శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 26, 2020 , 02:29:11

జనం తగ్గి.. జవం పెరిగి!

జనం తగ్గి.. జవం పెరిగి!

  • 2100 కల్లా ప్రపంచ జనాభా 880 కోట్లు
  • తగ్గనున్న ఆహార కొరత, కర్బన ఉద్గారాలు
  • 20కి పైగా దేశాల్లో ఇప్పటికంటే సగమే జనం
  • 109 కోట్లతో అత్యధిక జనాభా దేశంగా భారత్‌
  • వాషింగ్టన్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి

2100 సంవత్సరం నాటికి ఇరవై కంటే ఎక్కువ దేశాల్లో జనాభా సగానికి పడిపోతుంది. ఇప్పుడు ఐక్యరాజ్యసమితి ఊహిస్తున్నట్టు ఈ శతాబ్దం చివరికి ప్రపంచ జనాభా 1100 కోట్లు ఉండదు. 880 కోట్లకే పరిమితం అవుతుంది. భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుంది. ఆఫ్రికా దేశాల్లో  నైజీరియా సూపర్‌ పవర్‌గా మారుతుంది. భారత జనాభా 109 కోట్లకు పడిపోతుంది. అయినప్పటికీ ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా అవతరిస్తుంది. అయితే జనాభా తగ్గడం వల్ల కర్బన ఉద్గారాలు తగ్గి  పర్యావరణానికి మేలు జరుగుతుంది. 

మితిమీరిన జనాభా కారణంగా సహజ వనరులు అంతరించిపోతున్నాయని, ఆహార కొరత వేధిస్తున్నదని అనేక మంది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే అమెరికాలోని ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌(ఐహెచ్‌ఎమ్‌ఈ) ఇటీవల అత్యంత ఆసక్తికర అధ్యయనాన్ని వెల్లడించింది.  రానున్న 80 ఏండ్లలో 20 కంటే ఎక్కువ దేశాల్లో జనాభా సగానికి పడిపోతుందని, ఆ దేశాల జాబితాలో చైనా. ఇటలీ, జపాన్‌, పోర్చుగల్‌, పోలెండ్‌, స్పెయిన్‌, థాయ్‌లాండ్‌ కూడా ఉన్నాయని వెల్లడించింది. ఆయా దేశాలు జనాభా కట్టడికి తీసుకుంటున్న చర్యలే అందుకు కారణమని అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త క్రిస్టోఫర్‌ ముర్రే తెలిపారు.  ఆఫ్రికా దేశాల్లో జనాభా పెరుగుతుందని, నైజీరియా 80 కోట్ల జనాభాతో రెండో అతిపెద్ద దేశంగా నిలిచే అవకాశం ఉన్నదని అంచనా వేశారు. జనాభాలో హెచ్చుతగ్గుల కారణంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల్లో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొన్నారు. కలుగజేస్తుంది. అనేక దేశాల్లో చిన్న పిల్లలు, యువకుల జనాభా తగ్గి పనిచేసే వయసున్న జనాభా మీద(వర్కింగ్‌ పాపులేషన్‌) మీద ప్రభావం పడుతుందన్నారు. ఈ వివరాలను లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

భారత జనాభా 161 కోట్లకు.. తర్వాత 109 కోట్లు

ప్రస్తుతం భారత జనాభా 135 కోట్లు. చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది. మరో పాతికేళ్లలో జనాభా పరంగా చైనాను  దాటేసి ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్‌ అవతరిస్తుంది. అయితే తర్వాత భారీగా తగ్గుదల ఉంటుంది. 2100 నాటి మళ్లీ 109 కోట్లకు పడిపోతుంది. అంతేకాకుండా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుంది. కానీ వర్కింగ్‌ పాపులేషన్‌ తగ్గడం వల్ల వృద్ధి నెమ్మదిస్తుంది. 

చైనాలో  73 కోట్లే

చైనాలో ప్రస్తుత జనాభా దాదాపు 144 కోట్లు. కానీ ఈ శతాబ్దం చివరినాటికి 73 కోట్లకు తగ్గనుంది. చైనా ఇప్పటికే జనాభాను తగ్గించడానికి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నది. చాలా కాలం పాటు ‘ఒక్కరు లేదా అసలే వద్దు’  అన్న నినాదంతో సంతానోత్పత్తిపై ఆంక్షలను విధించింది. దీని ప్రభావం ఈ శతాబ్దం చివరినాటికి స్పష్టంగా కనిపించనుంది. అయితే ఈ క్రమంలో వర్కింగ్‌ పాపులేషన్‌  కూడా బాగా తగ్గిపోనున్నది. చైనా ఆర్థిక వ్యవస్థ 2050 నాటికి అమెరికాను దాటుతుంది. కానీ వర్కింగ్‌ పాపులేషన్‌ తగ్గడం వల్ల మళ్లీ పడిపోతుంది. ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌, బ్రిటన్‌ టాప్‌ 10 లో ఉంటాయి. బ్రెజిల్‌, రష్యా ఆదాయం పడిపోతుంది.

పర్యావరణానికి మంచిదే

జనాభా తగ్గుదల పర్యావరణానికి మంచిదే అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. కర్బన ఉద్గారాలు తగ్గుతాయని చెప్పారు. ఆహార కొరత  సమస్య తీరుతుందని తెలిపారు. వనరుల లభ్యత పెరిగి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. అధిక ఆదాయం ఉన్న దేశాలు తమ వలస విధానాల్లో గణనీయమైన మార్పులు చేస్తాయని, వలసలను తగ్గిస్తాయని తెలిపారు. 

నైజీరియా భిన్నం

ఆఫ్రికా దేశమైన నైజీరియాలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మిగతా అన్ని దేశాల్లో జనాభా తగ్గితే నైజీరియాలో పెరుగుతుంది. నైజీరియా జనాభా అప్పటికి 80 కోట్లకు చేరుతుంది. నైజీరియాలో ప్రస్తుతం వర్కింగ్‌ పాపులేషన్‌ 8 కోట్లు అది 45 కోట్లకు పెరుగనుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో టాప్‌ 10 లోకి వస్తుంది. అంతే కాకుండా అక్కడి వర్కింగ్‌ పాపులేషన్‌ కూడా పెరగడం మూలాన వృద్ధి సాధ్యం అవుతుంది. 


logo