ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Zindagi - Jul 20, 2020 , 23:53:50

నిద్ర తగ్గిందా? బరువు పెరుగుతారు!

నిద్ర తగ్గిందా? బరువు పెరుగుతారు!

ఓరోజు తినకపోతే తట్టుకోగలం. కానీ ఒక పూట నిద్ర కరువైతే మాత్రం ఆ రోజంతా జబ్బు పడినట్టుగానే ఉంటాం. మగతగా ఉంటుంది. నిద్ర అంతగా ముఖ్యం మరి. కానీ నగర జీవనంలో అర్ధరాత్రి వరకూ మెలకువతో ఉండటం సాధారణం అయిపోయింది. అందుకే, పట్టణవాసుల ఆరోగ్యం సంక్షోభంలో పడుతున్నదని హెచ్చరిస్తున్నారు వైద్యులు. 

కడుపు నిండా తిండి.. కంటి నిండా నిద్ర.. ఈ రెండింటినీ ఆధునిక జీవనశైలి నిర్లక్ష్యం చేస్తున్నది. మారిన ఆహారపు అలవాట్లు, ఉద్యోగాలు, ఉరుకులు, పరుగులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోనివ్వడం లేదు. ఆరోగ్యకరమైన నిద్రనూ కరువు చేస్తున్నాయి. జీవనశైలి వ్యాధులు పెరిగిపోవడానికి తగినంత నిద్ర లేకపోవడమూ ఒక కారణమే అంటున్నారు వైద్యనిపుణులు. 

అధిక బరువు: 

తగినంత నిద్ర లేకపోతే బరువు పెరుగుతారని హెచ్చరిస్తున్నాయి పరిశోధనలు. మనకు ఆకలైనప్పుడు జీర్ణాశయంలో గ్రెలిన్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తి అవుతుంది. ఇది తగినంత ఉత్పత్తి అయినప్పుడే ఆకలి సరిగ్గా ఉంటుంది. లేకుంటే, తేడా వస్తుంది. ఇకపోతే లెప్టిన్‌ అనే హార్మోన్‌ ఆకలిని తక్కువ చేస్తుంది. తక్కువ సమయం నిద్రించేవారిలో గ్రెలిన్‌ 15 శాతం తక్కువగా ఉత్పత్తి అవుతున్నట్టు గమనించారు. అందుకే, నిద్ర చాలకపోతే గ్రెలిన్‌ ఎక్కువైపోయి, ఎక్కువగా తినేయడంతో  లావయిపోతారు. 

మతిమరుపు మందు: 

జ్ఞాపకశక్తికి మంచి చిట్కా కంటి నిండా నిద్రే. తగినంత నిద్ర వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. నిద్ర చాలకపోతే మెదడు శక్తి సామర్థ్యాలు కూడా తక్కువైపోతాయని హెచ్చరిస్తున్నారు హార్వర్డ్‌ పరిశోధకులు. కొత్త విషయాల్ని మెదడులో చాలా కాలం భద్రపరచుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది నిద్ర. తగినంత నిద్ర లేకపోవడం వల్లనే రాత్రిపూట పనిచేసేవారిలో ఆలోచనాశక్తి మందగిస్తుందని మరో పరిశోధన తెలుపుతున్నది.

స్క్రీన్‌ ఎఫెక్ట్‌: 

ఇటీవలి కాలంలో పిల్లలు స్మార్ట్‌ ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. ఎంత రాత్రయినా పడుకోకుండా వీడియోగేమ్స్‌ ఆడటమో, చాటింగ్‌లు, సోషల్‌ మీడియాల్లో గడపడమో చేస్తున్నారు. ఇప్పుడు ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల రోజంతా స్క్రీన్‌ ముందే ఉంటున్నారు. ఈ కారణం వల్ల ముఖ్యంగా టీనేజర్లలో నిద్ర సరిగా ఉండటం లేదు. ఫలితంగా వాళ్లు డిప్రెషన్‌ బారిన ఎక్కువగా పడుతున్నారని అంటున్నారు మానసిక నిపుణులు. అందుకే రోజుకు ఏడెనిమిది గంటల గాఢనిద్ర తప్పనిసరి.  


logo