శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 27, 2020 , 23:44:59

అత్యాశ

అత్యాశ

వింధ్యారణ్య ప్రాంతంలో భైరవుడు అనే వేటగాడు ఉండేవాడు. రోజూ అడవికి వెళ్ళి, రకరకాల ఆహార పదార్థాలను సేకరించి, కుటుంబాన్ని పోషించేవాడు. భైరవుడు ఒకరోజు జింకను వేటాడాడు.  ‘ఇంటిల్లిపాదీ ఆనందంగా విందు చేసుకోవచ్చు’ అనుకుంటూ మురిసిపోయాడు. దానిని భుజంపై వేసుకొని  ఇంటి దారి పట్టాడు. అయితే ఆ అడవి మార్గంలో అతనికి బాగా మదించి, కోరలు ఉన్న అడవి పంది కనిపించింది. భైరవుడు తన భుజం మీది జింకను కిందికి దించి, తన విల్లమ్ములు తీసుకున్నాడు. పదునైన బాణంతో ఆ అడవి పందిని గాయపరిచాడు. అడవి పందులకు కోపం, మొండితనం ఎక్కువ. వేటగాడి బాణం వెనుదిరిగి వచ్చిందా అన్నట్లు, అది  వేగంగా వచ్చి, భైరవుని పొట్టను కోరలతో చీల్చి చంపింది. తర్వాత, అదీ చచ్చింది.  తొక్కిసలాటలో అటుగా వచ్చిన పాము కూడా, ప్రాణాలు విడిచింది.  ఇంతలో క్షుద్రబుద్ధి అనే నక్క ఆహారం వెదకుతూ వచ్చింది. చచ్చిపడిన వేటగాడు, జింక, పంది, పాము...  ఆ నక్కకు గొప్ప విందులా అనిపించాయి.  ఎగిరి గంతులు వేసింది. అప్పుడు నక్క ఇలా ఆలోచించింది.. ‘ఈ మనిషిని ఒక మాసం పాటు తినొచ్చు. జింకను, పందిని రెండు నెలల పాటు భోం చేయవచ్చు.  ఈ పాము తలను తీసేసి ఒక రోజంతా కడుపునింపుకోవచ్చు. అంటే మూడు నెలలా ఒక్క రోజు పాటు ఆహారం గురించి వెదికే పనే లేదన్నమాట. మరి ఈ పూట మాటేమిటి? ఆ! ఈ వేటగాడి ధనుస్సుకు కట్టిన అల్లెత్రాటిని తింటే సరిపోతుంది’ అనుకుంది. క్షుద్రబుద్ధి వింటిని సమీపించి అల్లెత్రాడును కొరికింది. అంతే! పదునైన వింటి కోపు దాని శరీరంలో గుచ్చుకుంది. తన దురాశకు చింతిస్తూ క్షుద్రబుద్ధి ప్రాణాలు విడిచింది. అందుకే అత్యాశ మంచిది కాదు. మానవుడు ఆశాజీవి. కానీ దురాశకు పోతే దుఃఖమే మిగులుతుంది.


logo