మంగళవారం 04 ఆగస్టు 2020
Zindagi - Jul 12, 2020 , 23:33:23

ఆలూపొట్టుతో..పొట్ట శుభ్రం!

ఆలూపొట్టుతో..పొట్ట శుభ్రం!

ఆలుగడ్డలంటే ఇష్టపడని వాళ్లు అరుదు. అయితే, మనం చాలావరకు ఆలుగడ్డల పొట్టు తీసేసి వండుకుంటాం. కానీ, ఆలూలోని పోషకాల్లో ఎక్కువ శాతం పొట్టులోనే ఉంటాయంటున్నారు పోషక నిపుణులు. ఆలుగడ్డల పొట్టులో పీచు పదార్థం అపారంగా ఉంటుంది. విటమిన్లు, ఖనిజ లవణాలు, ఫైటో కెమికల్స్‌.. అన్నీ కూడా గడ్డలో కన్నా పొట్టులోనే ఎక్కువ.  విటమిన్‌-సి కూడా అధికమే. దీంతోపాటు విటమిన్‌-బి కాంప్లెక్స్‌, కాల్షియం ఉండటం వల్ల వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

మలబద్ధకానికి..


కూరగాయల పొట్టులో పీచుపదార్థాలు అధికంగా ఉంటాయి. ఆలుగడ్డ పొట్టులో కూడా పీచు పుష్కలం. ఈ పీచును ఆహారంలో చేరిస్తే మలబద్ధకాన్ని నివారించవచ్చు. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. 

క్యాన్సర్‌కు  కవచం


ఆలుగడ్డ పొట్టులో మొక్కల్లోని రసాయనాలు (ఫైటో కెమికల్స్‌) శక్తిమంతమైన యాంటి ఆక్సిడెంట్లుగా ఉపయోగపడుతాయి. దీనిలో క్లోరోజెనిక్‌ ఆమ్లం ఎక్కువ. క్యాన్సర్‌ నుంచి రక్షణనిస్తుంది. 

తగ్గే కొలెస్ట్రాల్‌


పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫినాల్స్‌, ైగ్లెకోఆల్కలాయిండ్స్‌.. అన్నీ కలిసి ఉండటం వల్ల ఆలుగడ్డ పొట్టు కొలెస్ట్రాల్‌ ప్రభావాలను తగ్గిస్తుంది. 

నల్ల మచ్చలకు..

ఆలుగడ్డ పొట్టులో యాంటీ బ్యాక్టీరియల్‌, ఫీనోలిక్‌, యాంటి ఆక్సిడెంట్‌ పదార్థాలు ఉంటాయి. దాంతో ఇది బ్లీచింగ్‌గా పనిచేస్తుంది. అప్పుడే తీసిన పొట్టును ముఖానికి రుద్దుకుంటే, మంచి ఫలితం ఉంటుంది. దీంతో కళ్ల కింద నల్లటి వలయాలు, నల్లమచ్చలు పోతాయి. తరచూ ఇలా చేస్తే, మెరిసే చర్మం మీ సొంతం. 


చర్మ ఆరోగ్యానికి

కాలిన గాయాలకు ఆలుగడ్డ పొట్టు యాంటీ బ్యాక్టీరియల్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని మాయిశ్చరైజ్‌ చేసి, దాని పనితీరు బాగుండేలా చేస్తుంది.  చిన్న గాయాలకు ఆలుగడ్డ పొట్టుతో డ్రెస్సింగ్‌ కూడా చేసుకోవచ్చు. 

షుగర్‌కి చెక్‌


ఆకలి ఎక్కువగా ఉందా.. అయితే ఆలుగడ్డ పొట్టు అనవసరమైన ఆకలిని తగ్గిస్తుంది. పీచుపదార్థం ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర మోతాదు పెరుగకుండా కూడా సహాయపడుతుంది. ఆలుగడ్డ పొట్టును తీసుకుంటే టైప్‌-2 డయాబెటిస్‌ను నివారించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. గుండెజబ్బు రిస్కూ తగ్గుతుంది. 

హెయిర్‌ కలరింగ్‌ కోసం..


జుట్టు తెల్లబడుతుంటే ఆలుగడ్డ పొట్టు ద్వారా అద్భుతాలు చేయవచ్చు. జుట్టుకు సహజమైన రంగు, రూపు ఇవ్వడానికి తోడ్పడే పోషకాలన్నీ ఆలు పొట్టులో ఉంటాయి. 

గుండెకు రక్షణ


ఆలుగడ్డల పొట్టు అధిక మోతాదులో పొటాషియంను కలిగి ఉంటుంది. గుండెపోటు, స్ట్రోక్‌ రిస్క్‌ తగ్గించడంలో పొటాషియం కీలకమైంది. ఇది రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె, రక్తనాళాల ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. ఆలుగడ్డ పొట్టులో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి కూడా గుండెకు రక్షణ నిచ్చేవే. 


logo