం చెబుతున్నది? భారతీయ వైద్యశాస్త్రం ప్రకారం.. ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఏం చేయాలి? వాట్సాప్‌లో ప్రచారమయ్యే అంశాల్లో నిజానిజాలెంత? అన్నది విశ్లేషించుకోవాలి.

వేడినీళ్లే పరమౌషధం  అబద్ధం

రోజూ వేడినీళ్లు మాత్రమే తాగితే ఇమ్యూనిటీ పెరిగి, కొవిడ్‌ నుంచి తప్పించుకోవచ్చని వాట్సాప్‌లో ప్రచారం జరుగుతున్నది. అయితే వేడినీటితో వైరస్‌ చనిపోదు. ఇమ్యూనిటీ పెరగదు. కానీ, జీర్ణక్రియ చురుగ్గా జరుగుతుంది. చల్లని నీళ్లు జీర్ణక్రియను మందగిస్తాయి. గోరువెచ్చని నీటితో తిన్నది జీర్ణమై, పోషకాలు బాగా ఒంటపడతాయి. దాంతో పరోక్షంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. అయితే వేడినీళ్లంటే.. గొంతు కాలేంత వేడి కాదు. గోరువెచ్చగా తీసుకోవాలి. 

సోడాతో ఇమ్యూనిటీ  పచ్చి అబద్ధం

సోడా తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందన్నది నిజం కాదు. అయితే ఎక్కువ తినేసినప్పుడు, కడుపుబ్బరంగా ఉన్నప్పుడు, తిన్నది అరగడానికి సోడా తాగితే మంచిదనుకుంటారు. ఇందుకు ఆధారాలేమీ లేవు. అసలు, సోడాకూ జీర్ణప్రక్రియకూ సంబంధమే లేదు. అయితే మలబద్ధకం ఉన్నవాళ్లకు మాత్రం కొంత వరకు ఉపయోగం ఉంటుంది. ఇది పేగుల కదలికలను సరిచేస్తుంది. కాబట్టి విసర్జన సాఫీగా జరుగుతుంది.  

అలొవెరా అద్భుతాలు - సగమే నిజం

కలబంద రసం తాగితే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందన్న నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. ఇందులో నిజం లేకపోలేదు. అయితే అన్ని కలబంద చెట్లూ ఒకటి కాదు. దాదాపు 250 రకాల అలొవెరాలు ఉన్నాయి. ప్రతి కలబంద రసమూ ఇమ్యూనిటీని పెంచదు. సరైన జ్యూస్‌ రావాలన్నా, ఇమ్యూనిటీని పెంచే లక్షణాలు ఉండాలన్నా ఆ చెట్టుకు కనీసం అయిదేండ్ల వయసు ఉండాలి. అదీ, మామూలు కలబంద మొక్క నుంచి రసం తీసి తాగితే ఇమ్యూనిటీ పెరగదు. ఇమ్యూనిటీని వృద్ధిచేసే కలబందల్లో ఉత్తమమైంది.. బ్రెజీలియన్‌ అలోవెరా జ్యూస్‌. దీన్ని అలోఅర్బోసిన్స్‌ అంటారు. కాబట్టి, కలబంద విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 

చ్యవనప్రాశ అందరికోసం  కానేకాదు

చ్యవనప్రాశ నిత్యం తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుందని అంటారు. అయితే జీర్ణక్రియ బలంగా ఉన్నవాళ్లు వాడితే  శరీరానికి అది విషతుల్యం అవుతుంది. అందుకే జీర్ణ సమస్యలు ఉన్నవారు మాత్రమే వైద్యుల సూచనల మేరకు చ్యవనప్రాశ వాడాలి. 

సుగంధ ద్రవ్యాలు సర్వరోగ నివారిణులు  పాక్షిక నిజం

అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలు, వాము... ఇలా రకరకాల దినుసులు రోజూ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుందనీ, వైరస్‌ దరిచేరదనీ వాట్సప్‌ సమాచారం. నిజానికి, మన జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు వీటిని వాడితే మంచి ఫలితమే ఉంటుంది. ఆమ్లం ఉత్పత్తి అయి, ఆహారం బాగా జీర్ణమవుతుంది. జీర్ణప్రక్రియ మెరుగుపడగానే.. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. కానీ, చక్కని జీర్ణశక్తి ఉన్నవారు ఎక్కువగా తీసుకుంటే ..ఆమ్ల ఉత్పత్తి ఎక్కువై అల్సర్లకు దారితీయవచ్చు. ఇక, నిమ్మరసంలో విటమిన్‌-సి ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. విటమిన్‌-సి ఓజస్సు పెంచే కారకమే. అందువల్ల దీన్ని రోజూ తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టం లేదు. 

వాట్సాప్‌ సలహాలూ, ఫేస్‌బుక్‌ వ్యాసాలూ అరకొర సమాచారాన్ని ఇస్తాయి. యధాతథంగా ఆచరిస్తే.. కొన్నిసార్లు చెడూ జరగవచ్చు. కాబట్టి జీవనశైలిలో, ఆహార విధానంలో ఎలాంటి మార్పులు చేయాలనుకున్నా నిపుణుల సలహా తప్పనిసరి. కొవిడ్‌-19.. వైరస్‌ మనకు కొత్తదే అయినా, మన వ్యాధినిరోధక వ్యవస్థకి మాత్రం తన శరీరానికి సంబంధించనిది ఏదైనా కొత్తదే.. హానికరమైందే. అందుకే, తనది కాని కణం శరీరంలోకి ప్రవేశించకుండా తీవ్రంగా అడ్డుకుంటుంది. ఒకవేళ ప్రవేశించినా దాన్ని బయటికి పంపడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. వయసు ఎక్కువగా ఉండటం, జన్యుపరమైన కారకాలు,  తీసుకునే ఆహారం, మానసిక ఒత్తిడి, జీవనశైలి, నిద్ర, దీర్ఘకాలిక రోగాల వంటివి.. వ్యాధిని రోధక శక్తిపై ప్రభావం చూపిస్తాయి. 

చరకుడు ఏం చెప్పాడు?

వ్యాధి నిరోధక శక్తిని ఆయుర్వేదంలో ఓజస్సు అంటారు. వ్యాధులతో పోరాడే ప్రక్రియలన్నింటినీ ఓజస్సే నియంత్రిస్తుంది. అందువల్ల ఓజస్సు తక్కువైతే, శరీరం తొందరగా వ్యాధుల బారిన పడుతుంది. ప్రాణశక్తి కుంటుపడుతుంది. ఆహారం ఎంత బాగా జీర్ణమైతే పోషకాలు అంత బాగా అందుతాయి. దాంతో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి చరకుడు పలు పద్ధతులను సూచించాడు. చరకుడి ప్రకారం ఇమ్యూనిటీ పెరగాలంటే...

అహింసా మార్గం 

ఇప్పుడు ఆధునిక వైద్యవిజ్ఞానం చెబుతున్నదే వేల సంవత్సరాల క్రితం ఆయుర్వేదంలో చెప్పారు. ఆధునిక వైద్యం ప్రకారం, ఒత్తిడి పెరిగితే కార్టిసాల్‌ హార్మోన్‌ పెరిగి ఇమ్యూనిటీ తగ్గుతుంది. మనలో ఉండే వ్యతిరేక భావోద్వేగాలన్నీ చివరికి హింసకు దారితీస్తాయి. కోపం, అసూయ, ద్వేషం లాంటి నెగటివ్‌ ఎమోషన్స్‌ మనలో ఒత్తిడిని పెంచుతాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన వ్యాధినిరోధక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. అందుకే వీటిని నియంత్రించుకోవాలి. 

శుక్రాన్ని నిల్వ చేసుకోవడం 

ప్రత్యుత్పత్తి ద్రవాలను శుక్ర అంటారు. ఈ లైంగిక ద్రవాలు బలంగా ఉన్నవాళ్లలో వైటాలిటీ (తేజస్సు, ప్రాణశక్తి) ఎక్కువ ఉంటుంది. అంటే ఇమ్యూనిటీ బలంగా ఉంటుంది. అందువల్ల ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్లు లైంగిక ప్రక్రియను తగ్గించుకోవాలి. దానివల్ల శుక్ర ద్రవం వినియోగం కాదు. దీంతో రోగనిరోధకశక్తి బావుంటుందని చెప్తుంది ఆయుర్వేదం. ప్రాచీన రుషులు తమ వైటాలిటీ (ప్రాణశక్తి)ని లైంగిక కలయిక కోసం కాకుండా జపం, ధ్యానం లాంటి వాటికి వాడేవాళ్లు. అందుకే అంత ఆరోగ్యంగా ఉండేవాళ్లు. 

జ్ఞానం 

మెదడులో తెలివి ఉంటే మంచి, చెడుల విచక్షణ తెలుస్తుంది. దీంతో సరైన నిర్ణయాలు తీసుకుంటాం. కాబట్టి ఆందోళన ఉండదు. భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవడానికి జ్ఞానం ఉపయోగపడుతుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. 

ఆహారం 

జీర్ణప్రక్రియకు తోడ్పడే ఆహారాన్ని తీసుకుంటే, వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఇందుకోసం ప్రాణమున్న ఆహారాన్ని  తీసుకోవాలంటాడు చరకుడు. అతిగా వేడి చేసిన పదార్థాలు, వేపుళ్లు వద్దని అంటాడు. పాక్షికంగా ఉడికించినవి మాత్రమే తినాలి. అధిక వేడి వల్ల ఆహారానికి ఉన్న ప్రాణం పోతుంది. దంపుడు బియ్యం లాంటివి తినాలి. చక్కెరలు తగ్గించాలి. ప్రొటీన్‌ కోసం ఏ మాంసం పడితే ఆ మాంసం తినకూడదు. చేపల వంటి సులువుగా జీర్ణమయ్యేవి తినాలి. 

జీవనశైలి 

క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం ప్రాణశక్తిని పెంచుతుంది. వాకింగ్‌ కూడా ఇందుకు దోహదపడుతుంది. రోజూ కనీసం ఒకట్రెండు కిలోమీటర్లయినా నడవాలి. యోగా, ప్రాణాయామం వల్ల వైటాలిటీ పెరుగుతుంది. లింఫాటిక్‌ వ్యవస్థ పనితీరు మెరుగుపరిచే యోగాసనాలు చేయాలి. 

ధ్యానం

సోహం లాంటి చిన్నపాటి మెడిటేషన్‌ ప్రక్రియ కూడా శ్వాసను నెమ్మది చేస్తుంది. దాంతో మనసులోని ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ప్రాణవాయువును నియంత్రిస్తే శరీరంలో ఆందోళన తగ్గి, మనసు ప్రశాంతం అవుతుంది. ఇలా ఒత్తిడి తగ్గడం వల్ల ఓజస్సు పెరుగుతుంది. 

రసాయనాలు 

అమలకి, అశ్వగంధ, బల, విభీతకి, బ్రాహ్మి, గుడూచి, హరీతకి, జీవంతి, లికోరస్‌, పిప్పలి, శంఖపుష్పి, శతావరి, విధారి లాంటి రసాయనాలు వ్యాధినిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఇమ్యూనిటీని పెంచుతాయి. అయితే వీటిని సొంతంగా తీసుకోకూడదు. వైద్యుని సంప్రదించి, మన శరీర తత్వాన్ని బట్టి, తదనుగుణమైన మోతాదులో తీసుకోవాలి.

మర్మ థెరపీ 

మన శరీరంలో కొన్ని మర్మ పాయిం ట్స్‌ ఉంటాయి. అధిపతి, శింగాటక, తాలహృదయ, బృహతి, మన్య, శుప్ర, భావి, లోహితాక్ష, అంశపాలక అనేవి ముఖ్యమైనవి. వీటిపైన నువ్వుల నూనెతో నెమ్మదిగా గుండ్రంగా మసాజ్‌ చేసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ముద్రలు కూడా ఇందుకు దోహదం చేస్తాయి. 

మానసిక ప్రశాంతత 

కంటినిండా నిద్ర పడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిద్ర పోయేముందు హిందోళం, నీలాంబరి రాగాలు వినడం మంచిది. హంసధ్వని రాగం ఒత్తిడి తగ్గించి, మానసిక ప్రశాంతతనిస్తుంది. 
logo