శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 22, 2020 , 23:27:08

బాల్యానికి..కరోనా బూచి!

బాల్యానికి..కరోనా  బూచి!

ఆటలంటే ఆసక్తి లేదు. ఆన్‌లైన్‌ క్లాసులంటే ఉత్సాహం లేదు. కార్టూన్‌ నెట్‌వర్క్‌ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇష్టమైన చిరుతిండ్లు ముందుపెట్టినా స్పందించడం లేదు. బాల్యానికి ఎందుకింత నిర్లిప్తత! ఉద్యోగాల్లో అభద్రతలు, కరోనా భయాలు, సోషల్‌ మీడియా గాలివార్తలు.. నెగెటివ్‌ ఆలోచనల మధ్య ఉక్కిరిబిక్కిరి అయిపోతూ మనం, చిన్నారులలో వచ్చిన మార్పులను గమనించలేకపోతున్నాం.   నాలుగు నెలలుగా బాల్యం తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తున్నది.  తమ చుట్టూ జరుగుతున్న పరిణామాల్ని వాళ్లు కండ్లింతలు చేసుకొని గమనిస్తున్నారు. అనగనగా కథల్లోని రాక్షసుడి పాత్రలో కరోనాను ఊహించుకొని వణికిపోతున్నారు. ఇలాంటి సమయాల్లో ఆ చిన్ని గుండెల్లో ధైర్యం నింపాల్సిన బాధ్యత పెద్దలదే!       

‘మేం చెప్పిన మాట నువ్వు వినలేదు కదా. అందుకే అమ్మకు తలనొప్పి వచ్చింది’ - ఇలాంటి మాటలు చిన్నపిల్లలతో అనడం మనకు అలవాటే. అందుకేనేమో! ఏ సమస్య వచ్చినా దానికి కారణం తమ ప్రవర్తనే అనుకుంటారు. ఇంట్లో పెద్దవాళ్ల ఆందోళనకు కూడా తమవైపు నుంచే కారణాన్ని ఊహించుకుంటారు. ఏడేండ్లలోపు పిల్లల ఆలోచనా ధోరణి ఇలానే ఉంటుంది. పూర్వ జన్మల పాపాల ఫలితమే ఇలాంటి జబ్బులంటూ పెద్దలు కర్మ సిద్ధాంతానికి ముడిపెట్టడం కూడా ఓ కారణం కావచ్చు. బిడ్డల్ని పెంచాల్సిన పద్ధతి ఇది కాదు. సాధ్యమైనంత వరకూ హేతువాద దృక్పథాన్ని అలవాటు చేయాలి. కరోనానే ఉదాహరణగా తీసుకుందాం.. ముందుగా మనం పిల్లలకు కొవిడ్‌ గురించి వివరంగా చెప్పాలి. సమస్య మూలాల్ని వివరించాలి. టీవీల్లో, సోషల్‌ మీడియాలో వచ్చే అరకొర సమాచారం బాలల ఆలోచనల్ని పక్కదారిపట్టిస్తుంది. ‘ఓ విద్యార్థి నా ఆన్‌లైన్‌ క్లాసులో సరిగ్గా స్పందించలేదు. దీంతో కోప్పడ్డాను. దానికి జవాబుగా.. ‘ఎటూ కొవిడ్‌తో అందరం చచ్చిపోతాం కదా టీచర్‌! ఇక చదువులెందకు? అని అమాయకంగా అడిగాడు’ అంటూ తన అనుభవాల్ని పంచుకొంటారు ఒక టీచర్‌. 

నిజం చెప్పాలి

కొవిడ్‌ను పరిష్కారం లేని సమస్యగానో, కరోనా వైరస్‌ను చావేలేని రాక్షసిగానో చిత్రీకరించడం సరికాదు. ఏ సంక్షోభానికి అయినా ఓ పరిష్కారమో, ముగింపో ఉంటాయని వాళ్లకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. తమ ఇల్లు అత్యంత సురక్షితమైన ప్రదేశమనే భావన కలిగించాలి. ముందు జాగ్రత్తలను పాటిస్తే ఎటువంటి ముప్పూ ఉండబోదని అర్థం చేయించాలి. ‘కరోనా నిజంగానే అంత పెద్ద జబ్బా?’ అంటూ ఆదుర్దాగా అడిగిన పిల్లలకు అదో పెద్ద సమస్యే కాదన్నట్టు సర్ది చెబుతుంటారు మరికొందరు తల్లిదండ్రులు. చెబితే భయపడిపోతారన్న అర్థంలేని అపోహ. పిల్లలు తమ సంభాషణల్ని వినకూడదన్న ఉద్దేశంతో వాళ్లకు తెలియని  భాషలో మాట్లాడుకుంటూ ఉంటారు. దీంతో, పసివాళ్లలో తమ ఇంటికి తామే పరాయివారమైపోతున్న భావన కలుగుతుంది. ఇది మంచి పరిణామం కాదు. కరోనా చర్చించకూడని విషయమేం కాదు. భవిష్యత్తులో వాళ్లు ఇంతకు మించిన ఉపద్రవాల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఆ పోరాటంలో కరోనా చేదు అనుభవాలు ఓ పాఠంలా ఉపయోగపడాలి. కాబట్టి, వాస్తవాల్ని వివరించడంలో తప్పులేదు. ఓపిగ్గా వాళ్ల సందేహాలన్నీ తీర్చాలి. ఆ ప్రయత్నంలో శరీర వ్యవస్థ గురించీ, మనిషిలోని రోగ నిరోధకశక్తి గురించీ చెప్పాలి. పోషక విలువల ప్రాధాన్యాన్ని వివరించాలి. బాల్యంలోని అనుభవాలే పిల్లల వ్యక్తిత్వ నిర్మాణానికి పునాదులు అవుతాయి.  

విస్మరించకూడదు

నిన్నటివరకూ ఒళ్లో కూర్చోబెట్టుకున్న తాతయ్య ఇప్పుడు దగ్గరికి కూడా రానివ్వడం లేదు. గోరుముద్దలు తినిపించిన నాయనమ్మ .. దుప్పటి కప్పుకుని ఓ మూలన పడుకుంటున్నది. అప్పటి ముద్దులు లేవు, ముచ్చట్లూ లేవు. హఠాత్తుగా వారిలో వచ్చిన మార్పు బాల్యాన్ని భయపెడుతుంది. తమ మీద అందరికీ ప్రేమ తగ్గిందేమోనని అపార్థం చేసుకుంటారు. అలా అని ఆ అసంతృప్తిని ఎవరితోనూ చెప్పుకోలేరు. ఆ బాధంతా ఏదో ఓ రూపంలో బయటపడుతుంది. కొందరు మొండిగా తయారవుతారు. కొందరు ప్రతిదానికీ వాదించడం మొదలుపెడతారు. కొందరు అకారణంగా ఏడుస్తారు. సరిగా నిద్రపోకపోవచ్చు. సరిగా తినకపోవచ్చు. పక్క తడపవచ్చు. తల్లిదండ్రులతో, తోబుట్టువులతో దురుసుగా ప్రవర్తించవచ్చు. పీడకలలు వెంటాడవచ్చు. ఇలాంటి ఏ చిన్న మార్పులు కనిపించినా  నిర్లక్ష్యం చేయకూడదు.

ఆ చిన్నారుల కష్టాలు వేరు

మిగిలిన పిల్లలు పరోక్షంగా అయినా మనసులోని భావాలు చెబుతారు. భయాలో బాధలో ఉంటే పంచుకుంటారు. కానీ, మానసికంగా ఎదిగీ ఎదగని చిన్నారుల మాటేమిటి? వాళ్లకు పాఠాలు చెప్పే శిక్షణా సంస్థలు అక్కడక్కడా ఉన్నా.. అవన్నీ లాక్‌డౌన్‌లో మూతపడ్డాయి. దీంతో రోజంతా నాలుగు గోడల మధ్యే. గతంలో అమ్మానాన్నలు అప్పుడప్పుడూ గాలిమార్పు కోసం ఏ పార్కుకో తీసుకెళ్లేవారు. కారులోనో, బైక్‌ మీదో అటూ ఇటూ తిప్పేవారు. ఇప్పుడు ఆ చిన్నపాటి ముచ్చట కూడా కరువైపోయింది. బయటికి తీసుకువెళ్లినా.. మాస్కులు పెట్టుకోడానికి ఇబ్బంది పడుతున్నారు. అసహనంతో తీసి పడేస్తున్నారు. సాధారణంగా, ఆ పిల్లలు ముఖ కవళికల ద్వారానే మనసులోని భావాల్ని వ్యక్తం చేస్తారు. కానీ, ఇప్పుడు కరోనా ముసుగులు పెద్ద అవరోధంగా నిలుస్తున్నాయి. దేశంలోని మొత్తం పిల్లల్లో ఆటిజం తదితర సమస్యలు ఉన్నవాళ్లు రెండు శాతం వరకూ ఉంటారు. ఇక శారీరక వైకల్యం ఉన్న పిల్లలు నెలల నుంచీ ఫిజియోథెరపీకి దూరమైపోయారు. నిజమే, లాక్‌డౌన్‌ కారణంగా ఉత్పన్నమైన ప్రతి సమస్యకూ మన దగ్గర పరిష్కారం లేదు. కానీ, ఉన్నంతలో ఉత్తమమైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాలి. బాల్యానికి భరోసా ఇవ్వాలి. 

పోషకాలు

కొవిడ్‌ ఉపాధిని మింగేసింది. జీతాలకు కోతలు పెట్టింది. శ్రామికుల పొట్టకొట్టింది. ఆ ప్రభావం పెద్దలతో పోలిస్తే పిల్లల మీదే ఎక్కువ. పేదరికం పెరిగేకొద్దీ పళ్లెంలో పండ్లూ కూరగాయలూ తగ్గుతాయి. పిల్లల్లో పోషక విలువల లోపాలూ పెరుగుతాయి. ఈమధ్యకాలంలో జరుగుతున్నది అదే. బలవర్ధకమైన ఆహారం తినాలంటూ.. మీడియాలో ప్రచారాలు సరే! వాటిని కొనడానికి సామాన్యుల దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? బిడ్డలకు ఎలా కొనిపెడతారు?

ఆరోగ్యం

కొవిడ్‌ అనే పెద్ద గీత ముందు మిగతా సమస్యలన్నీ చిన్నగీతల్లా కనిపిస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు డబ్భు దేశాలు టీకాల కార్యక్రమాల్ని పక్కనపెట్టాయి. ఆరోగ్య వ్యవస్థ మొత్తం కరోనా మీదే దృష్టి కేంద్రీకరించింది.  టీకాలు వేస్తున్నట్టు తెలిసినా.. పిల్లల్ని తీసుకువెళ్లి వేయించలేని పరిస్థితి తల్లిదండ్రులది. దీంతో రేపటి తరం.. మళ్లీ పోలియోలాంటి రుగ్మతల బారిన పడే ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయి.  

ఆహారం

పేదరికం ఆహార భద్రతను దూరం చేసింది. ఆకలితో  అర్దాకలితో అలమటించే దుస్థితి దాపురిస్తున్నది. ప్రపంచంలోని చాలా దేశాల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు అవుతున్నది. బడులు మూతబడటంతో భోజనశాలలూ మూతపడ్డాయి. ఫలితంగా, ఒక్కపూట అయినా కడుపునిండా తినలేని పరిస్థితి.

ఆన్‌లైన్‌ చదువులు

ఇ-పాఠాలు బాల్యాన్ని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. నూటికి డబ్భుమైంది పిల్లలు ఉపాధ్యాయుల వేగాన్ని అందుకోలేకపోతున్నారు. తాము చదువుల్లో వెనుకబడిపోతున్నామేమో అని ఆందోళన పడుతున్నారు. బడి జీవితంలోని స్వేచ్ఛ, ఆనందం దూరమైపోయిందన్న భావన తొంభైశాతం పిల్లల్లోనెలకొని ఉంది. logo