శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 30, 2020 , 23:34:58

ఆ ఇల్లే.. వైద్యాలయం!

ఆ ఇల్లే.. వైద్యాలయం!

కరోనా కాలమిది. అప్రమత్తంగా ఉండాలి. వైరస్‌ సోకకుండా ఏం చేయాలి? సోకితే ఎలా ఎదుర్కోవాలి? అన్నది తెలుసుకోవాలి. మన చుట్టూ ఉన్న మొక్కల్లోనే అనేక ఔషధ విలువలు ఉన్నాయి. ఆ విషయాన్ని గుర్తించగలిగితే చాలు. ఏ రోగాన్ని అయినా కట్టడి చేయవచ్చు. కాబట్టే, తన ఇంటినే ఔషధ మొక్కల నిలయంగా మార్చి.. ఎంతోమంది రోగులకు అండగా నిలుస్తున్నారు సుధారాణి కొనకళ్ల. ప్రకృతికి అయినా, మనిషికి అయినా పచ్చదనమే చికిత్స అంటారామె. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లి. ఒక ఇంటి ఆవరణ నిండా ఔషధ మొక్కలే. అది ఇల్లా, ఉద్యానవనమా అన్నట్టే ఉంటుంది. ఆ ఇంటి యజమానే సుధా కొనకళ్ల. అమెరికా సంయుక్త రాష్ర్టాల్లో పెరిగే (భారతీయ నామం.. లక్ష్మణ ఫలం) మొక్క కూడా ఆ పెరట్లో ఉంది. ఇవే కాదు..  సీబా.. చిట్టామొట్టి.. కాంక్వాత్‌.. స్టార్‌ ఫ్రూట్‌.. బిల్లింబి తదితర అరుదైన మొక్కలనూ ఆమె పెంచుతున్నారు. క్యాన్సర్‌.. షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టే గుణం ఈ మొక్కలకు ఉన్నదని చెబుతారు. 

పెంచుతూ.. పంచుతూ 

ఔషధ మొక్కల పెంపకానికి అనుగుణంగా ఇంటి వాతావరణాన్ని మార్చుకున్నారు ఆమె. ప్రత్యేకంగా ఓ షెడ్‌ వేశారు. మొక్కలకు సేంద్రియ ఎరువులు మాత్రమే వాడతారు. అవన్నీ పెంచేది తన కోసం కాదు, ప్రజల కోసం. దీర్ఘకాలిక వ్యాధుల బారినపడినవారు వందల కిలోమీటర్ల దూరం నుంచీ వచ్చి మరీ ఆ మొక్కలను తీసుకెళ్తారు. ఎవరు అడిగినా కాదనకుండా, తనకు తెలిసిన సంప్రదాయ వైద్య పరిజ్ఞానాన్ని పంచుతూ.. ఆరోగ్యదానం చేస్తున్నారు సుధ. వేసవికాలం రాగానే స్టార్‌ ఫ్రూట్‌.. లక్ష్మణ ఫలాల కోసం జనం క్యూ కడతారు. పద్మశ్రీ వనజీవి రామయ్య కూడా ఆ ఇంట్లోని ఉద్యానవనాన్ని  సందర్శించారు. కొన్ని మొక్కలను తీసుకెళ్లారు. 

ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం..  

సుధ.. వృత్తిరీత్యా నర్స్‌. ఆమెకు ఒక కొడుకు, కూతురు. కొడుకు సుదీప్‌ బుద్ధిమాంద్యంతో పుట్టాడు. ఎక్కడ చూపించినా ఫలితం లేకపోయింది. ఒకరోజు హైదరాబాద్‌ తీసుకొస్తుండగా.. ‘మీ బాబును ప్రకృతి ఒడిలో పెంచండి. తనకంటూ ఓ ప్రత్యేక వాతావరణాన్ని సృష్టించండి’ అంటూ ఒక ప్రకృతి వైద్యుడు సలహా ఇచ్చారు. ఆ సమయంలోనే కేరళ ప్రకృతి వైద్యం గురించి తెలిసింది. నేరుగా కేరళ వెళ్లారు. దీర్ఘకాలిక వ్యాధులకు సైతం ఆయుర్వేదంలో పరిష్కారం ఉండటం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. వారం రోజులు అక్కడే ఉండి.. ఆ విధానాన్ని లోతుగా పరిశీలించారు. వివిధ ఔషధ మొక్కల గురించి తెలుసుకున్నారు. ఇంటికి రాగానే ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రభుత్వ కొలువే అయినా.. తన కొడుకు ఆరోగ్యం దృష్ట్యా వదులుకోవాల్సి వచ్చింది. మొక్కలను పెంచేందుకు అనువుగా ఇంటిని మార్చుకున్నారు. సుదీప్‌ను కూడా తోటపనిలో భాగస్వామిని చేశారు. రోజూ మొక్కలకు నీరుపోయడం.. వాటి ఎదుగుదలను ఆస్వాదించడం.. ఆ పచ్చదనం మధ్య కుమారుడికి ఓనమాలు నేర్పించడం.. ఇదే ఆమె దినచర్య. ఆ అమ్మ కృషి ఫలించింది

ఐదేండ్లు గడిచాయి. అంతకాలం మొక్కల పెంపకం.. కొడుకు ఆరోగ్యం తప్ప వేరే ప్రపంచమే లేదు. బుద్ధిమాంద్యంతో పుట్టిన సుదీప్‌ను చూసి పెద్దపెద్ద డాక్టర్లు సైతం ‘ఏం చేయలేం’ అని తేల్చిచెప్పినా.. ‘గ్రీన్‌ థెరపీ’ ద్వారా బిడ్డను ప్రయోజకుడిగా తీర్చిదిద్దుకున్నారు ఆమె. ఇప్పుడు ఆ కొడుకు చెట్టంత ఎదిగాడు. కీ-బోర్డ్‌ ప్లేయర్‌గా రాణిస్తున్నాడు. కరాటేలో బ్లాక్‌బెల్ట్‌ సాధించాడు. ఎలక్ట్రానిక్‌ పరికరాల మరమ్మతులోనూ తర్ఫీదు పొందాడు. కొడుకుతో పాటు చెట్లూ ఇంతెత్తున పెరిగాయి. ఆమె అక్కడితోనే ఆగిపోలేదు. బిడ్డ కోసం పడిన ఆరాటం కండ్ల ముందు తిరిగేది. ‘కష్టం అని తెలిసినా కూడా కేరళ,  తదితర ప్రాంతాలకు వెళ్లి ప్రకృతి వైద్యం గురించి అధ్యయనం చేశాను. నేను నేర్చుకున్న వైద్యం పదిమందికీ ఉపయోగపడాలి’ అనుకున్నారు. వేలకొద్దీ ఔషధ మొక్కలను పెంచారు. క్లిష్టమైన వ్యాధులకు కూడా పరిష్కార మార్గం చూపుతున్నారు. 

 ఎలా నేర్చుకున్నారు? 

కేరళ పర్యటనకు ముందే, సుధకు ఆయుర్వేదంలో పరిచయం ఉంది. ఆమె తాతయ్య వీరన్న హస్తవాసి ఉన్న ఆయుర్వేద వైద్యుడు. ఆయన అనుసరిస్తున్న విధానాలను చిన్నప్పుడు సుధ పరిశీలించేవారు. కషాయాలు, చూర్ణాల తయారీని ఆసక్తిగా గమనించేవారు. ఆ శ్రద్ధను గుర్తించిన వీరన్న తన మనవరాలికి ఆయుర్వేద రహస్యాలు బోధించారు. ఇలా నేర్చుకున్న విద్యద్వారా ఆమె వివిధ వ్యాధులకు మందులను తయారు చేశారు. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, సింగపూర్‌, గల్ఫ్‌ల నుంచి కూడా ఇక్కడికి దీర్ఘకాలిక రోగులు వస్తుంటారు. కాదనకుండా, అందరికీ వైద్యం చేస్తున్నారు సుధ. ఆమె సామాజిక సేవలోనూ ముందుంటారు. హెచ్‌ఐవీ బాధిత పిల్లలకు ఏటా దుస్తులు పంపిణీ చేస్తున్నారు. రోడ్ల వెంట తిరిగే మానసిక రోగులను చేరదీసి కడుపునిండా అన్నం పెడుతున్నారు. ఫీజులు కట్టలేనివారిని పెద్ద చదువులు చదివిస్తున్నారు. అనాథాశ్రమాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ.. మందులు కూడా ఇస్తున్నారు. తలసేమియా పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తూ వారికోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ కృషి గొప్పది

హరితహారం ద్వారా తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు గొప్ప కృషి చేస్తున్నది. కానీ, ఔషధ గుణాలున్న మొక్కలు కూడా పెట్టాలి. ఇవి అనారోగ్యాన్ని దూరం చేస్తాయి. నావంతుగా ‘గ్రీన్‌ చాలెంజ్‌'లో పాల్గొంటున్నా. ఔషధ మొక్కల గురించి వేదాల్లో, పురాణాల్లో ప్రస్తావన ఉంది. నేను మిగతా వైద్యవిధానాలకు వ్యతిరేకం కాదు. కానీ ఆయుర్వేదాన్నీ, మొక్కలనూ మరువకూడదు.                                    

-సుధ కొనకళ్ల 


logo