సోమవారం 26 అక్టోబర్ 2020
Zindagi - Jul 21, 2020 , 23:54:21

ఎవరు గుడ్డి?

ఎవరు గుడ్డి?

‘మన నగరంలో ఎంతమంది గుడ్డివాళ్లు ఉన్నారు’ అని ఒకరోజు అక్బరు చక్రవర్తి తన దర్బారులో ప్రశ్నించాడు. ఎవరూ జవాబు చెప్పలేకపోయారు. అప్పుడు అక్బర్‌.. బీర్బల్‌ వైపు చూశాడు. ‘నువ్వయితే కచ్చితంగా సమాధానం చెప్పగలవు’ అని అన్నాడు. దానికి బీర్బల్‌ ‘ప్రభూ నేను సమాధానం చెప్పగలను, కానీ కొంత సమయం కావాలి’ అని కోరాడు. దీనికి చక్రవర్తి సరే అన్నాడు. ఈ ప్రశ్నకు సమాధానం తెలివిగా ఉండాలని బీర్బల్‌ పథకం వేశాడు. ఆ మరునాడు జనసంచారం ఎక్కువగా ఉన్నచోట  చెప్పులు కుట్టడం ప్రారంభించాడు బీర్బల్‌. కొద్ది దూరంలో అతను నియమించిన వారు కాగితం, కలం పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. బీర్బల్‌ను చూసి చాలామంది ‘మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు?‘ అని అడగసాగారు. అలా అడిగిన వారి పేర్లను బీర్బల్‌ సేవకులు కాగితంలో రాసుకున్నారు. అదే రోజు సాయంత్రం అక్బర్‌ చక్రవర్తి విహారానికి బయలుదేరాడు. బీర్బల్‌ కూర్చున్న వైపు వచ్చారు. అక్బర్‌ కూడా అందరిలాగే అదే ప్రశ్న వేశాడు. ‘చెప్పులు కుడుతున్నాను ప్రభూ’ అని బీర్బల్‌ సమాధానం చెప్తుండగానే, సేవకులు రాస్తున్న జాబితాలో అక్బర్‌ చక్రవర్తి పేరు కూడా చేరింది. మరునాడు బీర్బల్‌ దర్బారులో చక్రవర్తికి గుడ్డివారి జాబితాను సమర్పించాడు. ఆ జాబితా తీసుకుని ఆసక్తిగా పరిశీలించాడు చక్రవర్తి. అందులో చివరన తన పేరు చూడగానే ఉలిక్కిపడ్డాడు. ‘ఇదేమిటి బీర్బల్‌? ఇందులో నా పేరు కూడా ఉంది. నేను గుడ్డివాడినా?’ అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. బీర్బల్‌ చేతులు జోడించి ‘ప్రభువులవారు మన్నించాలి. కొందరు పుట్టుకతో గుడ్డివారయితే, మరి కొందరు చూపు ఉండీ గుడ్డివారే. నిన్న నేను చేస్తున్న పని స్పష్టంగా కనబడుతున్నా  ‘ఏం చేస్తున్నారని’? అందరూ నన్ను ప్రశ్నించారు. చివరికి ప్రభువులవారు కూడా. మరి ఇలాంటి వాళ్లంతా గుడ్డివారే కదా ప్రభూ!’ అన్నాడు బీర్బల్‌. తను అడిగిన ప్రశ్నకు మరొక కోణంలో సరదాగా జవాబు  చెప్పన బీర్బల్‌ యుక్తికి ముసిముసిగా నవ్వుకున్నాడు అక్బరు చక్రవర్తి.


logo