బుధవారం 02 డిసెంబర్ 2020
Zindagi - Jul 12, 2020 , 23:33:24

ఎస్‌.. బిజినెస్‌!

ఎస్‌.. బిజినెస్‌!

మహిళా ఆంత్రప్రెన్యూర్స్‌కు వీహబ్‌ అండ : సీయీవో దీప్తి రావుల‘అమ్మాయిలు.. పెద్ద చదువులు చదువుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ, నలుగురికీ నీడనిచ్చే సంస్థలు స్థాపించేవారు ఎంతమంది? అసలు అమ్మాయిలు ఆంత్రప్రెన్యూర్స్‌గా ఎదగగలరా? వ్యాపార సామ్రాజ్య స్థాపన వారివల్ల అవుతుందా? అసలు, ఆ దిశగా ఆలోచించడం, విజయం సాధించడం సాధ్యమేనా? - ఆంత్రప్రెన్యూర్స్‌గా ఎదగాలనుకునేవారిలో ఎన్నో అనుమానాలు. వాటన్నిటికీ సమాధానం మా దగ్గర ఉంది..’ అంటున్నారు వీహబ్‌ సీయీవో దీప్తి రావుల.  అవును, సొంత సంస్థను స్థాపించాలనుకునే యువతులకు వీహబ్‌ ఒక వేదిక, ఆసరా, దిక్సూచి, సర్వస్వమూ!

‘మన దేశంలో మహిళలు మహా అంటే ఉద్యోగం చేసి తమ కాళ్ల మీద తాము నిలబడాలనుకుంటారు. కానీ చాలా తక్కువ మంది ఒక సంస్థను నెలకొల్పాలనీ నలుగురికీ అండగా ఉండాలనీ ఆశిస్తారు. ఆ సంకల్పం ఉన్న వారికి చేయూత ఇచ్చేందుకు  ఏర్పడిన వేదికే వీహబ్‌' అని చెప్పారు దీప్తి రావుల, వీహబ్‌ సీయీవో. స్త్రీలు సంస్థలను నెలకొల్పే ధైర్యం చేయలేకపోవడానికి కారణం.. సరైన అవగాహన లేకపోవడమే. ఓ అండ అంటూ దొరికితే వాళ్లూ అద్భుతాలు సృష్టించగలరన్నది దీప్తి అభిప్రాయం. సంస్థ వరకూ ఎందుకు? అసలు వ్యాపారం అంటేనే మాటలు కాదని భయపెట్టే వారే  ఎక్కువ. 

ఆమెను నమ్మి పెట్టుబడి పెట్టేందుకు అయినవాళ్లే జంకుతారు. మనలో ఇంకా అంతటి చైతన్యం రాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఔత్సాహికులైన మహిళా పారిశ్రామికవేత్తలకు ధైర్యాన్ని ఇచ్చి మార్గదర్శనం చేసే పెద్దదిక్కు కావాలి. ఆ బాధ్యత తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వీహబ్‌ తీసుకుంది - అని ధైర్యం చెబుతారు ఆమె. దేశంలోనే మొట్టమొదటగా మన రాష్ట్రంలో  ఇలాంటి ఒక వేదికను ప్రారంభించుకున్నాం. వీహబ్‌ ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు అన్ని రకాలుగా వెన్నంటి నిలు

స్తుంది. శిక్షణ ఇస్తుంది. సాంకేతిక సహకారం అందిస్తుంది. పెట్టుబడి సమకూర్చుకునేందుకు అవసరమైన మార్గాలు చూపుతుంది. ఒకటేమిటి, ప్రతి మలుపులో నేనున్నానంటుంది. పరిశ్రమను నెలకొల్పిన తర్వాత కూడా.. విజయవంతంగా నడిపేందుకు అవసరమైన నిర్వహణా సహకారం అందిస్తుంది. ఉత్పాదక రంగంలో మహిళల భాగస్వామ్యం పెంచడమే వీహబ్‌ లక్ష్యం. ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో మహిళా పారిశ్రామిక వేత్తల వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలను రూపొందించింది. ఇప్పటికే నడుస్తున్న సంస్థలు మరింత వృద్ధిని సాధించడానికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.

 పల్లెల్లో కూడా....

ఉత్సాహవంతులైన మహిళలు పల్లెల్లో కోకొల్లలు. గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి. ఇక్కడ కనుక, స్వయం ఉపాధిని సాధించగలిగితే దేశం ఆర్థికంగా విజయపథంలో సాగుతుంది. స్థానికంగా లభించే వనరులను ముడిసరుకుగా చేసుకుని.. పరిశ్రమలను ఏర్పాటు చేస్తే..  గ్రామీణ యువతకు ఉపాధి దొరుకుతుంది. ‘అయితే దురదృష్టవశాత్తు మనకు అలాంటి అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. పల్లెల్లో ఈ తరహా వాతావరణాన్ని ప్రోత్సహించడానికి వీహబ్‌ కృషి చేస్తున్నది’ అని వివరించారు దీప్తి. ఇందులో భాగంగా 2019 డిసెంబర్‌లో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 29 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మూడురోజుల రెసిడెన్షియల్‌ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వహణకు అవసరమయ్యే ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించారు. 


‘పట్టు’దల!

ఒక సెరీకల్చర్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నది శిల్ప ఆశయం. ప్రాజెక్ట్‌ రిపోర్టుతో వీహబ్‌ను సంప్రదించారు. ఈ గ్రామీణ కుటీర పరిశ్రమ ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తుంది. మొదట్లో ఆమె పట్టుదారాల తయారీ గురించి మాత్రమే ఆలోచించారు. కానీ వీహబ్‌ని సంప్రదించిన తర్వాత పట్టుదారాల రీలింగ్‌ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందుకు బ్యాంక్‌ రుణం మంజూరు చేయించడంలో వీహబ్‌ తోడుగా నిలిచింది. 

విద్యార్థులకు.. 

చదువు పూర్తయ్యే నాటికి.. తర్వాత ఏం చేయాలనే విషయంలో అమ్మాయిలకు ఒక అవగాహన ఉండాలి. ఆ దిశగా విద్యార్థుల్లో చైతన్యం కల్పించడంతో పాటు.. వారిలోని సృజనాత్మక, ఉత్పాదక సామర్థ్యాలకు పదును పెట్టడానికి వీహబ్‌ సిద్ధంగా ఉంది.  విద్యార్థి స్థాయి నుంచే ఒక అవగాహన ఉంటే.. కాలేజీ నుంచి బయటికి రాగానే ఆంత్రప్రెన్యూర్‌గా అవతరించవచ్చు. ఉద్యోగాల్ని కోరుకునేవారి కంటే, ఉద్యోగాల్ని సృష్టించేవారు ఎక్కువగా ఉంటేనే.. దేశంలో నిరుద్యోగ సమస్యే ఉండదు  అన్నది దీప్తి ఆలోచన. 

మళ్లీ వెనక్కి..

పిల్లల పెంపకం, పెద్దల బాధ్యతలు, భర్త ఉద్యోగం..వివిధ కారణాలతో చాలామంది మహిళలు వృత్తి వ్యాపారాల నుంచి విరామం తీసుకుంటారు. ఇలా బ్రేక్‌ తీసుకున్నవారు. ఆ తర్వాత.. స్వయం ఉపాధి మొదలు పెట్టాలనుకున్నా, అంతకు ముందు నడిపిన వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించాలని అనుకున్నా..  వీహబ్‌ ప్రోత్సహిస్తుంది. వీఎంవేర్‌ అనే సంస్థతో కలిసి జాతీయ స్థాయిలో ఈ దిశగా పనిచేయాలని సంకల్పించింది వీహబ్‌. దేశ వ్యాప్తంగా 15 వేల మంది మహిళలకు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి విషయాల్లో సాంకేతిక శిక్షణను అందించి, వారిని తిరిగి ఉత్పత్తి వైపు మళ్లించడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

 ప్రస్తుత కష్టకాలంలోనూ..

ఇదో సంక్షోభ సమయం. సంస్థల నిర్వహణలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వీహబ్‌ తీవ్రంగా  ఆలోచిస్తున్నది. వ్యక్తిగతంగా ప్రతి ఆంత్రప్రెన్యూర్‌తో  మాట్లాడుతూ సంస్థాగత నిర్వహణ, ఆర్థిక పునర్నిర్మాణం వంటి అంశాలలో మార్గదర్శనం చేస్తున్నది. ప్రభుత్వ సాయంపై అవగాహన కల్పిస్తున్నది. ఈ విషయంలో ఇప్పటికే వీహబ్‌కు మూడు వందల పైచిలుకు విజ్ఞప్తులు వచ్చాయి. ఇందులో వందకుపైగా విన్నపాలను ఇప్పటికే పరిశీలించింది.  ఆర్థిక స్వావలంబన దిశగా అనేక  సూచనలు చేసింది. ‘ఆంత్రప్రెన్యూర్లుగా ఎదగాలన్న తపనతో ఏ అమ్మాయి సంప్రదించినా మా సహాయ సహకారాలు ఉంటాయి. మహిళలు తలుచుకుంటే ఏమైనా సాధించగలరు’ అని ముక్తాయించారు దీప్తి చిరునవ్వుతో.


‘బంగారు’ కల! 

కరీంనగర్‌కు చెందిన అనూహ్యది స్వర్ణకారుల కుటుంబం. ఇంట్లోనే తండ్రికి నగల తయారీలో సాయం చేసేవారు. అయితే అవన్నీ హ్యాండ్‌ మేడ్‌ నగలు. అవే నగలను యంత్రాలతో తక్కువ కష్టంతో, మరింత మెరుగ్గా తయారు చేయవచ్చన్న ఆలోచన వచ్చింది. వీహబ్‌ను సంప్రదించారు. సాంకేతిక శిక్షణ తీసుకున్నారు. దాదాపు వెయ్యి మంది స్వర్ణకారులకు సాయం చేసే ఉద్దేశంలో ఉన్నారామె.

-భవాని