శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 30, 2020 , 23:34:59

‘ఇమ్యూనిటీ’ తయార్‌!

‘ఇమ్యూనిటీ’ తయార్‌!

కషాయం తాగుదాం! కరోనాను అరికడదాం! .. అంటూ జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో ఉచిత కషాయ వితరణ, వేడినీళ్ళ పంపిణీ కేంద్రాలను  సొంత ఖర్చుతో ఏర్పాటు చేశారు రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు.  ముస్తాబాద్‌ చౌరస్తా, పాత బస్టాండ్‌ల వద్ద ఇప్పటికే ఇవి సేవలు అందిస్తున్నాయి. త్వరలోనే, మరిన్ని కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. కొవిడ్‌ -హోమ్‌ ఐసొలేషన్‌ కిట్స్‌ను కూడా ప్రత్యేకంగా తయారు చేయించి,  నియోజకవర్గ పరిధిలో పంపిణీ చేస్తున్నారు మంత్రి.          

ఆ కౌంటర్లలో కషాయం తాగుతున్న ప్రజల్ని చూస్తుంటే.. కరోనాను ఎన్‌కౌంటర్‌ చేయడానికి బయల్దేరుతున్న భద్రతా బలగాల్లా అనిపిస్తారు. మన దగ్గర  రోగ నిరోధకశక్తి ఉన్నంతకాలం, ఆ దుష్టశక్తి ఏమీ చేయలేదు. కాబట్టే, రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు తన సొంత ఖర్చులతో సిద్దిపేటలో ఉచిత కషాయ వితరణ, వేడినీళ్ళ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయించారు. శొంఠి, మిరియాలు, దాల్చిన చెక్క, ఇతర మూలికలతో కూడిన ప్రత్యేక పౌడరును వితరణ కేంద్రానికి పంపిస్తారు. స్థానికంగా ఉన్న నిర్వాహకులు ఆ పౌడర్‌ను కాచి వడబోసి, హాట్‌ బాక్స్‌లో నింపుతారు. ఆ వేడివేడి కషాయాన్ని కేంద్రం దగ్గరకు వచ్చిన ప్రజలకు టీ గ్లాసు నిండా ఇస్తున్నారు. వేడి నీళ్ల కోసం ప్రత్యేకంగా హీటరు ఏర్పాటు చేశారు. కషాయం తాగిన తర్వాత, ఎవరి గ్లాసులను వారు శుభ్రం చేసుకుంటారు. నిర్వాహకులు వాటిని మళ్లీ వేడి నీళ్ళలో శుభ్రపరుస్తారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఈ కేంద్రాలు పని చేస్తాయి. 

హోమ్‌ ఐసొలేషన్‌ కిట్స్‌

మంత్రి ప్రత్యేక శ్రద్ధతో తయారు చేయించిన.. కొవిడ్‌ -హోమ్‌ ఐసొలేషన్‌ కిట్‌లో శానిటైజర్‌, మందులు, ఇయర్‌బడ్స్‌, హెర్బల్‌ టీ పొడి, థర్మామీటర్‌, మాస్కులు, గ్లౌసులు.. ఇలా పన్నెండు రకాల వస్తువులు ఉంటాయి. ఇప్పటికే సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో 30 మందికి ఈ కిట్స్‌ అందించారు. ‘కరోనాను తరిమికొట్టే ప్రయత్నంలో ప్రజలకు రోజూ కషాయం అందించాలనే ఉద్దేశంతో మంత్రి హరీశ్‌రావు ఏర్పాటు చేసిన ఈ కేంద్రానికి మంచి స్పందన వస్తున్నది. రోజూ సుమారు 700 మందికి కషాయాన్ని అందిస్తున్నాం’ అంటున్నారు కేంద్రం నిర్వాహకులు జ్యోతి శ్రీనివాస్‌రెడ్డి. ‘పని చేసుకొని బతికే మాలాంటివాళ్లు కరోనా నుంచి కాపాడుకునేందుకు ఎంతో మేలు చేస్తుంది’ అని సంబరంగా చెబుతాడు కేంద్రం ప్రారంభించినప్పటి నుంచీ ఇక్కడ కషాయం తాగుతున్న  రాములు. తాజాగా, గజ్వేల్‌ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కూడా ఓ  కషాయ వితరణ కేంద్రాన్ని ప్రారంభించారు. -కత్తుల శ్రీనివాస్‌రెడ్డి


logo