శనివారం 31 అక్టోబర్ 2020
Zindagi - Jul 25, 2020 , 00:11:57

పెద్దగా...ఇబ్బందిగా!

పెద్దగా...ఇబ్బందిగా!

నాకు 35 ఏండ్లు. ఇద్దరు పిల్లల తల్లిని. నా రొమ్ములు ఇంతకుముందు కన్నా చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. ఇది నాకు  ఇబ్బందిగా అనిపిస్తున్నది. కొవ్వు కరిగించే చికిత్సలేవో ఉన్నాయని అంటున్నారు. వీటివల్ల ఫలితం ఉంటుందా? లేదంటే, బ్రెస్ట్‌ సర్జరీ చేయించుకుంటే మంచిదా? తగిన పరిష్కారం తెలుపగలరు. 

- కె.కె., మేడ్చల్‌

చాలామంది మహిళల్ని ఇబ్బంది పెట్టే సమస్య ఇది. సైజు తక్కువ కనిపించడానికి బిగుతైన దుస్తులు వేసుకుంటూ ఉంటారు. దీంతో చెమటలు, రాపిడి వల్ల ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలెక్కువ. కాబట్టి, రొమ్ము సైజు తగ్గించుకోవడానికి ఉత్తమ మార్గం సర్జరీయే. మీ సమస్యకు బ్రెస్ట్‌ రిడక్షన్‌ సర్జరీయే సరైన పరిష్కారం. పెద్ద రొమ్ములు లేదా జైజాంటోమాస్టియా ఉన్నవాళ్లు శారీరకంగా, సామాజికంగా ఇబ్బంది పడుతుంటారు. మెడ, వెన్నునొప్పితో కూడా బాధపడుతారు. అవతలివాళ్లు  ఏమనుకుంటారో అనే దిగులు ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. రిడక్షన్‌ మామోప్లాస్టీ సర్జరీ ద్వారా ఆ పరిమాణాన్ని తగ్గించవచ్చు. ఈ ఆపరేషన్‌ ద్వారా అదనంగా ఉన్న కొవ్వును, చర్మాన్ని తొలగిస్తారు. మంచి ఆకృతి వచ్చేట్టుగా రూపొందిస్తారు. సాధారణంగా ప్రెగ్నెన్సీ తరువాత ఈ సమస్యతో వస్తారు. కొన్నిసార్లు చిన్నవయసులో కూడా ఎదురుకావచ్చు. రొమ్ము ఎంత ఎక్కువ పరిమాణంలో ఉందనేదాన్ని బట్టి సర్జరీ తరువాత మచ్చ ఉంటుంది. రొమ్ముకు సరైన ఆకృతి ఇవ్వడం కోసం కొన్నిసార్లు లైపోసక్షన్‌ కూడా అవసరమవుతుంది. ఈ సర్జరీని జనరల్‌ అనెస్తీషియా ఇచ్చి చేస్తారు. మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. చాలావరకు డేకేర్‌ సర్జరీగానే చేస్తారు. సర్జరీ తరువాత రొమ్ములకు సపోర్టుగా ఉండే దుస్తులను వేసుకోవాల్సి ఉంటుంది. వారం రోజుల వరకు కొంచెం నొప్పి, అసౌకర్యం ఉండవచ్చు. పెయిన్‌ కిల్లర్లు, యాంటిబయాటిక్స్‌ ఇస్తారు.

సాధారణంగా వారం నుంచి పది రోజుల్లోగా సాధారణ స్థితికి వచ్చేస్తారు. కొందరిలో గాయం మానడానికి ఎక్కువరోజులు పట్టొచ్చు. ఈ సర్జరీ పెండ్లి కాని అమ్మాయిలు కూడా చేయించుకోవచ్చు. శస్త్రచికిత్స వల్ల ప్రెగ్నెన్సీకి గానీ, బిడ్డకు పాలివ్వడానికి గానీ సమస్య ఉండదు. చాలామంది బరువు తగ్గడం ద్వారా వాటి పరిమాణమూ తగ్గుతుందని అనుకుంటారు. అల్ట్రాసౌండ్‌, క్రయోథెరపీ లాంటి వాటివల్ల రొమ్ములోని కొవ్వు కరిగిపోతుందనుకుంటారు. కానీ ఫలితం ఉండదు. ఇంజెక్షన్‌ లైపోలైసిస్‌ అని కొందరు చేస్తుంటారు. ఫ్యాట్‌లోకి ఇంజెక్షన్‌ ఇవ్వడం వల్ల అది కరిగిపోతుందని చెప్తారు. కానీ చాలా చిన్న ప్రాంతంలో కొవ్వు కరిగించడం కోసం మాత్రమే పనికొస్తుంది. అంటే డబుల్‌ చిన్‌ ఉండటం, నడుము చుట్టూ కొంత కొవ్వు తీసేయాలన్నా ఇది పనిచేస్తుంది. అంతేగానీ బ్రెస్ట్‌ రిడక్షన్‌కి పనిచేయదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.