మంగళవారం 20 అక్టోబర్ 2020
Zindagi - Jul 23, 2020 , 23:10:55

రేపటి ప్రపంచం!

రేపటి ప్రపంచం!

నిరంతరం కొత్తపుంతలు తొక్కడమే టెక్నాలజీ నైజం! ఇప్పుడు మనం వాడుతున్న టెక్నాలజీలన్నీ దశాబ్దాల క్రితం ఆవిష్కరించినవే. వాటి పూర్తి ఫలాలను మనమిప్పుడు అందుకుంటున్నాం. ఈ నేపథ్యంలో.. ఎవరూ ఊహించని  సాంకేతికతలను రాబోయేకాలంలో  చూడబోతున్నాం. మన జీవన శైలి మొత్తాన్నీ అవి ప్రభావితం చేయబోతున్నాయి. మనిషి  టెక్నాలజీ కబంధహస్తాల్లోకి వెళ్లబోతున్నాడని చెప్పడానికి ఇవే నిదర్శనం...

ఆర్టిఫిషియల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌

ఇప్పటివరకూ మనం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ గురించి వింటున్నాం, అక్కడక్కడా చూస్తున్నాం. ఒక నిర్దిష్టమైన విషయాన్ని ఒక మనిషి నేర్చుకున్నట్టుగానే న్యూరల్‌ నెట్‌వర్క్స్‌ ద్వారా ఒక మెషీన్‌ నేర్చుకోవడాన్నే ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌' అంటున్నాం. అనేక రంగాల్లో ఇది ఇప్పటికే  వినియోగంలో ఉంది. అయితే అంతకంటే మరింత శక్తిమంతమైనది ‘ఆర్టిఫిషియల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌'. ఇది భవిష్యత్తుని శాసించనుంది. ఇప్పుడు మనం వాడుతున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కి భిన్నంగా ఈ సరికొత్త టెక్నాలజీ, అదీ ఇదీ అని లేకుండా ఒక మనిషి నేర్చుకున్నట్టు ప్రతీ అంశాన్ని తనంతట తాను నేర్చుకోగలదు. అంతేకాదు, తనకు తాను మళ్లీ ట్రైనింగ్‌ ఇచ్చుకుంటూ అప్పటివరకు నేర్చుకున్న దాన్ని మరింత మెరుగు పరుచుకుంటుంది. అయితే ఈ టెక్నాలజీతో చాలా ప్రమాదం ఉంటుంది. శంకర్‌ ‘రోబో’ సినిమాలో మాదిరిగా మానవ జాతికి చాలా ఉపయోగపడవచ్చు, లేదంటే ఏకంగా మానవజాతి వినాశనానికి కారణమూ కావచ్చు.

మనిషి బుర్రకి ప్రత్యామ్నాయం ఎప్పటికీ రాదనే వాదన వినిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి మనిషి మైండ్‌కు ప్రత్యేకంగా ఎలాంటి భౌతిక రూపమూ లేదు. ఆమె లేదా అతడి తెలివితేటలన్నీ కలిసి మైండ్‌గా రూపుదాలుస్తుంది. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. తనంతట తాను ఆలోచించగలిగే... తనని తాను పర్యవేక్షించుకోగలిగే ఆర్టిఫిషియల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ కచ్చితంగా మనిషి మైండ్‌కి గట్టి పోటీ ఇస్తుందని అనడంలో సందేహమే లేదు.

నానైట్స్‌

ఇప్పుడిప్పుడే రోబోల వినియోగం ప్రపంచవ్యాప్తంగా ఊపందుకుంటున్నది. అయితే భారీ పరిమాణం కలిగిన రోబోల సంగతి పక్కన పెడితే.. అతిసూక్ష్మమైన నానో-రోబోలు దర్శనం ఇవ్వబోతున్నాయి. నీటిలోనూ, గాలిలోనూ, భూ ఉపరితలం మీద, చివరికి మనం తీసుకునే ఆహారంలోనూ, మన శరీరంలోనూ.. ఇలా ప్రతిచోటా వాటిని వినియోగిస్తారు. ఇవి తమకు కేటాయించిన ఏ బాధ్యతల్ని  అయినా విజయవంతంగా పూర్తి చేస్తాయి. దేన్నయినా త్రీ-డి ప్రింటింగ్‌ తీయగలవు. వైద్యుడిలా జబ్బులకు చికిత్స చేయగలవు. అయితే ఇక్కడ అనేక భయాలు వెంటాడుతున్నాయి. అంతర్గతంగా దెబ్బతిన్న అవయవాల మరమ్మతు కోసం భారీ మొత్తంలో సూక్ష్మ రోబోలను వాడటం అన్నది పైపైన బాగానే ఉంటుంది కానీ, వాటిని ఎవరైనా హ్యాక్‌ చేస్తే.. కోడ్‌ మార్చేసి.. అది తాను కమ్యూనికేట్‌ చేయగలిగే శరీరంలోని ఇతర నానోరోబోలకు హాని చేసేలా ఉసిగొల్పితే.. ప్రాణాంతకమే.  

బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌

మనిషి మెదడుకి, కంప్యూటర్‌కి మధ్య అనుసంధానం జరిపి మెదడులో విద్యుత్‌ తరంగాల తీరును అర్థం చేసుకోవడం ద్వారా, ఒక వ్యక్తి ఆలోచనలకు తగ్గట్టు యంత్రాలు పనిచేయడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. పక్షవాతం వచ్చినప్పుడు రోగి మెదడులోని కొన్ని న్యూరాన్ల సమూహాలు దెబ్బతింటాయి. దాంతో, కొంత అంగవైకల్యం వస్తుంది. అలాంటి సమయాల్లో మెదడు అంతర్భాగంలో చిన్న చిప్‌లను అమర్చడం ద్వారా.. మెదడు విద్యుత్‌ సంకేతాలను సంగ్రహించవచ్చు. ఆ సమాచారాన్ని ఆసరాగా చేసుకుని దానంతట అదే టీవీ చానల్‌ మారుతుంది, లైట్‌ ఆన్‌ అవుతుంది. ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌ అవుతుంది.  సమీప భవిష్యత్తులో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ద్వారా ఒకదానితో మరొకటి కనెక్ట్‌ అయ్యే అనేక పరికరాలు మన చుట్టూ రాబోతున్నాయి కాబట్టి.. పక్షవాతం వల్ల గానీ, ప్రమాదంలో మెదడు దెబ్బతిన్న సందర్భాల్లో కానీ జీవితాంతం ఇతరుల మీద ఆధారపడి బతకాల్సిన పనిలేకుండా చిన్నచిన్న పనులను  టెక్నాలజీ ద్వారా పూర్తి చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. అంతేకాదు, ఈ టెక్నాలజీ మన బ్రెయిన్‌లోని ఆలోచనల్ని రీప్రోగ్రామింగ్‌ చేసుకునే వీలు కల్పిస్తుంది. అలాంటప్పుడు మనసులో గూడు కట్టుకున్న అసంతృప్తి, డిప్రెషన్‌ వంటివాటిని కూడా రబ్బరుతో శుభ్రంగా తుడిచేసినంత సులభంగా వదిలించుకోవచ్చు. 

నిర్ణయాలు తీసుకోవడానికి..

ఎలాంటి డ్రెస్‌ వేసుకోవాలి, ఫలానా ఇనిస్టిట్యూట్‌లో చేరాలా వద్దా, ఉద్యోగం అయితే మంచిదా వ్యాపారం చేస్తే మంచిదా.. తదితర అంశాలు మొదలు ఎవరిని పెండ్లి చేసుకోవాలి?.. వంటి కీలకమైన అంశాల వరకూ ఇకమీదట మన తెలివితేటలతో మనకు మనం నిర్ణయించుకోవటం కాదు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా పనిచేసే అసిస్టెంట్‌ డివైజ్‌లు, ప్రోగ్రాములు సలహా ఇవ్వబోతున్నాయి. ఇప్పటికే ఎలాంటి రెస్టారెంట్‌ సెలెక్ట్‌ చేసుకోవాలి, ఏ ప్రదేశానికి టూర్‌ వెళ్లాలి, ఏ రూట్లో ప్రయాణించాలి, స్నేహితులతో చాట్‌ చేసేటప్పుడు ఏ పదాలు టైప్‌ చేయాలి, యూట్యూబ్‌లో ఎలాంటి వీడియోలు చూడాలి ..అన్నది మెషిన్‌ లెర్నింగ్‌ సూచిస్తున్న విషయం తెలిసిందే. మున్ముందు ఇది మన జీవితంలోకి మరింతగా చొచ్చుకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు శరీరాలు మాత్రమే మనవి. నిర్ణయాలూ, ఆలోచనలు అంతా ప్రోగ్రామ్డ్‌గా సాగుతూ ఉంటాయి. 

ఒక వ్యక్తి జీవితకాల అనుభవసారం, అతని ఆలోచనలు, జ్ఞాపకాలు.. అన్నీ మరణంతో తుడిచి పెట్టుకుపోతాయి. అయితే భవిష్యత్తులో ఒక మనిషికి సంబంధించిన మైండ్‌ సమాచారం మొత్తాన్నీ డిజిటల్‌ డివైస్‌లోకి బ్యాకప్‌ తీయవచ్చు. క్లౌడ్‌ సర్వర్లలో సురక్షితంగా భద్రపరచవచ్చు. తరువాతి తరాలకు ఆ అనుభవసారాన్ని బదలాయించడం కూడా సాధ్యపడుతుంది. ఇప్పటికి కేవలం డీఎన్‌ఏ ద్వారా మాత్రమే ఒక తరం ఆలోచనలు, అలవాట్లు మరో తరానికి బదిలీ అవుతున్నాయి. ఒక మనిషి బ్రెయిన్‌ మొత్తాన్నీ బ్యాకప్‌ తీసి, ఆ సమాచారాన్ని సదరు వ్యక్తి సంతానానికి అప్‌లోడ్‌ చేయగలిగితే, చిన్న వయసులోనే జీవితానికి సరిపడా అనుభవాన్ని గడించవచ్చు.

సెక్స్‌ రోబోలు


అన్నిటికంటే ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఇది. మొబైల్‌ ఫోన్‌ వినియోగం పెరిగిన తర్వాత వైవాహిక సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం క్రమేపీ తగ్గిపోతున్నది. మరోవైపు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సెక్స్‌ టాయ్స్‌ వినియోగం పెరిగింది. విదేశాల్లో నచ్చిన ఆకారంలో సెక్స్‌ రోబోలని తయారు చేసి ఇస్తున్నారు. శృంగారపరమైన అవసరాలకే కాదు, భావోద్వేగాలను పంచుకునే విధంగానూ.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా సెక్స్‌ రోబోలను రూపొందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మనుషుల మధ్య పెరుగుతున్న మానసికమైన అగాథం కారణంగా.. ఇప్పుడు ప్రపంచాన్ని ఒంటరితనం తీవ్రంగా వేధిస్తున్నది. దానికి పరిష్కారం అంటూనే ఇలాంటి రోబోలను వినియోగదారుల మీదకు ఎర వేస్తున్నారు. దీనివల్ల కాలక్రమేణా మానవ జాతి అంతరించి పోయే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే యువతరంలో సంతానం పట్ల విముఖత కనిపిస్తున్నది. ఇక భవిష్యత్తును సెక్స్‌ రోబోలు ఆక్రమిస్తే.. పునరుత్పత్తి పూర్తిగా నిలిచిపోయి సృష్టి వినాశనానికి దారి తీస్తుంది. అంతకు మించిన ఉత్పాతం ఏం ఉంటుందీ?

-నల్లమోతు శ్రీధర్‌, టెక్నాలజీ నిపుణులు


logo