శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 26, 2020 , 23:19:46

ఫ్యాషన్‌ స్టార్‌..నీతా లుల్లా

ఫ్యాషన్‌ స్టార్‌..నీతా లుల్లా

అందాల సినీతార అయినా.. అమెరికా అధ్యక్షుడి కూతురైనా.. ఆమె ఫ్యాషన్‌కు ఫిదా కావాల్సిందే. అందుకే పెండ్లి పీటల మీద ఐశ్వర్య.. హైదరాబాద్‌లో పర్యటించిన ఇవాంక.. ఆమె పనితనంతో మరింతగా మెరిసిపోయారు. వీరిద్దరే కాదు.. బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ దాకా.. ముంబై  మొదలు మ్యూనిచ్‌  వరకూ ఎందరో సెలబ్రిటీలు  ఆమె డిజైన్ల కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు.  ఫ్యాషన్‌ ప్రపంచ ధ్రువతార నీతా లుల్లా.. మన హైదరాబాద్‌ ఆడబిడ్డ!

1981, సికింద్రాబాద్‌. సంగీత్‌ థియేటర్‌..‘సూపర్‌ మ్యాన్‌ సినిమాకి రెండు టికెట్లివ్వండి అంకుల్‌'.. స్నేహితురాలితో వచ్చి బుకింగ్‌ కౌంటర్‌లో అడిగింది నీతా.‘ఏ పాపా.. నువ్వు స్కూల్‌ ఎగ్గొట్టి సినిమాకి వచ్చావు కదా.. మీ ఇంట్లో వాళ్లకి తెలిస్తే ముందు మమ్మల్ని అంటారు’ అక్కడే ఉన్న  హాల్‌ మేనేజర్‌ నిలదీశాడు.    ‘చూడండి సార్‌.. మీ అమ్మాయి స్కూల్‌ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్తున్నది’ - స్కూల్‌ ప్రిన్సిపల్‌ కంప్లయింట్‌. ‘ఆ బట్టలు.. టామ్‌బాయ్‌ జుట్టేంటే! అచ్చు అబ్బాయిలా కనిపిస్తున్నావ్‌. కొంచెం పక్కింటి అమ్మాయిలను చూసైనా మారు’నిత్యం తల్లి  చివాట్లు... కానీ, ఆ అల్లరి అమ్మాయిలో ఫ్యాషన్‌ ప్రపంచాన్ని ఏలే మహారాణి  ఉందని ఎవరూ గుర్తించలేదు. చిన్నప్పటి నుంచీ సినిమాను ప్రేమిస్తూ పెరిగిన ఆ పెంకి పిల్ల కూడా.. అతిరథ మహారథులైన సినీ ప్రముఖులకు దుస్తులు డిజైన్‌ చేస్తానని  ఊహించలేదు. నీతా లుల్లా బాల్యమంతా సికింద్రాబాద్‌లోనే గడిచింది. ఆమె కుటుంబం మారేడుపల్లిలో నివాసముండేది. తండ్రి వ్యాపారి. పనిమీద తరచూ  ముంబయి  వెళ్లేవాడు. అప్పుడప్పుడూ కుటుంబ సభ్యులనూ తీసుకెళ్లేవాడు. సికింద్రాబాద్‌ సెయింట్‌ ఆన్స్‌లో  నీతా చదివేది.  ఎనిమిదో తరగతికి వచ్చేదాకా ఆమె బాల్యం ఎంతో సంతోషంగా గడిచింది. స్కూల్‌ దగ్గరే సంగీత్‌ థియేటర్‌. ఎప్పుడూ ఇంగ్లీష్‌ సినిమాలు వేసేవారు. బడి గోడ దూకి మరీ.. ఫ్రెండ్స్‌తో హాలీవుడ్‌ సినిమాలు చూసేది. తన వేషభాషల్లోనూ హాలీవుడ్‌  ప్రభావం కనిపించేది. జీన్స్‌, టీషర్టు.. బాబ్‌ కట్‌ హెయిర్‌ ైస్టెల్‌. బొంబాయి ప్రయాణాలు.. సినిమాలు.. ఈ రెండూ నీతా చదువును అటకెక్కించేశాయి. 

జీవితాన్ని మార్చేసిన ‘మ్యాగజైన్‌'

ఓరోజు తండ్రితో కలిసి నిజాం క్లబ్‌కి వెళ్లింది నీతా. అక్కడ ఉన్న ‘సెవెంటీన్‌', ‘కాస్మోపాలిటిన్‌' మ్యాగజైన్లు  ఆకర్షించాయి. టీనేజ్‌ బాలికలకు, మహిళలకు ఫ్యాషన్‌, వినోద కథనాల్ని అందించే ప్రఖ్యాత పత్రికలవి. తొలిసారిగా అందం-చందం, ఆకర్షణీయమైన దుస్తులపైకి నీతా మనసును మళ్లించాయి.  అప్పటివరకూ ఆమె నిఘంటువులోనే లేని ైస్టెల్‌, ఫ్యాషన్‌, మోడల్‌లాంటి పదాలను పరిచయం చేశాయి. ఖరీదు ఎక్కువైనా తండ్రిని ఒప్పించి మరీ చందా కట్టించింది. ఎప్పుడూ ఆ పత్రికల్ని చూస్తూ కాలం గడిపేది. ఈ లోగా సంబంధం రావడం.. పదహారు ఏండ్లకే తాళి కట్టించుకోవడం కూడా జరిగిపోయింది. భర్త మానసిక వైద్యుడు. ముంబైలో కాపురం. చిన్న పిల్లే కాబట్టి అత్తమామలు పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు. ఏడాదికే  కొడుకు సిద్ధార్థ్‌ పుట్టాడు. ఓ రోజు మామగారు ‘మాది విద్యాధికుల కుటుంబం. ఇలా హైస్కూల్‌ చదువుతోనే ఆపేస్తే కుదరదు. నీకు నచ్చిన రంగంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చెయ్‌' అని సలహా ఇచ్చారు. కానీ, తనకు ఉన్నత విద్యపై ఆసక్తి లేదు. అంతలోనే, ఫ్యాషన్‌ మ్యాగజైన్లు గుర్తుకొచ్చాయి. దీంతో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేస్తానని ఇంట్లో వాళ్లని ఒప్పించింది. 

ఆరితేరిన నీతా

ముంబాయిలోని ఎస్‌ఎన్డీటీ కళాశాలలో  గార్మెంట్‌ మానుఫాక్చరింగ్‌ డిప్లొమా కోర్సులో చేరింది. శ్రద్ధగా పాఠాలు వినేది. క్లాస్‌లో అందరికంటే తెలివైన విద్యార్థినిగా  ప్రొఫెసర్లను ఆకట్టుకున్నది. మేకప్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఫ్యాషన్‌ కొరియోగ్రఫీలో ఆరితేరింది. ఈ క్రమంలో ఫ్యాషన్‌ షోల నిర్వహణలో తనకు సహాయకురాలిగా ఉండమని ప్రముఖ ఫ్యాషన్‌ కొరియోగ్రాఫర్‌ జీన్‌ నౌరోజీ అవకాశమిచ్చింది. అలా కొంత క్షేత్రస్థాయి అనుభవం వచ్చింది.  చదువు పూర్తయ్యాక అదే కాలేజీలో పార్ట్‌టైమ్‌ లెక్చరర్‌గా పనిచేసింది. అంతలోనే సినిమా అవకాశం వచ్చింది.  కానీ, ససేమిరా అన్నారు తల్లి-అత్తగారు. ఒకట్రెండు సినిమాల తర్వాత అవకాశాలు రాకుంటే రెంటికి చెడ్డ రేవడవుతుందని శ్రేయోభిలాషులు హెచ్చరించారు. పదిమంది పది రకాలుగా చెప్పినా.. తన అంతరాత్మ మాటే విన్నది. భర్త కూడా ప్రోత్సహించాడు. అలా బాలీవుడ్‌లో అరంగ్రేటం చేసింది నీతా.  ఆ సినిమాలో నటి స్వప్నను తన డిజైన్లతో వెండితెర మీద మరింత అందంగా చూపింది.   తెలుగులో ‘కాంచన గంగ’ హిట్‌ కావడంతో, హీరోయిన్‌ స్వప్నకు హిందీలోనూ అవకాశాలు వచ్చాయి.  ఆమెతోపాటే నీతాకూ.  ఆ సమయంలోనే పాప (నిష్కా) పుట్టింది. ఓవైపు సినిమాలు.. మరోవైపు కుటుంబాన్ని బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకు సాగింది. ఈ క్రమంలో ప్రఖ్యాత  నిర్మాత యష్‌ చోప్రా దృష్టిలో పడింది. టీ సుబ్బిరామిరెడ్డి, యష్‌ చోప్రా కలిసి ‘లమ్హే’ సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ శ్రీదేవి. ఆమె దుస్తుల డిజైన్‌ కాంట్రాక్టు నీతాకు ఇచ్చారు.  చాలెంజ్‌గా తీసుకొని పనిచేసింది.  శ్రీదేవి, నీతాల కాంబినేషన్‌లో మరో సూపర్‌హిట్‌ ‘చాందిని’.  డైరెక్టర్లు నీతాని వెతుక్కొంటూ  వచ్చారు.

శాతకర్ణితో పుట్టింటికి.. 

చారిత్రక సినిమాలు  టెక్నీషియన్లకు పెద్ద సవాలు. అలనాటి సంస్కృతిని ఊహించి, ఆ కాలానికి తగ్గట్టు పనిచేయడమంటే కఠోర శ్రమే. ఆ కళలో నీతా  ఆరితేరింది. అందుకే జోధా అక్బర్‌, మొహెంజొదారో సినిమాలకు అద్భుతంగా దుస్తులను రూపొందించింది. అందుకే దర్శకుడు క్రిష్‌.. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కోసం నీతా తలుపు తట్టాడు. శాతవాహనుల కాలం నాటి దుస్తులు, నగలు ఆమెతో డిజైన్‌ చేయించాడు. ఆ సినిమా కోసం మళ్లీ పుట్టింటికి (హైదరాబాద్‌) వచ్చింది. సెట్స్‌లో యూనిట్‌ కోసం పంచ భక్ష్య పరమాన్నాలు సిద్ధంగా ఉండేవి. అయినా నీతా ఎప్పుడూ ఇడ్లీ.. దోశ మాత్రమే తినేది. తన బాల్యంలోనే ఇడ్లీ, దోశకు ఫిదా అయ్యింది. అలాంటి రుచి మళ్లీ ఎక్కడా చూడలేదని చెప్పేది.  

కుంగుబాటు.. దివ్య భారతి మరణం!


ఒక విషాద సంఘటన నీతాకు నిద్ర లేకుండా చేసింది. అలనాటి అందాల నటి దివ్యభారతి తీవ్ర డిప్రెషన్‌లో ఉండేది. నీతా భర్త శ్యామ్‌ లుల్లా దగ్గర చికిత్స తీసుకునేది. ఆరోజు.. కొత్త సినిమా డ్రెస్‌ డిజైన్‌ గురించి మాట్లాడేందుకు భర్తతో కలిసి దివ్యభారతి ఇంటికెళ్లింది నీతా. వీళ్లిద్దరూ ఉండగానే భర్త షాజిద్‌ నాడియావాలాతో గొడవపడి బాల్కనీ  మీది నుండి పడిపోయింది దివ్య భారతి. భార్యాభర్తలిద్దరూ హాస్పిటల్‌కి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఆ విషాద ఘటన తమ ఎదురుగుండానే జరుగడం.. దివ్యను రక్షించులేకపోయామే అన్న నిస్సహాయత నీతాను వేధించింది. ఆ విషాదం నుండి బయట పడటానికి కొన్నేండ్లు పట్టింది.  డిప్రెషన్‌కు పనిని మించిన చికిత్స లేదని  కాస్త ఆలస్యంగా అయినా అర్థమైంది.   ఈలోగా హమ్‌ ఆప్‌కే హై కౌన్‌, జీన్స్‌, దేవదాస్‌.. వంటి భారీ సినిమాల్లో మాధురి దీక్షిత్‌, ఐశ్వర్యారాయ్‌ల దుస్తులు డిజైన్‌ చేసి ప్రశంసలు పొందింది నీతా. ఈ సినిమాలు చూసిన పలువురు హాలీవుడ్‌ డైరెక్టర్లు  నీతాను వెతుక్కుంటూ వచ్చారు. ఫలితంగా బ్రైడ్‌ అండ్‌ ప్రెజుడిస్‌, వన్‌ నైట్‌ విత్‌ ది కింగ్‌, ప్రొవోక్డ్‌ వంటి హాలీవుడ్‌ చిత్రాలకూ పనిచేసింది. 

తల్లి పోరు.. తండ్రి ఓదార్పు

‘కాలనీలోని ఆడపిల్లలను చూసి నేర్చుకో, జడేసుకొని,  సంప్రదాయ దుస్తులతో ఎంత బాగుంటారో చూడు. నువ్వూ ఉన్నావ్‌.. ఆ బట్టలూ, ఆ టామ్‌బాయ్‌ జుట్టు.. అచ్చు మగపిల్లాడిలాగే కనిపిస్తున్నావ్‌' అని తల్లి ఒకటే పోరు. 1980ల నాటి అన్ని మధ్యతరగతి కుటుంబాల్లో లాగే.. ఆ తల్లి కూడా పొరుగింటి అమ్మాయిలతో పోలుస్తూ వంటా-వార్పూ, కుట్లూ-అల్లికలూ నేర్చుకోమనేది. ఇలాగే ఉంటే పెండ్లి సంబంధాలు రావడం కష్టమని  చివాట్లు పెట్టేది. ‘నాకిలాగే ఇష్టం.. నేనిలాగే ఉంటా’ అని తెగేసి చెప్పేది కూతురు. తండ్రి మాత్రం.. నీతాను ఎప్పుడూ వెనకేసుకొచ్చేవాడు. ‘నా బంగారు తల్లిని చేసుకోవడానికి క్యూలో నిల్చుంటారులే‘ అని గారం చేసేవాడు. ఇటు స్కూల్‌లోనూ నీతాపై నిత్యం ఫిర్యాదులే. ఒకరోజు ప్రిన్సిపాల్‌  తల్లిదండ్రులను పిలిచి ఆ అల్లరిపిల్ల  నిర్వాకాల్ని వివరించింది. దీంతో చదువుపై శ్రద్ధ పెట్టాలని తల్లిదండ్రులు ఎంతో చెప్పి చూశారు. అయినా వినకపోవడంతో ఇక పెండ్లి చేసేద్దామని నిశ్చయించారు. అప్పుడు నీతాకు పదహారు ఏండ్లే. జీవితంపై అవగాహన  లేదు. పెండ్లి అంటే అర్థం కూడా తెలియని వయసు. కాకుంటే.. ఆ తర్వాత చదువుకోవాల్సిన అవసరం ఉండదు అన్న ఒక్క విషయమే  సంతోషం కలిగించింది. మొత్తానికి హైస్కూల్‌ చదువును అత్తెసరు మార్కులతో పూర్తి చేసింది. 

ఒక తపన.. సొంత బ్రాండ్‌!


నీతా  సినిమాకే  పరిమితం కాలేదు. ప్రముఖుల కోసం పెండ్లి చీరెలు, నగలు డిజైన్‌ చేయడం, యాడ్‌ ఫిలిం షూట్లలో ైస్టెలింగ్‌ చేయడం, ఫ్యాషన్‌ షోలలో పాల్గొనే మోడళ్లకు శిక్షణ ఇవ్వడంలాంటి పనులతో తీరిక లేకుండా ఉండేది. అయినా ఎదో వెలితి నీతాను నిద్ర పట్టకుండా చేసేది. తనకూ ఓ సొంత బ్రాండ్‌ ఉండాలి. తాను రూపొందిన దుస్తులు, నగలను సొంత లేబుల్‌ ద్వారా ప్రదర్శించాలి అని తపనపడేది.  ఆ కలను నిజం చేసుకోవడానికే ‘నీతా లుల్లా’  బ్రాండ్‌ పేరు మీద సొంత లేబుల్‌ ఏర్పాటు చేసింది. స్టార్‌ హోటళ్లు,  మాల్స్‌లో  ఔట్‌లెట్లను తెరచి ఫ్యాషన్‌ దుస్తులు, నగలు విక్రయిస్తున్నది. 

సునీల్‌ ధవళ, సీఈవో, ద థర్డ్‌ అంపైర్‌ మీడియా,

రీసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌, 9741747700


logo