గురువారం 29 అక్టోబర్ 2020
Zindagi - Jul 20, 2020 , 23:59:02

జిత్తులమారి తేలు

జిత్తులమారి తేలు

అనగనగా రామాపురం అనే పల్లెటూరిలో ఒక చెరువు ఉండేది. ఆ చెరువులో తాబేలు, గట్టున తేలు ఉండేవి. ఒక రోజు అవి ఈత పోటీ పెట్టుకున్నాయి. దీంట్లో తాబేలు గెలిచింది. తేలుకు చిర్రెత్తింది. అప్పటి నుంచి తాబేళ్లను అది శత్రువులుగా చూడటం ప్రారంభించింది. ఓడించిన తాబేలుపై ఎప్పటికైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. కొన్ని రోజుల తర్వాత తేలు...  తాబేలు దగ్గరకు వచ్చి మాటలు కలిపింది. ‘మిత్రమా నువ్వు ఎన్నిరోజుల నుంచి ఈ చెరువులో ఉంటున్నావు’ అని తాబేలును అడిగింది. దానికి తాబేలు ‘నేను పుట్టిందే ఈ చెరువులో.. దాదాపు నలభై ఏండ్లు అవుతుంది. అప్పటి నుంచీ ఇక్కడే ఉంటున్నాను’ అని చెప్పింది. ‘అప్పటి నుంచీ నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు’ అని తేలు నోరెళ్లబెడుతూ అడిగింది. దీంతో తాబేలు ‘ఏం చేయాలి మిత్రమా.. ఈ చెరువు లోతుగా, శుభ్రమైన నీటితో ఉంది. మిగతా  చెరువులు ఇలా ఉంటాయా?’ అని జవాబిచ్చింది. అప్పుడే తాబేలుకు  ఓ సందేహం వచ్చింది. ‘నువ్వెందుకు నన్ను మిత్రమా అని పిలుస్తున్నావు. తాబేళ్లను నువ్వు శత్రువుల్లాగా చూస్తావు కదా’ అని అడిగింది. దానికి తేలు  స్పందిస్తూ.. ‘కొద్ది రోజుల క్రితం ఈత పోటీల్లో నువ్వు  నన్ను ఓడించావు. అప్పటి నుంచీ ఈ తాబేళ్లన్నీ నన్ను హేళన చేస్తున్నాయి. అంతే తప్పా శత్రుత్వం లేదు. పైగా మనం ఒకే చెరువు ఆధారంగా బతుకుతున్నాం. మిత్రులుగా ఉండాలి’ అని బుకాయించింది. తేలు మాటలు  నమ్మి తాబేలు దానితో స్నేహం చేసింది. వాటి స్నేహం కొద్ది రోజులు సాగింది. ఒక రోజు తాబేలుకు జ్వరం వచ్చింది. వారం రోజులైనా తగ్గలేదు. తేలు వచ్చి ‘ఈ చెరువు నీరు కలుషితం అవుతున్నది. అందుకే నీకు జ్వరం వచ్చింది. వెంటనే చెరువు విడిచి వెళ్దాం’ అని చెప్పింది.  స్నేహపూర్వకంగానే సలహా ఇస్తున్నదేమో అని అనుకున్న తాబేలు..  తేలు వెంట బయల్దేరింది.  తేలు నేరుగా తీసుకెళ్లి  కలుషిత నీరు ఉన్న చెరువులో తాబేలును వదిలేసింది.  తర్వాత కొద్ది రోజులకు తాబేలు అరోగ్యం  క్షీణించి మరణించింది. తనను  ఈతలో ఓడించినందుకు ఇలా నమ్మించి ప్రతీకారం తీర్చుకుంది. 

- పి. మేఘన, 7వ తరగతి, నారాయణ్‌పేట


logo