శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 31, 2020 , 23:56:35

జీవన ‘చదరంగం’లో..

జీవన ‘చదరంగం’లో..

  • చదరంగంలో ఇండియా అగ్రగామి. మన దేశం నుంచి 66 మంది గ్రాండ్‌ మాస్టర్లు  ఉన్నారు. అదే, మహిళల కోణం నుంచి చూస్తే.. ఎవరున్నారు? కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక. ఇద్దరేనా? హంపి కూడా ఇదే చెప్తున్నారు. 

మహిళా గ్రాండ్‌ మాస్టర్ల కొరతకు లింగభేదమే కారణం అంటున్నారు కోనేరు హంపి. లింగభేదం అనేది చదరంగంలో మహిళలకు పెద్ద ప్రతిబంధకంగా మారుతున్నదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. పురుషులను వేరుగా.. మహిళలను వేరుగా ఆడించడం వల్లే ఈ వ్యత్యాసం ఏర్పడిందనీ.. అదే క్రమంగా ఆటలో మహిళల వెనుకబాటుకు కారణం అయ్యిందనీ ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి నుంచీ ఇద్దరూ కలిసి ఆడితే ఈ అంతరం ఏర్పడేది కాదని అభిప్రాయపడ్డారు. మహిళల ఆటలో ఎమోషన్‌ అనేది కీలక పాత్ర పోషిస్తుందనీ.. భావోద్వేగం అనేది కొన్నిసార్లు వారిని బలహీన పరుస్తుందనీ వ్యాఖ్యానించారు. ‘మా వాళ్లు నాకు 2010లోనే పెండ్లి చేయాలనుకున్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. మొత్తానికి, 2014లో నా పెండ్లి జరిగింది. 2019లో తల్లినయ్యాను. తర్వాత కొంత విరామం తీసుకున్నాను. కానీ నా పునరాగమనం అంత సులభంగా ఏం జరగలేదు. అందరిలాగే నేనూ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. బిడ్డను చూసుకోవాలి కదా? వెనక్కి తిరిగి చూసుకుంటే నా ఆట గుర్తొచ్చింది. ఒక గ్రాండ్‌ మాస్టర్‌ అయిన నేను ఇలా అర్ధంతరంగా ఆటను ముగిస్తే దానికి అర్థమేముంటుంది? అనిపించింది. ఎలాగైనా తిరిగి చదరంగంలో రాణించాలని సంకల్పించాను. మళ్లీ ఆడుతున్నాను. కానీ పునరాగమనం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. మహిళను కాబట్టి ఇలా జరిగింది. అదే పురుషుడు అయితే ఇలా ఉంటుందా?’ అని తన జీవితానుభవాల్ని పంచుకున్నారు హంపి. logo