బుధవారం 21 అక్టోబర్ 2020
Zindagi - Jul 22, 2020 , 23:26:54

WE ఫర్‌ విక్టరీ!

WE ఫర్‌ విక్టరీ!

‘ఇది కాదు జీవితం. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలి. నలుగురికీ ఉపాధి కల్పించాలి. సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలి’ అని ఎవరికైనా ఉంటుంది. ఈ కలను సాకారం చేసుకునేవారు కొందరే. ముఖ్యంగా గ్రామీణ మహిళలకు ఎన్నో ఆశలు. కానీ, సరైన ప్రోత్సాహం లేక ఇంటికే పరిమితం అవుతారు. మరికొందరు ప్రారంభించినా, మార్గనిర్దేశనం లేకపోవటం వల్ల ఆశించిన స్థాయిలో లాభాలు సాధించలేరు. ఇలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన వి-హబ్‌ (విమెన్‌ ఆంత్రప్రెన్యూర్స్‌ హబ్‌) అండగా నిలుస్తున్నది. జర్మనీ ప్రభుత్వ సహకారంతో జీఐజెడ్‌తో కలిసి గ్రామీణ ప్రాంత మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తోడ్పాటు అందించే ‘హర్‌ అండ్‌ నౌ’ కార్యక్రమం చేపట్టింది వి-హబ్‌. ఈ ప్రాజెక్టులో భాగం గా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో బూట్‌ క్యాంపులు ఏర్పాటు చేసి అవకాశాల గురించిన అవగాహన కల్పించింది. మూడువేల మందిలో నుంచి ముప్పై మందిని ఇంక్యుబేషన్‌ కార్యక్రమానికి ఎంపిక చేశారు. వీరికి ఆరు నెలలపాటు శిక్షణ ఇచ్చారు. రుణాల రూపంలో తోడ్పాటు అందించారు. ‘మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వి-హబ్‌ సిద్ధంగా ఉంది. ప్రాజెక్ట్‌ హర్‌ అండ్‌ నౌలో  శిక్షణ తీసుకున్నవారు ఇప్పుడు పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారు’ అంటారు వి-హబ్‌ సీఈవో దీప్తి రావుల. ఆ ముప్పై మందిలో ఇద్దరి విజయగాథలు.. 

నడివయసులో..వ్యాపారం!

గానుగ నూనెకు ప్రాధాన్యం పెరిగిపోతున్న నేపథ్యంలో నాకూ దానిని ఉత్పత్తి చేయాలనే ఆలోచన వచ్చింది. ఎద్దు గానుగతో పల్లి, కొబ్బరి, నువ్వులు, కుసుమ నూనె.. ఉత్పత్తి ప్రారంభించాను. అయితే వి-హబ్‌ శిక్షణకు ఎంపికైన తర్వాత, నా వ్యాపారం ఊపందుకున్నది. శిక్షణలో భాగంగా.. ఉత్పత్తి ఎలా పెంచాలి, మార్కెటింగ్‌ ఎలా చేయాలి అన్నది నేర్పారు. అప్పటి వరకు ఇవన్నీ నాకు తెలియవు. ఆ సూచనలు పాటించి నెలకు రూ.70వేల దాకా సంపాదిస్తున్నాను. మరో పదిమందికి ఉపాధి కల్పిస్తున్నాను. 57 ఏండ్ల వయసులో  వ్యాపారాన్ని మరింత విస్తరించాలనే ఆకాంక్షలను నాలో కలిగించిన వి-హబ్‌కు ధన్యవాదాలు. మొత్తం ఆరు గానుగలు నడుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే హైదరాబాద్‌ నుంచీ ఆర్డర్స్‌ వస్తున్నాయి. 

-జయమ్మ, గండీడ్‌ గ్రామం, మహబూబ్‌నగర్‌ జిల్లా

బతుకుతూ.. బతికిస్తున్నా!

బీటెక్‌ తర్వాత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేశాను. పెండ్లి అయ్యాక పాపతోనే సమయం సరిపోయేది. అందుకే ఉద్యోగం మానేసి ఖమ్మం వచ్చేశాను. స్వయం ఉపాధి కింద పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించాను. ఇక్కడే, వి-హబ్‌ వర్క్‌ షాపు ఉందని తెలిసి వెళ్లాను. ఆరు నెలల పాటు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. వ్యాపార నిర్వహణ, ఉత్పత్తి పెంపు, మార్కెట్‌ వ్యూహాలు, అకౌంటింగ్‌ తదితర విషయాలు బోధించారు. బ్యాంకుల నుంచి రుణాలు ఎలా పొందవచ్చు, పెట్టుబడులను ఎలా సమీకరించుకోవచ్చు.. అనేవీ వివరించారు. గతంలో రోజుకు ఐదు కిలోల పుట్టగొడుగులు మాత్రమే ఉత్పత్తి చేసే వాళ్లం. ఇప్పుడు పదిహేను కిలోల వరకూ చేస్తున్నాం. ప్రతి నెలా రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు సంపాదిస్తున్నాను. మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నాను. వి-హబ్‌ శిక్షణ ఎంతో హెల్ప్‌ అయ్యింది. ప్రొఫెషనల్స్‌తో ట్రైనింగ్‌ ఇప్పించారు. ప్రత్యేకంగా ఒక మెంటర్‌ను కేటాయించారు. ఇప్పుడు ఏ అవసరం ఉన్నా ఫోన్‌ద్వారా సలహాలు పొందుతున్నాను. నాకు వర్కింగ్‌ క్యాపిటల్‌ ఇప్పించే ప్రయత్నం జరుగుతున్నది.  

- కావ్య, తెల్డర్‌పల్లి, ఖమ్మం జిల్లా


logo