ఆదివారం 09 ఆగస్టు 2020
Zindagi - Jul 27, 2020 , 23:45:15

నీ జీవితం..నాలా కాకూడదు!

నీ జీవితం..నాలా కాకూడదు!

  • (సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ లేఖకు స్వేచ్ఛానువాదం)

పెండ్లి చేసుకుని అత్తింటికి బయల్దేరుతున్న కూతురికి ఓ తల్లి రాసిన ఉత్తరం ఇది.ఇందులో కుశలప్రశ్నలు లేవు. శతమానం భవతి, దీర్ఘసుమంగళీ భవ, పిల్లాపాపలతో..వగైరా ఆశీర్వచనాలు లేవు. అయితేనేం, ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకో - అన్న సలహాఉంది. ఎవర్నో సంతోషపెట్టాలని నువ్వు బాధపడొద్దు - అన్న హెచ్చరిక ఉంది. నీ జీవితం నాలా కాకూడదు  అన్న పశ్చాత్తాపం ఉంది. 

కేర్‌..కేర్‌..కేర్‌

ప్రసూతి గది మొత్తం ప్రతిధ్వనించేలా నీ ఏడుపు!

నిశ్శబ్దంగా..

లోలోపలే నా ఏడుపు! 

రెండూ ఒకేసారి జరిగిపోయాయి.

అవును, తల్లీ! నువ్వు పుట్టగానే నేను ఎంత ఏడ్చానో! 

కారణం..

నువ్వంటే ప్రేమ లేక కాదు. ఆడపిల్ల పుట్టిందన్న బాధ కాదు. నిన్ను పెంచలేనేమో అన్న అధైర్యమూ కాదు. ఈ పురుషాధిక్య ప్రపంచంలో.. ఆడపిల్లను అవసరంగా, పనిముట్టుగా, బొమ్మగా భావించే చోట నువ్వెలా నెగ్గుకొస్తావో అన్న భయంతో. నీ జీవితం కూడా నా బతుకులా తయారవుతుందేమో అన్న బెంగతో. 

నేను నీకు అమ్మగానే తెలుసు. 

ఓ అమ్మకు కూతురిగా నన్ను నేను నీకెప్పుడూ పరిచయం చేసుకోలేదు.

నువ్వంటే నాకు ఎంత ఇష్టమో, మా అమ్మకూ నేనంటే అంతే ప్రాణం. కానీ, తను నాన్న అనే చండశాసనుడికి కట్టుబానిస. సంప్రదాయాల సంకెళ్లు వేసుకున్న బందీ. అయినా, నాకు ఎంతోకొంత మంచి చేయాలనే చూసేది. నాన్న కాళ్లు పట్టుకుని బతిమాలి మరీ నన్ను డిగ్రీ వరకూ చదివించింది. ఇరవై ఏండ్ల వయసులో ప్రపంచాన్నే గెలువగలననే ఆత్మవిశ్వాసం ఉండేది నాలో. భవిష్యత్తు గురించి పెద్దపెద్ద కలలు కనేదాన్ని. ఆడపిల్లకు ఆర్థిక స్వేచ్ఛ అవసరమని బలంగా వాదించేదాన్ని. కాబట్టే, అమ్మ వద్దన్నా, నాన్న కండ్లెర్రజేసినా.. పట్టించుకోకుండా ఉద్యోగంలో చేరాను. తొలిజీతం తీసుకున్న రోజు ఎంత గర్వంగా అనిపించిందో! అంతలోనే, ఏరికోరి ఓ సంబంధాన్ని తెచ్చారు నాన్న.  

‘నువ్వు ఆ ఇంటికి కోడలివి కాదు, కూతురివి బిడ్డా’ అని ధైర్యం చెప్పి అత్తింటికి పంపింది అమ్మ.

నేను కూతుర్ని కాదు, కోడల్నీ కాదు. అక్కడో పనిమనిషిని, వంట మనిషిని. అంతే! ఆ విషయం తెలియడానికి చాలా సమయం పట్టలేదు. అలా అని అదేం మధ్యతరగతి కుటుంబమో, దిగువ మధ్యతరగతి సంసారమో కాదు. చాలా సంపన్నులు. 

తప్పు మీద తప్పు

పెండ్లి కాగానే, ఉద్యోగానికి రాజీనామా చేయడం నా మొదటి తప్పు. మొదటి నుంచీ నావి స్వతంత్ర భావాలు. ఉద్యోగాన్ని నిలుపుకొని ఉంటే.. చివరికి శానిటరీ నాప్‌కిన్‌ కొనాలన్నా ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఓ ఇంటి కూతురిగా పట్టుబట్టి ఉద్యోగంలో చేరిన నేను.. పెండ్లి తర్వాత.. ఓ ఇంటి కోడలిగా అంతే పట్టుదలగా ఉండలేకపోయాను. కొత్త ఇల్లు, కొత్త వాతావరణం, కొత్త మనుషులు. అందరినీ సంతోషపెట్టాలని అనుకోవడం, అందరిచేతా మంచిదాన్నని అనిపించుకోవాలని ఆరాటపడటం నా రెండో తప్పు. క్రమక్రమంగా ఇంట్లో నా స్థానం దిగజారిపోయింది. చీమకన్నా, దోమకన్నా హీనంగా చూడటం మొదలుపెట్టారు. వంటింట్లో సరుకులు ఎక్కువగా ఉంటే, నేను వృథా చేస్తున్నానని తిట్లు. ఇంట్లో సరుకులు నిండుకుంటే, నేను బాధ్యతగా లేనని తిట్లు. ఇలాంటి సమయంలో కూడా అమ్మానాన్నలు నాకు ధైర్యం చెప్పలేదు. నోరు మూసుకుని పడుండమనే సలహా ఇచ్చారు. ఈ చీకటి జీవితం నా వల్ల కాదని కన్నీళ్లు పెట్టుకున్న ప్రతిసారీ.. ‘నీ తర్వాత ఇద్దరు చెల్లెండ్లు ఉన్నారన్న విషయం మరచిపోవద్దు’ అనే హెచ్చరించేవారు. మీ నాన్న దగ్గరా ఒకటిరెండుసార్లు నా అసంతృప్తిని వెళ్లగక్కే ప్రయత్నం చేశాను. ‘ఇంట్లో ప్రశాంతతని చెడగొట్టడమే నీ ఉద్దేశమా?’ అంటూ నా మీదే విరుచుకుపడ్డారు. ఇల్లు అంటే.. ప్రాణంలేని గోడలూ, పైకప్పే కదా! వాటికోసం నేను నా ఉద్వేగాల్ని చంపుకోవాలన్నమాట! కొందరు అంతే. ప్రేమించడం చేతకాదు. ఓదార్చడం చేతకాదు. భరించమని చెప్పడం ఒక్కటే బాగా తెలుసు. ఆ పరిస్థితిలోనూ నాకు మీ నాన్న మీద కోపం రాలేదు. జాలి కలిగింది. సమస్య అతడిలో లేదు. అతడి పెంపకంలో ఉంది. పిల్లల్ని వ్యక్తిత్వం లేకుండా పెంచడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. ఆ కీలుబొమ్మతో అంతకాలం ఎలా కాపురం చేశానో ఇప్పటికీ అర్థం కాదు.  

ఒకప్పుడు ఆత్మవిశ్వాసానికి మారుపేరుగా ఉన్న నేను.. మానసికంగా, శారీరకంగా.. బలహీనురాలిగా మారాను. ఆ రోజు ఏం వండాలి, ఏ వంటలో ఎంత ఉప్పూ కారం వేయాలి.. అన్నది కూడా నిర్ణయించుకోలేనంత దుర్బలత్వం! ఆ పరిస్థితిని చూసి నామీద నాకే అసహ్యం వేసింది. అద్దం ముందు నిలబడి నన్ను నేను తిట్టుకున్నాను. నన్ను నేను ఓదార్చుకున్నాను. నా కన్నీళ్లు నేను తుడుచుకున్నాను. ఆ విషాదంలో ఆనందం, ఆ ఏడుపులో నవ్వు, ఆ నిరాశలో ఆశ.. నువ్వు, నువ్వే! 

అమ్మానాన్నల కోసం బలవంతంగా భరించిన బంధాన్ని, నా కూతురి విషయానికి వచ్చేసరికి... ఒక్క క్షణమైనా ఆమోదించలేక పోయాను. డిగ్రీ కూడా పూర్తి కాకముందే, పద్దెనిమిదేండ్లకే నీకు పెండ్లి చేస్తామని నీ తండ్రీ, తాతా పట్టుబడితే.. ఎదురు చెప్పాను. తిరుగుబాటు చేశాను. నిన్ను తీసుకుని బయటికి వచ్చేశాను. విడాకులకు కూడా సిద్ధపడ్డాను. చట్టప్రకారం రావాల్సిన భరణమూ వద్దని చెప్పాను. నా బిడ్డను నేను చదివించుకోలేనా అన్న ధైర్యం.

బంగళాలో పుట్టిపెరిగిన నీకు, సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ మొదట్లో ఇరుకుగానే అనిపించింది. కానీ, అక్కడ లేని స్వేచ్ఛ ఇక్కడ ఉంది. హాయిగా నవ్వుకోవచ్చు, మనసారా మాట్లాడుకోవచ్చు, చర్చించుకోవచ్చు, వాదించుకోవచ్చు.  ఇక్కడ నువ్వు నువ్వే, నేను నేనే! ఎవరి చాటు బిడ్డవూ కాదు, ఎవరి కుటుంబ ప్రతిష్ఠకో బ్రాండ్‌ అంబాసిడర్‌వీ కాదు. నీకు నచ్చిన చదువే చదివించాను. నచ్చినవాడితోనే పెండ్లి చేశాను. 

ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే... అత్తింటికి వెళ్లిన తర్వాత నువ్వు నాలా ఉండకూడదు. నేను చేసిన తప్పులు నువ్వు చేయకూడదు. భర్త, అత్త, మామ, అత్తగారి అత్త.. అందర్నీ సంతోషపెట్టాలని అనుకోవడం భ్రమే. ఆ ప్రయత్నంలో నీ సంతోషాన్ని కోల్పోవద్దు. నువ్వు నువ్వులా ఉండాలి. నీలా నువ్వు బతకాలి. ఎవరూ నీ జీవితాన్ని హైజాక్‌ చేయకూడదు. చివరికి భర్త అయినా సరే! వివాహం అనేది పితృస్వామ్య వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని తయారు చేసింది. ఓ కూతురు తల్లిదండ్రుల్ని వదిలేసి... మొగుడి చేయి పట్టుకుని వెళ్తేనేమో...‘వహ్వా..వహ్వా’ అంటూ మెచ్చుకుంటుందా? అదే, ఓ అబ్బాయి తల్లిదండ్రుల్ని వదిలేసి.. భార్య కొంగు పట్టుకుని వేరుకాపురం పెట్టుకుంటానంటే.. ‘పెండ్లాం మాట వినే దద్దమ్మ’ అనే ముద్ర వేస్తుందా? ఏం.. భర్త భార్య మాట వినకూడదా? ఇద్దరూ కలిసి ఓ చిన్న ప్రపంచాన్ని సృష్టించుకోవడం తప్పెలా అవుతుంది? ఇల్లు వదిలివచ్చినంత మాత్రాన.. బంధాన్ని పూర్తిగా తెంచేసుకున్నట్టు కాదు కదా? కన్నవాళ్లను గౌరవిస్తూనే.. భార్యను ప్రేమించడం అసాధ్యమా? నా జీవితానుభవాలు నీకు పాఠాలుగా ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే... అప్పగింతల సూట్‌కేస్‌లో నీ బట్టల మధ్య ఈ ఉత్తరాన్ని సర్దాను. 

జాగ్రత్త తల్లీ.. అనే చెప్పను.

అది పిరికితనం!

ధైర్యంగా నిలబడు.. అనే నిన్ను దీవిస్తాను. 

-మీ అమ్మ


logo