మంగళవారం 20 అక్టోబర్ 2020
Zindagi - Jul 24, 2020 , 23:57:13

మంచి స్నేహం

 మంచి స్నేహం

అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది. చాలా మంచిది. చిన్న జంతువులు, పక్షులు ఆ పులి ముందు గెంతులు వేసేవి. పక్షులు భయం లేకుండా దానిముందే వాలి రాలిన గింజలను ఏరుకుని తినేవి. ఆ జంతువులకు, పక్షులకు పులి దగ్గర అంత చనువు ఉంది. ఒక్కోసారి వాటికి ఏదైనా సహాయం కావాలన్నా  పులినే అడిగేవి. పులి కూడా తనకు తోచిన సాయం చేసేది. ఇలా ఉండగా... ఒకసారి ఎండాకాలంలో ఎప్పుడూ  లేనంతగా ఎండలు వచ్చాయి. దాంతో అడవిలో కొంతభాగం ఎండిపోయింది. నదులు, చెరువులూ ఇంకిపోయాయి.  దీంతో జంతువులు, పక్షులు పులి దగ్గరకు వచ్చాయి. ‘పులిరాజా మీరే మమ్మల్ని కాపాడాలి!’ వినయంగా అడిగింది కుందేలు.  ‘చెప్పండి! మీకొచ్చిన కష్టమేమిటి?’ అరాతీసింది పులి. ‘కష్టకాలమొచ్చింది. తినడానికి పచ్చగడ్డి, కందమూలాలు లేకుండా అయింది’ అని చెప్పింది కుందేలు. ‘చెరువులు ఎండిపోయి నివాసం కరువైంది’ అని తెలిపింది తాబేలు. ‘తినడానికి పండ్లు కూడా లేవు’ దుఃఖించింది కోతి.  పులికి విషయం అర్థమైంది. వాటిని ఆపదనుండి రక్షించాలనుకుంది. ‘ మిత్రులారా! పక్కనున్న ఆడవిలో ఇంత కరువు లేదు. మీరు అక్కడికి వెళ్ళండి. అక్కడ నా ప్రాణమిత్రుడు సింహం ఉంటాడు. నేను పంపానని చెప్పండి. మీకు రక్షణగా ఉంటాడు. మిమ్మల్ని ఆదుకుంటాడు. కొంతకాలం అక్కడ ఉండి పరిస్థితులు సర్దుకున్నాక రండి!’ అని పంపింది పులి. ‘అలాగే’ అంటూ జంతువులన్నీ పక్క అడవిలోకి పయనమయ్యాయి. దారిలో వాటికి నక్క ఎదురైంది. అది పక్క అడవికి చెందినది. గుంపుగా వస్తున్న జంతువులను చూసి విషయం తెలుసుకుంది. ‘ఓసి తెలివితక్కువ దద్దమ్మల్లారా! ఆ సింహం సంగతి నాకు తెలుసు. 

అది మీ అడవిలోని పులిలా మంచిది కాదు. మిమ్మల్నందర్నీ ఒక్కరోజులోనే గుటకాయస్వాహా చేస్తుంది’ అంటూ పెద్దగా నవ్వింది. నక్క మాటలకు ఆ జంతువులు, పక్షులు భయపడ్డాయి. ‘నా మాట విని మీరు వచ్చిన దారిలోనే తిరిగి వెనక్కి వెళ్లి, ప్రాణాలు రక్షించుకోండి’ అంటూ నక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. అవన్నీ తక్షణ కర్తవ్యం ఏమిటా... అని ఆలోచించుకోసాగాయి.  ‘మిత్రమా! మనం తిరిగి వెళ్లినా ఆహారం లేక ఎలాగో చనిపోతాం! అదేదో సింహం చేతిలోనే చనిపోదాం!’ అంది కోతి. దాంతో ఇక చేసేది లేక  భయంతో వణుకుతూ సింహం దగ్గరకు వెళ్ళాయి. ‘ఎవరు మీరంతా!’ గర్జిస్తూ అడిగింది సింహం. కోతి చేతులు కట్టుకుని వినయంగా తమ కథ చెప్పింది. సింహం చాలా సంతోషించింది. తన ప్రాణమిత్రుడు పులి తనపై నమ్మకంతో వాటిని పంపినందుకు ఆనందించింది.   రక్షణగా ఉంటానని మాట ఇచ్చింది.  అప్పుడు ఆ చిన్న జంతువులు, పక్షులు పులిరాజు చెప్పి పంపినప్పటికీ..  నక్క మాటలు నమ్మి సింహాన్ని అనుమానించినందుకు సిగ్గుపడ్డాయి. మంచివారు మంచివారితోనే స్నేహం చేస్తారు. పులి ప్రాణమిత్రుడు సింహం కూడా పులి

లాంటిదే... స్నేహాన్ని మించిన గొప్పదనం లేదని గ్రహించాలి.


logo