శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 30, 2020 , 23:34:59

ఆరోగ్యమే ఐశ్వర్యం!

ఆరోగ్యమే ఐశ్వర్యం!

‘భక్తి, శ్రద్ధ’ అనే రెండు సుగుణాలనే పెట్టుబడిగా పెట్టి, చేసే ఏ పూజయినా, వ్రతమైనా అద్భుత ఫలాన్నిస్తుంది. ఇంటింటా అష్టయిశ్వర్యాల పంటలను కురిపించే శ్రీమహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత సులభతరమైన మార్గం ‘వరలక్ష్మీ వ్రతం’. ప్రతీ సంవత్సరం శ్రావణమాసంలో రెండో శుక్రవారం (శుక్లపౌర్ణమికి ముందు వచ్చేది) నాడు వచ్చే ఈ పండుగ కోసం అనేకమంది మహిళలు కండ్లలో వత్తులు వేసుకొని ఎదురు చూస్తుంటారు. ఈ రోజు ప్రతీ ఇల్లు మంగళకరమే.

శ్రీ శార్వరి నామ సంవత్సరం ప్రవేశించడానికి ముందునుంచే అంటే, వికారి చివరి నెలల్లోనే వెళుతూ, వెళుతూ ‘కరోనా’ పేర్న పిలిచే ఒకానొక వికార ఉపద్రవాన్ని ప్రపంచంపైకి వదిలింది. ఇవాళ యావత్‌ ప్రపంచ మానవులంతా గిజగిజలాడుతున్న పరిస్థితి. దేవాలయాలు సైతం భక్తులను దూరం వుంచుతున్న దుస్థితి. గత ఆరు నెలలుగా పండుగలు, నోములు, వ్రతాలు అన్నీ ఇండ్లకే పరిమితమవుతున్నాయి. ‘వేడుక, వైభవం, అట్టహాసం’ వంటి పదాలను పూర్తిగా అటకెక్కించేశాం. ఈ నేపథ్యంలోనే ఎప్పటిలా ‘వరలక్ష్మీ వ్రతం’ వచ్చింది. ప్రతీ సంవత్సరం అత్యంత రమణీయంగా, వందలాది ముత్తయిదువల మధ్య ఎంతో కోలాహలంగా జరుపుకొనే వారంతా ఈసారి ఎవరి ఇండ్లకు వారే పరిమితమవుతున్నారు. 

‘వరలక్ష్మీ వ్రతం’ అంటేనే చాలామందికి ఆధ్యాత్మిక వేత్త సి.విజయ లక్ష్మీరాజం గుర్తుకు వస్తారు. హైదరాబాద్‌, పెద్దమ్మ గుడి సమీపంలోని ఆమె స్వగృహం (జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 49)లో ఒక విలక్షణ వేడుకలా జరిగే ఈ వ్రత వైభవాన్ని కండ్లారా చూడాలని తపించే వారెందరో. పూజా విధానం, నైవేద్యాలు అన్నీ మామూలే. కానీ, అమ్మవారిని  ఏటా ఒక్కో తీరున ఆమె అలంకరించే విధానమే అపురూపం, అసాధారణం. ఆ అలంకరణ అంతా ఒక ఎత్తయితే, ఆమె ఉపాసనా తీరు ఒక్కటీ మరో ఎత్తు. ప్రతీ ఏటా శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలోంచి ఒక్కో శ్లోకానికి అనువైన రీతిలో అమ్మవారిను ప్రతిష్టిస్తారు. దీనికి సిద్ధం చేసే పూలమండపానికి ఎన్ని పూలో.. ఎంత పరిమళమో!

కళాత్మికా కళానాథా కావ్యాలాప వినోదినీ

సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా॥

శ్రీ లలితా సహస్ర నామస్తోత్రంలోని ఈ శ్లోకానికే ఈసారి విజయ లక్ష్మీరాజం వ్యాఖ్యానం రచించారు. దానినంతా పుస్తకరూపంలోకి తెచ్చారు. అందులో, ‘అమ్మవారు సంపదలనే కాదు, ఆరోగ్యమనే అద్భుత ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవత’అని అభివర్ణించారు. కరోనా కారణంగా భక్తులు ఈసారి స్వయంగా రాలేరు కనుక, కార్యక్రమాన్నంతా రికార్డు చేసి అందరికీ పంపిస్తామని ఆమె చెప్పారు.

అందరినీ నడిపించే శక్తి ఆమెనే!

ఈ ఏడాది కరోనా మహమ్మారి లోకాన్ని పట్టి పీడిస్తున్నది. అందరం ఆరోగ్యంగా వుండటం ముఖ్యం. కనుక, ఎవరికి వాళ్లం ఇండ్లలోనే వుండి వున్నంతలో ‘వరలక్ష్మీ వ్రతం’ ఆచరించుకుందాం. ఎంత వైభవంగా చేశామన్నది కాదు, ఎంత భక్తితో పూజించామన్నది ప్రధానం. అమ్మవారు త్రయంబికా స్వరూపిణి. కర్త కర్మ క్రియ అన్నీ ఆమెనే. మనందరినీ నడిపిస్తున్న శక్తి ఆమెనే. ఎంతటి ఆపదల నుంచైనా గట్టెక్కించేదీ తానే. వేడుకొన్న వారందరినీ తప్పక అనుగ్రహిస్తుంది. ఎవరూ తమ ఇల్లు వదిలి బయటకు రావద్దు. మా ఇంట్లో జరిగే ‘వరలక్ష్మీ వ్రతం’ వీడియోలు పంపుతాం. ఈ ఏడాది ఇలాగే కరోనా మహమ్మారిని ఎదుర్కొనే శక్తిని ఇమ్మని ప్రార్థిద్దాం. వచ్చే సంవత్సరం ఇంతకన్నా ఎన్నో రెట్లు ఘనంగా అందరం కలిసి జరుపుకొందాం.

- శ్రీమతి సి.విజయ లక్ష్మీరాజం

-నిహిరlogo