సోమవారం 19 అక్టోబర్ 2020
Zindagi - Jul 25, 2020 , 23:34:33

నవ్వించడం..ఏడ్పించడం..రెండూ కష్టమే!

నవ్వించడం..ఏడ్పించడం..రెండూ కష్టమే!

కథానాయికగా గుర్తింపు తెచ్చుకోవడం కంటే  నటిగా పేరు తెచ్చుకోవడమే తనకు ఇష్టమని అంటున్నది అందాల తార రష్మిక మందన్నా. ‘ఛలో’తో  తెలుగు సినీరంగ ప్రవేశం చేసిన  ఈ కన్నడభామ సినిమా సినిమాకూ వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నది. ‘ఛలో’ నుండి ‘భీష్మ’ వరకు నటించిన ప్రతి సినిమాలోనూ తనవైన హావభావాలతో  ప్రేక్షకులను అలరించింది.   కరోనా లాక్‌డౌన్‌ సమయంలో తను కుటుంబంతో  గడుపుతూ..  కొత్త భాషలు నేర్చుకుంటున్నది. అవసరమైతే, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ   షూటింగ్‌లకు సిద్ధమని  అంటున్న రష్మికతో ప్రత్యేక ఇంటర్వ్యూ ..

హాయ్‌! ఎలా ఉన్నారు?

చాలా భయంగా ఉందండి! కరోనా వల్ల అడుగు బయటపెట్టడం లేదు.

కరోనా ఇండియాకూ వచ్చేసిందని తెలియగానే మీ రియాక్షన్‌?

చాలా టెన్షన్‌ పడ్డాను. ఒక వైరస్‌ ప్రపంచం మొత్తాన్నీ వణికించడం.. ఎక్కడివాళ్లను అక్కడ కదలకుండా చేయడం.. ఇది ఊహించని విపత్తు. ఇలాంటి ఓ వైరస్‌ ఉంటుందని నేను కలలో కూడా అనుకోలేదు.

కథానాయికగా కెరీర్‌ ప్రారంభించిన తరువాత ఇంత ఖాళీ ఎప్పుడైనా దొరికిందా?  

ఊహ తెలిసినప్పటి నుంచీ నేను కుటుంబంతో ఇంత సమయం ఎప్పుడూ గడపలేదు. చదువుకునే రోజుల్లో హాస్టల్లో ఉండేదాన్ని. తరువాత పెద్ద చదువుల కోసం కుటుంబానికి దూరంగా ఉన్నాను. అనుకోకుండా దొరికిన ఈ ఖాళీలో కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నాను.

కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నారు?

నా దృష్టిలో స్టేహోమ్‌ అనేది పెద్దపని. ఈ సమయంలో వర్కవుట్స్‌ చేశాను. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చాలా సినిమాలు చూశాను. అభిమానులతో ఫోన్‌ ఇంటరాక్షన్‌, చాటింగ్‌తో కొంత సమయం గడిచిపోయింది. కొన్ని ఇండియన్‌ లాంగ్వేజెస్‌, కొన్ని ఫారిన్‌ లాంగ్వేజెస్‌ నేర్చుకోవడానికి ఆన్‌లైన్‌ క్లాస్‌లు విన్నాను. సమయాన్ని వృథా చేయడం నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడూ ఏదో ఒకటి చేయడం అలవాటు.

కరోనా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

అత్యవసరం అనిపిస్తే తప్ప ఇంటి నుంచి బయటికి వెళ్లలేదు. వెళ్లాల్సివచ్చినా మాస్క్‌ తప్పనిసరిగా ధరిస్తాను. స్టే హోమ్‌-స్టే సేఫ్‌ నియమానికి నన్ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా చెప్పుకోవచ్చు (నవ్వుతూ..). ఎవరికివారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటిస్తే, మీతో పాటు మీ కుటుంబమూ సురక్షితంగా ఉన్నట్టే.

రోజులు ఎలా గడుస్తున్నాయి?

రాత్రి సినిమాలు చూసి పడుకుంటాను. పొద్దునే కాస్త ఆలస్యంగా నిద్రలేస్తాను. కనీసం రెండు గంటలు వర్కవుట్స్‌ చేసిన తరువాత, మిగతా పనులు చూసుకుంటాను. తెలియకుండానే రోజులు, నెలలు గడిచిపోతున్నాయి. ఒక్కోసారి వారాలు, తేదీలు కూడా గుర్తుండటం లేదు.

లాక్‌డౌన్‌ సమయంలో కొత్తగా నేర్చుకున్నది ఏమైనా ఉందా?

మన గురించి మనం ఆలోచించుకునే అవకాశం చాలా తక్కువ సార్లు లభిస్తుంది. ఇప్పుడు నాకు ఆ వీలు చిక్కింది. సెల్ఫ్‌ రియలైజేషన్‌కు అవకాశం దక్కింది.

‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ రూపంలో రెండు విజయాలు దక్కడం ఎలా అనిపిస్తున్నది?

ఆనందంగా ఉంది. విజయం కంటే ఎక్కువగా.. ఆ టీమ్‌తో కలిసి థియేటర్స్‌కు వెళ్లడం, సక్సెస్‌టూర్‌లో పాల్గొనడం, టీమ్‌ అందరితో ఇంటరాక్ట్‌ కావడం నాకు బాగా నచ్చుతుంది.

రష్మిక అనగానే పర్‌ఫార్మెన్స్‌ ఓరియెంటెడ్‌ పాత్రలే అందరికీ గుర్తుకువస్తాయి. ఆ ఇమేజ్‌ ఇష్టమేనా?

ఆనందమే.. నాకు మొదట్నుంచీ హీరోయిన్‌ అనిపించుకోవడం కంటే, నటి అనిపించుకోవడమే ఇష్టం. ప్రేక్షకులు నా నటనను ఆస్వాదిస్తున్నారంటే, చాలా సంతోషంగా ఉంటుంది. నేను కూడా సినిమా సినిమాకూ విభిన్నమైన పాత్రలు చేయడానికే ఇష్టపడతాను.

మీ పాత్ర ద్వారా కామెడీ కూడా పండించారు?  టఫ్‌గా అనిపించిందా?

నా దృష్టిలో ప్రేక్షకులను నవ్వించడం, ఏడ్పించడం రెండూ కష్టమే. ఒకవేళ నేను వాటిలో బెటర్‌గా చేశానంటే ఆ క్రెడిట్‌ నా దర్శకులకే. 

కరోనా తరువాత సినిమా రంగంలో ఎలాంటి మార్పులు వస్తాయని అనుకుంటున్నారు?

ఇప్పుడే ఊహించడం కష్టం. కరోనాకు వ్యాక్సిన్‌ రాకుండా మాస్క్‌లు, భౌతికదూరంతో షూటింగ్‌లు చేయడం ఇబ్బందే.

మీరు షూటింగ్‌కు రెడీనా?

నా దర్శక,నిర్మాతలు రమ్మంటే తగిన జాగ్రత్తలతో షూటింగ్‌లో పాల్గొంటాను. ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు.

ఇటీవల మీరు గ్రీన్‌చాలెంజ్‌లో పాల్గొన్నట్టున్నారు?

సమంత నన్ను నామినేట్‌ చేసింది. నేను ఆమె చాలెంజ్‌ను స్వీకరించి.. రాశి, కల్యాణి, ఆషికలను నామినేట్‌ చేశాను. ప్రస్తుత తరుణంలో అందరూ తప్పకుండా చేయాల్సిన మంచి పని ఇది. ఎవరికి వారు స్వతహాగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలి.

మీ తదుపరి సినిమాలు?

 ప్రస్తుతానికి ‘పుష్ప’ మాత్రమే అంగీకరించాను. మరి కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.                                          

‘పుష్ప’ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

ఇప్పుడే బయటపెట్టడం కరెక్ట్‌ కాదు. కానీ, సుకుమార్‌ సినిమా అంటేనే ప్రతీ కోణం కొత్తగా ఉంటుంది. ఎలాంటి పాత్ర అన్నది చెప్పను కానీ, కలకాలం గుర్తుండిపోయే పాత్ర అని కచ్చితంగా చెప్పగలను. నా కెరీర్‌కు మరో మైల్‌స్టోన్‌ అవుతుంది.

మీ దృష్టిలో నచ్చే పాత్ర అంటే?

ఒక ప్రేక్షకురాలిగా సినిమా చూస్తే.. నా పాత్ర నాకు  నచ్చాలి. అలాంటి పాత్రలే చేస్తున్నాను.

బాలీవుడ్‌ ఆఫర్లు రావడం లేదా?

నన్ను ఇక్కడి నుంచి పంపించాలని అనుకుంటున్నారా? (నవ్వుతూ) కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ కథ, పాత్ర నచ్చకపోతే ఏ సినిమా అంగీకరించను.అలాగే బాలీవుడ్‌లో నచ్చిన కథ రాలేదు. ఒకవేళ వస్తే అప్పుడు చూద్దాం..

-మడూరి మధు


logo