శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 26, 2020 , 23:30:50

ఎవరు గొప్ప

ఎవరు గొప్ప

ఒకప్పుడు ‘అదృష్టానికి’, ‘తెలివితేటలకు’ మధ్య ఒక వాదన వచ్చింది. ఎవరిమాట నిజమో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. అదృష్టం తన సామర్థ్యాన్ని నిరూపించడానికి ఒక పేద రైతును ఎంచుకుంది. అతని మామిడి పంటని బంగారంలా మార్చింది. కానీ ఆ రైతు మాత్రం తన పంటంతా ఇత్తడి,  ఇనుముగా మారిపోయిందనుకొని చింతించాడు. అప్పుడే అటుగా వెళ్తున్న అక్బర్‌ చక్రవర్తి అతడి దుఃఖానికి కారణమేంటని అడిగాడు. రైతు అంతా వివరించాడు. బంగారు పంటను చూసిన అక్బర్‌ ఆశ్చర్యపోయి, పక్కనే ఉన్న బీర్బల్‌తో ‘ఇతనెవరో కానీ చాలా అదృష్టజాతకుడిలా ఉన్నాడు. రాకుమార్తెను ఈ యువరైతుకు ఇచ్చి వివాహం జరిపించాలనుకుంటున్నాను’ అని చెప్పాడు.  ‘నీ పంటనంతా రాజమహల్‌కు తీసుకురా. నీకు నేను మోయలేనంత ధనంతో పాటు నా కుమార్తెనిచ్చి పెళ్ళి జరిపిస్తాను’ అని రైతుతో అన్నాడు అక్బర్‌.  చక్రవర్తి మాటకు రైతు ఎగిరి గంతేసి తన అంగీకారం తెలిపాడు. ఊళ్ళోకి పరిగెత్తుకుపోయి,  అందరికీ రాకుమార్తెతో తన వివాహం గురించి చెప్పాడు. అంతా అతడిని ఆట పట్టించారు. 

రైతు రాజమహలుకు ఒంటరిగా వెళ్ళాడు. రాకుమార్తెతో అతడి వివాహం జరిగింది. అదే రోజు రాకుమార్తె నిండుగా వస్ర్తాలు ధరించి అతని గదిలోకి ప్రవేశించింది. ఆమెను చూడగానే పిశాచిగా భావించాడు రైతు. భయంతో పారిపోయి నదిలో దూకాడు. రాకుమార్తె అరుపులు విన్న  సైనికులు అతడి వెంట పరుగుతీసి కాపాడారు. రైతుపై కోపంతో అక్బర్‌ అతనికి ఉరిశిక్ష విధించాలని నిర్ణయించాడు. ఇదంతా జరిగిన తర్వాత ‘తెలివితేటలు’ అదృష్టంతో ఇలా అంది.. ‘చూశావా, నీవు ఆ పేదరైతుకు ఎంతటి కష్టాన్ని తెచ్చి పెట్టావో? నేనే అతడిని కాపాడతాను’. అంతే, విజ్ఞానం రైతు మెదడులోకి ప్రవేశించింది. వెంటనే రైతు జాగృతమై ఇలా అన్నాడు.. ‘ప్రభూ! ఏ నేరానికి నాకు ఉరిశిక్ష విధించాలనుకుంటున్నారు? నిన్న రాత్రి ఒక వ్యక్తి నదిలో మునిగిపోతూ, కాపాడమంటూ హాహాకారాలు చేశాడు.

నేను విన్నాను. పెళ్ళి జరిగిన రోజు రాత్రి, ఎవరైనా నీటమునిగి చనిపోతే అది ఆ పెళ్ళికూతురికి అశుభసూచకం కదా ! అందువల్ల నేను అతడిని కాపాడటానికి పరుగెత్తాను. నేను నిన్న రాత్రి చేసినదంతా మీ కూతురి క్షేమం కోసమే’.  ఈ మాటలు విన్న రాజు అతడిని క్షమాపణలు వేడుకుని ఆలింగనం చేసుకున్నాడు.


logo